– కేంద్ర ప్రభుత్వ భారీ సబ్సిడీ ప్రయివేటు సంస్థలకు మాత్రమే..
– డ్రైవర్లు, మెకానిక్‌ల పరిస్థితి అగమ్యగోచరం..
– కొనసాగుతున్న సిబ్బంది సర్దుబాటు ప్రక్రియ
– ఆర్టీసీలో 2030 నాటికి పూర్తిగా- బస్సులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
విద్యుత్ బస్సులను (ఈ-బస్సులు) ఆర్టీసీలో ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ ప్రయివేటు సంస్థగా మారే ప్రమాదముందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే కాలుష్య నివారణ పేరుతో ఈ-డ్రైవ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ఈ-బస్సులను రంగంలోకి దింపింది. డీజిల్ బస్సుల వల్ల శబ్ధకాలుష్యంతోపాటు వాయుకాలుష్యం అధికమవుతుందని, దీన్ని నివారించడంలో భాగంగానే ఈ-బస్సులను ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధాన పత్రంలో పేర్కొన్నాయి. ఇది చదవడానికి, చూడడానికి బాగానే ఉన్నా, ఈ-బస్సుల తయారీ, ఆపరేటింగ్ చేయడం వంటి వాటిని ప్రయివేటు కంపెనీలకు కేంద్రం అప్పగించడంతో పాటు వాటికే భారీ సబ్సిడీలను ఇస్తోంది.ఇది ప్రభుత్వ రంగంలోని ఆర్టీసీ వంటి సంస్థలకు కాకుండా, ప్రయివేటు సంస్థలకు ఇవ్వడమంటే ప్రయివేటీకరణను ప్రోత్సహించడమేనన్నది అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆర్టీసీ వంటి సంస్థలను ప్రయివేటుపరం చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యంగా కనిపిస్తోందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
ఆర్టీసీలో ఒక్క బస్సుకు ఆరుగురు సిబ్బంది అవసరం. 1:6 నిష్పత్తిలో నియామకాలను చేపట్టేవారు. విద్యుత్ బస్సులు రంగ ప్రవేశం చేస్తే ఈ నియామకాలు పూర్తిగా నిలిపివేసే అవకాశముంది. విద్యుత్ బస్సుల రంగ ప్రవేశంతో 1:1 సిబ్బంది మాత్రమే ఉండే అవకాశముంది. ఈ-బస్సులకు 1 కిలోవాట్‌కు రూ.10 వేల సబ్సిడీని కేంద్రం ఇస్తుంది. ఇదే సబ్సిడీని ప్రభుత్వరంగంలోని ఆర్టీసీ కార్పొరేషన్‌లకు ఇస్తే ఎంతో లాభదాయకంగా ఉండేదని కార్మికులు అంటున్నారు. 2030 నాటికి రాష్ట్రంలో 9,300 డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను నడపడానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఇప్పటికే 190 విద్యుత్ బస్సులు తిరుగుతున్నాయి. హైదరాబాద్‌లోనే 115 విద్యుత్ బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది హైదరాబాద్‌లో 1000 విద్యుత్ బస్సులు, 2026 నాటికి మొత్తం 2,800 విద్యుత్ బస్సులు తీసుకురావడానికి రంగం సిద్ధమైంది.
ఉద్యోగ భద్రతకు తిలోదకాలు
ఈ-బస్సుల తయారీ, ఆపరేటింగ్ విధానాన్ని కేంద్రం, ప్రయివేటు కంపెనీలకు అప్పగించడం వల్ల ఆర్టీసీలో కార్మికులకు ఉద్యోగభద్రత కరువు కానుంది. ఈ-బస్సులను సంబంధిత ప్రయివేటు కంపెనీకి చెందిన డ్రైవర్లు మాత్రమే నడుపుతారు. ఆ వాహనాలకు సంబంధించిన మెయింటెనెన్స్ మొత్తం ఆ కంపెనీ మెకానిక్‌లు, సిబ్బంది మాత్రమే పర్యవేక్షించనున్నారు. దాంతో ఆర్టీసీలో ఉన్న డ్రైవర్లు, మెకానిక్‌లను మిగులు సిబ్బందిగా చూపనున్నారు. ఇదే జరిగితే వారు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదముంది.
వరంగల్‌లో నేడు విద్యుత్ బస్సుల ప్రారంభం
వరంగల్‌లో సోమవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యుత్ బస్సులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే వరంగల్ రీజియన్‌కు 82 జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి. ఈ కార్యక్రమం ఆదివారమే జరగాల్సి ఉండగా, అనివార్య కారణాలతో సోమవారానికి వాయిదా పడింది. వరంగల్ 2 డిపోలో ఇప్పటికే 11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌తోపాటు 21 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈ-బస్సుల్లో సూపర్ లగ్జరీ 18, డీలక్స్ 14, సెమీ డీలక్స్ 21, ఎక్స్‌ప్రెస్‌లు 29 ఉన్నాయి. ఆర్టీసీ బస్సు 9-11 మీటర్ల పొడవుంటే, విద్యుత్ బస్సు పొడవు 12 మీటర్లుంటుంది. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు ఈ-బస్సులను నడపడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్‌లో ఈ-బస్సులను జేబీఎం అనే ప్రయివేటు కంపెనీ పంపిణీ చేసింది. ఈ కంపెనీకి చెందిన 8 మంది టెక్నిషియన్ల బృందమే వరంగల్ రీజియన్‌లో ఈ-బస్సులకు ఎలాంటి మరమ్మతులైనా చేస్తారు. ఆర్టీసీ మెకానిక్‌లకు ఈ బస్సులతో సంబంధం లేదు. జేబీఎం కంపెనీ వరంగల్ రీజియన్‌ను శ్రీ బాలాజీ ప్రయివేటు కంపెనీకి సబ్‌లీజ్‌కు ఇచ్చింది. ఈ కంపెనీ ఈ-బస్సులను నడపడానికి నోటిఫికేషన్ ఇచ్చి మరీ డ్రైవర్లను నియమించింది.
విద్యుత్ బస్సులను ఆర్టీసీ డ్రైవర్లే ఆపరేట్ చేయాలి..
విద్యుత్ బస్సులను ప్రయివేటు కంపెనీ డ్రైవర్లు కాకుండా ఆర్టీసీ డ్రైవర్లే ఆపరేట్ చేయాలి. ప్రయివేటు కంపెనీలే ఈ విద్యుత్ బస్సులను నడపడం వల్ల డ్రైవర్లు, మెకానిక్‌ల ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది. విద్యుత్ బస్సులను నడపడం వల్ల ఆర్టీసీ ప్రయివేటు సంస్థగా మారే ప్రమాదముంది. అదే జరిగితే ఇటు కార్మికులు, అటు ప్రజలు తీవ్ర భారం భరించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఆర్టీసీకి ఇస్తే కార్మికులకు, సంస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణను వేగవంతం చేయడంలో భాగంగానే ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో పెట్టుబడులు పెట్టకుండా తప్పుకోవడంలో భాగంగానే కేంద్రం ఇచ్చే సబ్సిడీలకు ఆశపడి ప్రయివేటు కంపెనీలకు చెందిన విద్యుత్ బస్సులను రాష్ట్రంలో నడుపుతుంది. దాంతో డ్రైవర్లు, మెకానిక్‌ల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లనుంది. ఇప్పటికే ఆర్టీసీలో సిబ్బంది సర్దుబాటు ప్రక్రియనూ ప్రారంభించారు.
– రాంచందర్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, అధ్యక్షులు, వరంగల్ రీజియన్