కేరళలో రూ.600.. తెలంగాణలో రూ.121

Rs.600 in Kerala. Rs.121 in Telangana– ఉపాధి కూలి చెల్లింపులో భారీ వ్యత్యాసం
– ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే కొలతల పద్ధతి
– సగటు వేతనం రూ.272 కూడా అందని దౌర్భాగ్యస్థితి
– మూడు నెలలుగా కూలీల వేతనాలు పెండింగ్‌లోనే
– వేతనాల చెల్లింపు ఆధార్‌ అనుసంధానంతో తిప్పలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎర్రటెండలో పనిచేసినా ఉపాధి కూలీలకు కూలి అంతంతే దక్కుతున్నది. ఇప్పటిదాకా కూలీల రోజువారీ వేతనం రూ.272 ఉండగా…ఈ ఆర్థిక సంవత్సరంలో దాన్ని రూ.300కి పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం గొప్పలకు పోతున్నది. మరి క్షేత్రస్థాయిలో కూలీలకు అంత వేతనం అందుతుందా? అని పరిశీలిస్తే రాష్ట్రంలో సగటు వేతనం రూ.121.78 మాత్రమే వస్తోందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా కేరళలోని వామపక్ష ప్రభుత్వం కూలీలకు రోజువారీ కూలి రూ.600ని చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం అమలు కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. వేతన చెల్లింపులో కేరళ, తెలంగాణ మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తున్నది. కర్నాటక, తమిళనాడు, ఏపీ, తదితర రాష్ట్రాలతో పోల్చి చూసినా మన రాష్ట్రంలో ఉపాధి కూలీలకు దక్కుతున్న వేతనం చాలా తక్కువనే. మళ్లీ అందులోనే రోజువారీగా ఖర్చులకు ఇచ్చే రూ.23 (మంచినీళ్ల ఖర్చు రూ.5, గడ్డపార సానకు రూ.10, రవాణా ఖర్చులు రూ.8)ను కలిపేస్తున్నారు. అంటే ఇక్కడ కూలీలకు వంద రూపాయల లోపే దక్కుతున్నది. సర్కారు ఇచ్చే అరకొర వేతనమూ నెలల తరబడి పెండింగ్‌లోనే ఉన్నది. గతంలో వారం వారం పేమెంట్‌ అందేది. ఒకవేళ 15 రోజుల్లోపు కూలి ఇవ్వకపోతే కూలీలు కోర్టుకెళ్లే అవకాశముంది. ఎన్నినెలలు ఇవ్వకపోతే చట్టప్రకారం వడ్డీ కట్టించి ఇవ్వాలనే నిబంధన ఉంది. కేరళలో ప్రతి 15 రోజులకోసారి కూలీల డబ్బులు చెల్లించబడుతున్నాయి. వేతనాల రెగ్యులర్‌ చెల్లింపు శాతం 99.98 శాతముంది. 0.2 శాతం కూడా టెక్నికల్‌, ఇతరత్రా సమస్యల వల్ల ఆలస్యమయ్యేవే. ‘మూడు నెలలుగా వేతనాలు అందట్లేదు. కూలీలు కూడా పనులకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఒకప్పుడు మా ఊర్లో 400 నుంచి 500 మందిదాకా పనులకొచ్చేవారు. ఇప్పుడు రమ్మని పిలిచినా వంద దాటట్లేదు’ అని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ ఫీల్డు అసిస్టెంటు చెప్పుకొచ్చారు. పేస్లిప్పులు కూడా కొన్నేండ్లు ఇవ్వడం లేదు. దీంతో రోజువారీ కూలి ఎంత పడుతుందో కూలీలకు అర్థం కాని పరిస్థితి. వేతనాలు తక్కువ పడటానికి కొలతల ప్రకారం చెల్లించడమేనని ఉపాధి హామీ కూలీల తరఫున పోరాడే వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర సంఘాలు చెబుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే కొలతల పద్ధతిని అనుసరిస్తున్నారు. గ్రామంలోనే మ్యానువల్‌ పద్ధతిలో చెల్లించాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు. వేతనాల చెల్లింపు ఆధార్‌తో అనుసంధానం చేయడం కూడా సమస్యకు ఒక కారణంగా చూడొచ్చు. రోజుకు రెండు సార్లు పని ప్రదేశం నుంచి ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేయడం కష్టతరంగా మారింది. పనిప్రదేశాల్లో సరిగా సిగల్స్‌ లేకపోవడం ఓ సమస్యగా మారింది. సిగల్స్‌ కోసం అటూ ఇటు తిరగడం, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అయ్యేదాకా కూర్చోవటం ఇబ్బందికరంగా మారింది.
వందరోజుల పని అంతంతే..
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేదలకు కనీసం రెండు వందల రోజుల పని కల్పించాలని డిమాండ్‌ వస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక కుటుంబానికి కనీసం వంద రోజుల పాటు కూడా పని కల్పించలేకపోతున్నది. మన రాష్ట్రంలో 58,59,030 జాబుకార్డులుండగా..అందులో 29వ తేదీ వరకు 30 లక్షల కుటుంబాలకే వందరోజుల పని దక్కిందని ప్రభుత్వ గణాంకాలే ఘోషిస్తున్నాయి. అందులోనూ కుటుంబంలో ముగ్గురు సభ్యులు పనికి పోతే ఒక్కో కూలి కనీసం 30 రోజుల పని కూడా లభించని పరిస్థితి. మరోవైపు మెటీరియల్‌ కంపోనెంట్‌ను 49 శాతానికి పెంచారు. ఇలా చేయడమంటే కాంట్రాక్టర్లను బతికించడమే. ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే చట్టం మూల సూత్రానికే కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది.
కొలతలేయడం ఆపేయాలి..ప్రతి వారం బిల్లులు చెల్లించాలి
– బి.ప్రసాద్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
రాష్ట్రంలో ఉపాధి పనులకు కొలతలేయడం మానేయాలి. దేశంలో ఎక్కడా లేని పద్ధతిని ఇక్కడ అమలు చేయటం సబబు కాదు. వేతనాలు బ్యాంకు అకౌంట్లలో వేయటం సరిగాదు. మ్యానువల్‌ పద్ధతిలో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని వేతనాలను చెల్లించాలి. నెలల తరబడి బిల్లులు ఆపడం సరిగాదు. ప్రతి వారం బిల్లులను క్లియర్‌ చేయాలి. మేట్ల వ్యవస్థను పునరుద్ధస్తే కూలీల సంఖ్య పెరిగే అవకాశముంటుంది. చట్టం మూలసూత్రాలను దెబ్బతీయకుండా వెనుకబడిన సామాజిక తరగతులకు ఉపాధి మరింత కలిగించేలా చూడాలి.

Spread the love