– సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని పరిరక్షించాలనీ, దీర్ఘకాలికంగా పెండిరగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు సోమవారం ఆయన లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని తెలిపారు. తద్వారా కార్మికుల సమస్యలు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదమున్నదని పేర్కొన్నారు. 2014లో ఉన్న సౌకర్యాలను 2023తో పోల్చితే 297 రూట్లు, 1,234 షెడ్యూళ్లు, 1,246 బస్సులు, రెండు శాతం ఆక్యుపెన్సీ రేషియో, 47 లక్షల ప్రయాణీకులు, 12,963 ఉద్యోగులు తగ్గారని వివరించారు.
ఆర్టీసీకి బ్యాంకు అప్పు రూ.2,500 కోట్లు ఉండగా, కార్మికుల డబ్బు రూ.3,400 కోట్లను సంస్థ వాడుకున్నదని తెలిపారు. విద్యార్థులు, గ్రామీణ ప్రాంత ప్రజా రవాణాకు దూరమవుతూ, వారు పొందుతున్న రాయితీలను కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రమాదాల స్థాయి పెరుగుతున్నదని తెలిపారు. విద్య, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి కుంటుపడుతున్నదని వివరించారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఆర్టీసీని పరిరక్షిస్తామనీ, కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని తెలిపారు. తక్షణమే ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని లాభనష్టాలతో ముడిపెట్టడం సరైందికాదని జూలకంటి తెలిపారు. బస్‌పాసుల రీయింబర్స్‌మెంట్ కోసం బడ్జెట్ కేటాయిస్తున్నా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించకపోవడంతో కార్మికులు, సంస్థ తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. స్వయం పోషకం పేరుతో నిధులు కేటాయించకపోవడం సరైందికాదని తెలిపారు.
ఆదాయానికి, ఖర్చుకు మధ్య వ్యత్యాసాన్ని పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల కార్యకలాపాలపై ఆంక్షలు పెట్టి వారి హక్కును కాలరాయడం చట్ట విరుద్ధమని విమర్శించారు. కార్మిక సంఘాలపై ఆంక్షలను ఎత్తేయాలనీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనీ, ఆర్టీసీలో వెంటనే గుర్తింపు సంఘ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తున్న కేంద్రం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంవీయాక్ట్-2019ని సవరించి స్టేజీ, కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్లను నేషనల్ పర్మిట్‌గా మార్చి వంద శాతం ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తున్నదని జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ప్రత్యామ్నాయ ఇంధనం పేరుతో ప్రయివేటు, కార్పొరేట్ బస్సు ఆపరేటర్లకు రూ.కోట్ల సబ్సిడీని కట్టబెడుతున్నదని తెలిపారు. 15 ఏండ్లు పైబడిన వాహనాలను స్క్రాప్ చేయాలనే నిబంధన వల్ల వందలాది బస్సులు మూలనపడుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో చెల్లించాల్సిన మూలధన పెట్టుబడిని 1988 నుంచి నిలిపేసిందని వివరించారు. దీంతో ఆర్టీసీపై తీవ్ర భారం పడుతున్నదని తెలిపారు. కాబట్టి ఎంవీయాక్ట్‌ను సవరణచేసి ఆర్టీసీని పరిరక్షించే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేయాలని కోరారు.