– ప్రయాణికులకు అవసరమైనన్ని బస్సులు నడేపేందుకు ఆర్టీసీ సిద్ధం..
– ప్రయివేటు ట్రావెల్స్ అదనపు చార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తాం
– ప్రయాణీకులకు ఏ సమస్య వచ్చినా రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు : రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
– ఫిర్యాదులొస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సంక్రాంతి పండుగ వేళ.. ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ 6432 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు. అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉందనీ, ఆర్టీసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి మేజర్ బస్ స్టేషన్ వద్ద ప్రత్యేక అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా బస్సుల్లో అదనంగా మహిళలు వచ్చే అవకాశం ఉందని, అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇదే సమయంలో ప్రయివేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు మంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి పండగ పూట ప్రయాణికులను అదనపు చార్జీల పేరుతో దోపిడికి గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న చార్జీలనే వసూలు చేయాలనీ.. అదనంగా వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని తెలిపారు. ట్రావెల్స్ ఆపరేటర్స్ అదనంగా చార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు ఫీల్డ్‌లోనే ఉండి నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులొచ్చినా వెంటనే స్పందించాలన్నారు. తమ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత, సంక్షేమానికే ప్రాధానత్య కల్పిస్తుందని గుర్తుచేశారు. ప్రయాణికులు పండగ సమయంలో జాగ్రత్తగా గమ్యస్థానాలకు వెళ్లాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సురేంద్ర మోహన్, రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్
ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రవాణాశాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ హెచ్చరించారు. నిబంధనలకు మించి అదనపు చార్జీలు వసూలు చేసినా, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినా, సరుకు రవాణా చేసినా, అటువంటి ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులపై కేసు నమోదు చేయడమే కాకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాల్లోని రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామనీ.. వారు ఈ వారం రోజులు ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తారని తెలిపారు. ఇప్పటివరకు ప్రయివేట్ బస్సులపై 150 కేసులు నమోదు చేశామని చెప్పారు. అంతేకాకుండా ప్రయివేట్ బస్సులు నడిపే డ్రైవర్లు అనుభవం గల డ్రైవర్లు ఉండడమే కాకుండా ప్రయాణికుల లిస్టు కూడా సంబంధిత అటెండెంట్ దగ్గర ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమిషనర్ తెలిపారు. కాంట్రాక్టు క్యారేజీ బస్సులకు సంబంధించిన నిబంధనలు అన్నింటిని పాటించాలనీ.. లేనిపక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.