– ఆర్టీసీలో టీ9-30 టికెట్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం టీఎస్‌ఆర్టీసీ మరో కొత్త రాయితీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ‘టీ9-30 టికెట్’ పేరుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రూ.50 ధరతో 30 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికోసం ఈ రాయితీ టిక్కెట్‌ను తీసుకొచ్చినట్టు ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. బుధవారం బస్‌భవన్‌లో టీ9-20 టిక్కెట్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ టిక్కెట్ వల్ల పల్లె వెలుగు బస్సుల్లోని ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. పల్లె వెలుగు బస్ కండక్టర్ల వద్ద లభించే ఈ టిక్కెట్లు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని వివరించారు. సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్‌ను కండక్టర్లు ఇస్తారు. రాష్ట్ర సరిహద్దుల్లో 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకూ ఈ టికెట్ వర్తిస్తుందని తెలిపారు. ఈ టికెట్ తీసుకున్న ప్రయాణీకులు తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ తీసుకుని ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చు. ప్రయోగాత్మకంగా నెలరోజులు ఈ టిక్కెట్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రయాణీకుల స్పందనను బట్టి గడువును పొడిగిస్తారు. అలాగే ఇటీవల టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చిన టి9-60 టికెట్‌ను పల్లెవెలు గు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్టు వారు తెలిపారు. గతంలో ఈ టిక్కెట్లను మహిళలు, సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తింపచేశారు. దీనిలో రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయా ణించవచ్చు. ఈ టికెట్ కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో దానికి కొనసాగిం పుగా తక్కువ దూరం ప్రయాణించే వారికోసం టీ9-30 టికెట్‌ను తీసుకొచ్చినట్టు వివరించారు. ఇతర వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000,040-23450033ను సంప్రదించాలని సూచించారు. కార్య క్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వీ రవీందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పీవీ ముని శేఖర్, పురుషోత్తం, కష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్రసాద్, చీఫ్ మేనేజర్ ప్రాజెక్ట్స్ విజరు కుమార్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్ పాల్గొన్నారు.