ఆర్టీసీ విలీనం సరే! సమస్యల సంగతేంది?

 RTC merger OK! What about problems?ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఇకముందు వారంతా ప్రభుత్వోద్యోగులవుతారని ప్రభుత్వం ఈ ఏడాది జులై 31న నిర్ణయించింది. అందుకు సంబంధించిన యాక్టు అనేక రాజకీయ డ్రామాల అనంతరం ఆగస్టు ఆరున శాసనసభ, శాసనమండలిలో ఆమోదం పొంది, గవర్నర్‌ ఆమోదం కోసం పంపించింది. వివరణల కోసం న్యాయశాఖకు పంపామని, మొన్ననే తమ కార్యాలయానికి చేరిందని, దానిని పరిశీలిస్తామని గౌరవ గవర్నర్‌ ప్రకటించారు. గవర్నర్‌ ఆమోదం పొందిన తరువాత గెజిట్‌గా అది వెలువడుతుంది.
‘ప్రస్తుతం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు కార్మికులను ప్రభుత్వంలో విలీనంకు మాత్రమే పరిమితమైనదని’ రవాణా శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ (ఫైనాన్స్‌) అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. టీఆర్‌ అండ్‌ బి ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కార్మికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారని, కార్మికుల పేస్కేల్‌, క్యాడర్‌ పొజిషన్‌, పెన్షన్‌ సమస్య వంటి వాటిపై విధి విధానాలు రూపొందిస్తారని’ రవాణా శాఖ మంత్రి తెలియజేశారు. అలాగే ‘వాళ్ళకు ఏదైతే స్కేలు ఉంటుందో, ఆ స్కేలును ఇప్పుడు గవర్నమెంటులో తీసుకెళ్ళి ఫిక్సేషన్‌ చేయడం జరుగుతుంది’ అని కూడా ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో కాని, అసెంబ్లీలో మంత్రి చేసిన ఉపన్యాసంలో కానీ, గవర్నర్‌ ప్రభుత్వానికి చేసిన రికమండేషన్స్‌లో కాని విలీనం కంటే ముందే పరిష్కారం కావలసిన సమస్యల గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అవన్నీ పరిష్కారం కాకుండా విలీనంతో కార్మికులకు భద్రత వస్తుందని ప్రభుత్వం చెప్పిన మాట నిజమవు తుందా? వేల కోట్ల రూపాయల విలువైన ప్రయోజనాలు వారికి దక్కకుండా 43,055 కుటుంబాలకు ఆర్థిక భద్రత లేకుండానే భద్రత ఎలా వస్తుంది?
విలీనానికి ముందే పరిష్కారం కావలసిన సమస్యలు?
ఆర్‌పిఎస్‌ 2013 అరియర్స్‌ : రివైజ్డ్‌ పే స్కేలు – 2013 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 మేలో జరిగింది. ‘మన రాష్ట్రం, మన ప్రభుత్వమే వచ్చింది, సరిగా పరిష్కరిస్తుందని’ భావించిన కార్మికులను సమ్మెలోకి నెట్టింది. 8 రోజుల సమ్మె అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో 43శాతం ఇస్తే, తెలంగాణ రాష్ట్రంలో 44శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘మన ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది. ఆర్‌టీసీ ఆర్ధిక పరిస్థితి బాగోలేదు. అందుకని 2013 ఏప్రిల్‌ నుండి రావలసిన అరియర్స్‌లో 50శాతాన్ని మూడు వాయిదాలలో నగదుగా చెల్లిస్తామని, మిగిలిన 50శాతంకు 8.75శాతం వడ్డీ చెల్లిసూ ఐదేండ్ల తర్వాత ఇస్తామని అందుకు బాండు కూడా ఇస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన బాండ్లు 2015 సెప్టెంబర్‌లో ఇచ్చారు. వాటి కాలపరిమితి 2020 సెప్టెంబర్‌తో ముగిసింది. వాటి కాలవ్యవధి ముగిసి మూడేండ్లు పూర్తయినా ఇంత వరకు వాటి నగదును చెల్లించలేదు. కనీసం ఆ బాండ్స్‌ కాలవ్యవధిని పొడిగించలేదు. రిటైరైన వారికి, విఆర్‌ఎస్‌ తీసుకున్న వారికి కేవలం 2020 వరకే లెక్కించి చెల్లిస్తున్నారు. దాంతో కార్మికులు వేలల్లో నష్టపోతున్నారు. ఆ నష్టం జరుగకుండా ఉండేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం.
వేతన ఒప్పందాలు : 2013 వేతన ఒప్పందం ప్రకటించే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘2013 వేతన ఒప్పందం ఆలస్యమైంది. కాబట్టి, అరియర్స్‌ చెల్లింపులో చిన్న సర్దుబాటు చేయాల్సి వస్తున్నది. రాబోయే పేస్కేలును కాలపరిమితి కంటే ఒక నెల రోజుల ముందుగానే చేసుకుని, అరియర్స్‌ ఇబ్బంది లేకుండా చేసుకుందామని’ అన్నారు. అనేక విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం 2017 వేతన ఒప్పందంపై సరిగా స్పందించలేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న గుర్తింపు సంఘంతో సహా ఆర్‌టీసీలోని అన్ని సంఘాలు ఐక్యమై సమ్మెకు సిద్ధపడ్డాయి. ఆ నేపధ్యంలో సమ్మెను నివారించేలా ప్రభుత్వం 16శాతం మధ్యంతర భృతిని ప్రకటించింది. వచ్చిన ఐక్యతను ఆసరా చేసుకొని పూర్తి వేతన ఒప్పందాన్ని సాధించాల్సిన గుర్తింపు సంఘం ఆ పని చేయకుండా, ప్రభుత్వంతో రాజీపడి, ఐక్యతను నీరుగార్చింది. ప్రకటించిన 16శాతం ఐ.ఆర్‌.ను 2018 జులై నెల నుండి అమలు చేస్తున్నారు.
మధ్యంతర భృతి కాకుండా పూర్తి వేతన ఒప్పందం జరిగినట్లయితే ఆనాటి కరువు భత్యం 31.1శాతం బేసిక్‌లో మెర్జి అయ్యేది. అలాగే ఫిట్‌మెంట్‌ కూడా వచ్చి కార్మికుల బేసిక్‌ పేలు పెరిగి ఉండేవి. అలా కానందున 6 సం||రాల కాలం కేవలం మధ్యంతర భృతి మాత్రమే పొందుతున్నారు. (ఉదా: 2013 వేతన ఒప్పందం ప్రకారం కండక్టర్‌ బేసిక్‌ రూ.12,610లు. దానికి 31.1శాతం డి.ఎ., ఫిట్‌మెంట్‌ 30శాతం ఇచ్చారనుకంటే రూ.12,610 + రూ.3,922 డి.ఎ. + రూ.3783 – ఫిట్‌మెంట్‌ కలిపి – 20,315లు అవుతుంది). ఫిట్‌మెంట్‌ సర్దుబాటులో అది ఇంకొంచెం పెరుగుతుంది. అంటే రూ.20,315ల పైన రావలసిన కరువు భత్యం, ఇంటి అద్దె, సిసిఎ తదితర అన్ని రావలసి వుండగా కేవలం రూ.12,610ల పైన 16శాతం మధ్యంతర భృతి మాత్రమే పొందుతున్నారు. ఇలా ఇంకెంత కాలం? రవాణా మంత్రి చెప్పినట్లు ఇప్పుడున్న వేతనాలను ప్రభుత్వ స్కేల్స్‌లో కూర్చోబెడతాము అనేదే నిజమైతే రూ.20,315కు బదులుగా రూ.12,610 స్థానంలోనే కూర్చుంటారు. అంటే కండక్టర్‌ కనీస స్థాయిలోనే రూ.7705లపైగా నష్టపోతారు. ఇలా నష్టం కలిగితే కార్మికుల కుటుంబాలకు భద్రత వచ్చినట్లేనా? 2021 ఏప్రిల్‌ 1 నుండి మరో పే స్కేలు రావలసి వుంది. ఇది కూడా పై పద్ధతిలోనే లెక్కిస్తే కార్మికులకు జరుగుతున్న నష్టం ఏమిటో అర్ధమవుతుంది. అందుకని 2017, 2021 వేతన ఒప్పందాలు కచ్చితంగా అమలు చేసి, అరియర్స్‌ చెల్లింపుకు కూడా గ్యారెంటీ రావాలి. లేకపోతే ఇప్పుడు సర్వీసులో ఉన్న 43055 మందితో పాటు 2017 నుండి ఇప్పటి వరకు రిటైరైన, విఆర్‌ఎస్‌ తీసుకున్న, చనిపోయిన కార్మిక కుటుంబాలకు తీరని నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
డి.ఎ లు, డిఎ అరియర్స్‌ : పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని సర్దుబాటు చేయడం కోసం చెల్లించేది కరువు భత్యం. ఇది యాజమాన్యం దయాదాక్షిణ్యంతో ఇచ్చేది కాదు. దేశ కార్మికవర్గం పోరాడి సాధించుకున్నది. ఆర్‌టీసీ కార్మికులకు 7 డి.ఎలు చెల్లించామని, ప్రభుత్వం, అధికారులు పదే, పదే ప్రకటిస్తూ, వారి దయతోనే ఇస్తున్నారని కార్మికులు భావించే స్థాయికి ప్రచారం చేస్తున్నారు. కానీ ఇచ్చిన 7 డిఎలు, సెప్టెంబర్‌ నెల జీతంలో కలిపే డి.ఎతో కలిపి 8 డిఎలు కూడా అవి అమలు చేయాల్సిన తేదీ నుండి కాకుండా వారు ప్రకటించిన తేదీల నుండి మాత్రమే అమలు చేస్తున్నారు. 2023 జులై నుండి రావలసిన డిఎను ప్రకటించలేదు. దానితో కలిపి మొత్తం 9 డిఎలు చెల్లించాలి. 2019 జులై నుండి 2023 జులై డిఎ వరకు మొత్తం 170 నెలల డిఎ అరియర్స్‌ చెల్లించడానికై యాజ మాన్యం, ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయడం లేదు. అందుకని డిఎ అరియర్స్‌ మొత్తం వెంటనే చెల్లించాలి.
సామాజిక భద్రత పథకాల నిధులు : ఆర్టీసి కార్మికులు తామే నిర్వహించుకొంటున్న క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ (సిసిఎస్‌) తీవ్రమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఇందుకు బాధ్యత వహించాల్సినది మాత్రం ఆర్టీసీ యాజమాన్యమేనన్నది సుస్పష్టం. సొసైటీ కోసం చేస్తున్న నెలవారి రికవరీలను సిసిఎస్‌కు చెల్లించకపోవడమే కాక, ఆ డబ్బులను సంస్థ అవసరాలకు కోసం వాడుకొని, వాటిని చెల్లించని ఫలితంగా సర్వీసులో ఉండగా, రిటైరైన తర్వాత వృద్ధాప్యంలో ఆసరాగా ఉండే పరపతి సహకారాన్ని కార్మికులు కోల్పోతున్నారు. సిసిఎస్‌ విలువ రూ.1500 కోట్లు ఉంటే అందులో 1100 కోట్లు ఆర్టీసీ యాజమాన్యం వాడుకొని 50వేల మంది కార్మిక కుటుంబాల జీవితాలతో చెలగాడటం ఆడుతున్నది. దీనిని మార్చకుండా కార్మికుల కుటుంబాలకు భద్రత ఎలా వస్తుంది? ఇదే దారిలో భవిష్యనిధి, ఎస్‌ఆర్‌బిఎస్‌, ఎస్‌బిటి ట్రస్టుల పరిస్థితి ఉంది. కార్మికుల, యాజమాన్యం వాటాలో రూ.1270 కోట్లు పిఎఫ్‌కు, స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీం (ఎస్‌ఆర్‌బిఎస్‌) నిధులు రూ.540 కోట్లు, ఎస్‌బిటి నిధులు రూ.140 కోట్లు వాడుకున్నది. సక్రమంగా వాటిని ఆ ట్రస్టులకు చెల్లించనందున కార్మికులు, వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాటిని వెంటనే చెల్లించాలి.
సెప్టెంబర్‌ 15న కోర్కెల దినం : విలీనం ప్రక్రియ కంటే ముందే అమలు చేయాల్సిన 8అంశాలపై రవాణా మంత్రికి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కార్మిక నాయకులు వినతిపత్రం ఇచ్చారు. పరిస్థితిని సమీక్షించిన ఆర్‌టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ 15వ తేదీన నిరసన దినం జరపాలని, ప్రభుత్వంలో సరైన స్పందన రాకపోతే ‘ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా’ నిర్వహించాలని కూడా నిర్ణయించింది.న్యాయమైన ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేనట్లయితే కార్మికులకు విలీనం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. ఆ నష్టం జరగకుండా చూడాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

– పుష్పా శ్రీనివాస్‌

 

Spread the love