ఆర్టీసీ అడ్డతోవ

– ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’ పేరుతో ప్రయాణీకులపై భారాలు
– విమానాల తరహాలో రద్దీని బట్టి టిక్కెట్‌ చార్జీలు
– పైలట్‌ ప్రాజెక్ట్‌గా బెంగుళూరు రూట్లో అమలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నేరుగా టిక్కెట్‌ చార్జీలు పెంచకుండా, ఇప్పటికే రకరకాల సెస్‌లు, సర్‌చార్జీల పేరుతో ప్రయాణీకులపై ఆర్థికభారం మోపిన టీఎస్‌ఆర్టీసీ ఈసారి మరో రూపంలో ఆదాయం పెంచుకొనేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’ అనే పేరు పెట్టారు. ఈ విధానం ఇప్పటి వరకు విమానాల్లో అమలు ఉంది. ప్రయివేటు బస్సు ఆపరేటర్లు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నారు. దీనిలో రద్దీని బట్టి టిక్కెట్‌ చార్జీల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. నిన్న మొన్నటి వరకు ఆర్టీసీ బస్సుల్లో సంక్రాంతి, దసరా, సమ్మక్క, సారక్క జాతర సహా రద్దీ సమయాల్లో సగం చార్జీ అధికంగా వసూలు చేసేవారు. రెండేండ్లుగా ఈ పద్ధతికి టీఎస్‌ఆర్టీసీ స్వస్తి చెప్పి, ప్రయాణీకుల మన్ననలు పొందింది. కానీ ఇప్పుడు అలాంటి సీజన్లతో సంబంధం లేకుండా రద్దీ ఎప్పుడు పెరిగితే అప్పుడు 25 శాతం వరకు చార్జీని అదనంగా వడ్డించేందుకు సిద్ధమైంది. అలాగే రద్దీలేని సమయాల్లో నాన్‌ ఏసీ బస్సుల్లో 20 శాతం, ఏసీ బస్సుల్లో 30 శాతం టిక్కెట్‌ రేట్లు తగ్గిస్తామని కూడా టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ప్రయోగాత్మకంగా బెంగుళూరుకు వెళ్లే సర్వీసుల్లో ఈ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు. అక్కడి ఫలితాలు చూసాక ఇతర ప్రాంతాలకూ ఇదే విధానాన్ని అమలు చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి బెంగుళూరుకు సూపర్‌ లగ్జరీ నాన్‌ ఏసీ బస్సు చార్జీ రూ.వెయ్యి ఉంది. ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’ విధానం అమల్లోకి వస్తే రద్దీ సమయంలో అదే బస్సులో టిక్కెట్‌ ధర 25 శాతం పెరిగి రూ.1,250 అవుతుంది. వోల్వో ఏసీ బస్సుల్లో ప్రస్తుత చార్జీ రూ.1,290 ఉంది. రద్దీ టైంలో ఇదే బస్సు టిక్కెట్‌ ధర రూ.1,612 అవుతుంది. సహజంగా పండుగలు, జాతర రోజులు, సెలవులు, వీకెండ్స్‌ శుక్ర, శని, ఆది వారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ప్రయాణీకుల జేబులపై ఆర్టీసీ ఆర్థిక భారం మోపుతుంది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా బెంగుళూరు మార్గంలో ఈ నెల 27 నుంచి 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ఆర్టీసీ చైర్మెన్‌, ఎమ్‌డీ తెలిపారు. 60 రోజులు ముందుగా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ టిక్కెట్స్‌ బుక్‌ చేసుకోవచ్చని వారు వివరించారు. పైలట్‌ ప్రాజెక్ట్‌లో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో ఈ నెల 27 నుంచి డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు. డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానంలో అడ్వాన్స్‌డ్‌ డేటా అనాలసిస్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌ మార్కెట్‌లోని డిమాండ్‌ను బట్టి చార్జీలను నిర్ణయిస్తామని వారు వెల్లడించారు. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ షషష. ్‌రత్‌ీషశీఅశ్రీఱఅవ.ఱఅ లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని సూచించారు. గురువారం బస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో టీఎస్‌ఆర్టీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీవోవో) డాక్టర్‌ వి.రవిందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) పీవీ మునిశేఖర్‌, సీటీఎం జీవనప్రసాద్‌, సీఈఐటీ రాజశేఖర్‌, సీఎఫ్‌ఎం విజయపుష్ప తదితరులు పాల్గొన్నారు.
రద్దీ నిర్ణయం ఎలా?
బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ నిర్ణయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గించి, కృత్రిమ రద్దీని సృష్టించే ప్రమాదం ఉన్నదని రవాణారంగ విశ్లేషకులు భావిస్తున్నారు. దొడ్డితోవన టిక్కెట్‌ చార్జీలు పెంచేం దుకు ఇదో పద్ధతి అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Spread the love