– 2024-25 విద్యాసంవత్సరానికి ఏర్పాట్లు
– ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు అడ్మినిస్ట్రేటివ్ చార్జీల మినహాయింపు
– అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు చెల్లించే ప్రయివేట్ విద్యాసంస్థలకే బస్సు పాసుల జారీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
త్వరలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ స్టూడెంట్ బస్‌పాసుల జారీకి సిద్ధమవుతోంది. 2024-25 సంవత్సరానికి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా స్టూడెంట్స్ బస్సు పాస్‌లను జారీ చేయటానికి ఏర్పాట్లు చేసింది. బస్సు పాసుల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా టీస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, అన్ని ప్రయివేట్ విద్యాసంస్థలు ప్రతి విద్యా సంవత్సరం లాగానే ఈ సారి కూడా అడ్మినిస్ట్రేటివ్ చార్జీలను చెల్లించాలన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలు అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు చెల్లించకుండా మినహాయింపునిచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ఫీజు చెల్లించిన ప్రయివేట్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు మాత్రమే బస్సు పాసులు ఇవ్వనున్నారు. విద్యార్థులు బస్సు పాస్ కోసం టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ ష్ట్ర్‌్‌జూర://్‌స్త్రరత్‌ీషజూaరర.షశీఎ ద్వారా దరఖాస్తు చేసుకుని, తమ విద్యాసంస్థ నుంచి ఆన్‌లైన్‌లో ఫార్వర్డ్ చేయించుకొని, దరఖాస్తు ఫారంపై ప్రిన్సిపల్ సంతకం, సీల్ వేయించుకొని, వారు ఎంచుకున్న బస్సు పాసు కేంద్రంలో పాస్ పొందవచ్చు.
బస్సు పాసులు జారీ చేయు కేంద్రాలు ఇవే..
విద్యార్థులు ఈనెల ఒకటో తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని అబిడ్స్, అఫ్జల్‌గంజ్, అరాంఘర్, బాలానగర్, బోరబండ, సీబీఎస్, చార్మినార్, దిల్‌సుఖ్ నగర్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఫారుఖ్‌నగర్, జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్, ఘట్కేసర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, జేబీఎస్, కాచిగూడ, కోఠి టెర్మినల్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి బస్సు స్టేషన్, ఎల్‌బీ నగర్, లింగంపల్లి, లోతుకుంట, మేడ్చల్, మెహిదీపట్నం, మిధాని, మొయినాబాద్, ఎన్‌జీవో కాలనీ, పటాన్‌చెరు, రైతీఫైల్-సికింద్రాబాద్, ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు, రిసాలా బజార్, సనత్‌నగర్, శంషాబాద్, ఎస్‌ఆర్‌నగర్, షాపూర్‌నగర్, సుచిత్ర, తార్నాక, తక్కుగూడ, ఉప్పల్ క్రాస్ రోడ్, వనస్థలిపురం, ఉమ్సెన్ కాలేజీ కోఠిలోని బస్సు పాసు కేంద్రాల్లో పాస్‌లు పొందవచ్చు. 12 ఏండ్లలోపు బాలురు (7వ తరగతి), 18 ఏండ్లలోపు బాలికలకు(10వ తరగతి) ఉచిత బస్‌పాసులు జారీ చేస్తారు. దరఖాస్తు ఫారాన్ని ఆర్టీసీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిని పూర్తిచేసి ఫొటో పైన, బోనఫైడ్ సర్టిఫికెట్ కాలమ్‌లో ప్రిన్సిపాల్/హెడ్ మాస్టర్ సంతకం చేయించాలి. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిం చారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ప్రత్యేక కౌంటర్‌లో పాసులు జారీ చేస్తారు. మరిన్ని వివరాలకు టీఎస్ ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా 8008204216కు సంప్రదించాలి.
విద్యార్థులకు జారీ చేయు బస్సు పాసులు
క్ర.సం బస్ పాస్‌ల వివరాలు ధర(రూ.లలో )
1. స్టూడెంట్ జనరల్ పాస్ (నెలకు) 400
2. స్టూడెంట్ జనరల్ పాస్ (మూడు నెలలకు) 1200
3. స్టూడెంట్ రూట్‌పాస్(మూడు నెలలకు) 450(4కి.మీ)
(600(8కి.మీ),900(12కి.మీ),1150(18కి.మీ),1350(22కి.మీ))
4. స్టూడెంట్ గ్రేటర్ హైదరాబాద్ పాస్ (నెలకు) 400+70 (ప్ర.2కి.మీ.కు)
5. స్టూడెంట్ గ్రేటర్ హైదరాబాద్ పాస్ (మూడు నెలలకు) 1200+210 (ప్ర.2కి.మీ.కు)
6. స్టూడెంట్ సిటీ స్పెషల్ పాస్ (నెలకు) 450
7. స్టూడెంట్ సిటీ స్పెషల్ పాస్ (మూడు నెలలకు) 1350
8. స్టూడెంట్ ఎక్స్‌క్లూజివ్ పాస్ (నెలకు) 1020 (16కి.మీ.కు)
9. స్టూడెంట్ ఎక్స్‌క్లూజివ్ మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్(నెలకు) 1190 (16కి.మీ)
10. 12 ఏండ్లలోపు విద్యార్థులకు ఉచిత పాస్ (7వ తరగతి వరకు) ఉచితం
11. 18 ఏండ్లలోపు విద్యార్థినులకు ఉచిత పాస్ (10వ తరగతి వరకు) ఉచితం