15న ఆర్టీసీ కార్మికుల నిరసన

RTC workers protest on 15–  పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి : జేఏసీ డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో : టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికంటే ముందే కార్మికుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 15న నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలపాలని టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. ఆదివారంనాడిక్కడి టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆఫీస్‌లో జేఏసీ సమావేశం జరిగింది. చైర్మెన్‌ కే రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కన్వీనర్‌ వీఎస్‌ రావు, నాయకులు ఎమ్‌ఎన్‌ మంగ, కే రాంరెడ్డి, పీ రవీందర్‌ రెడ్డి, జీ రాములు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, యునిట్లలో డిమాండ్స్‌ బ్యాడ్జీలు దరించి విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్మికులకు అనుకూలమైన సమయంలో ‘ధర్నా’ చేయాలని చెప్పారు. అప్పటికీ యాజమాన్యం, ప్రభుత్వం స్పందించనిపక్షంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు 2017 నుంచి రావలసిన వేతన సవరణను ఆ నాటి బేసిక్‌ పే కు 31.1 శాతం డిఏను కలిపి 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ జరపి, పాత బకాయిలతో కలిసి చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే 2021 వేతన సవరణ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా చేస్తూ మాస్టర్‌ పే స్కేల్‌లో ఫిక్సేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 2013 వేతన సవరణ 50 శాతం బకాయిల బాండ్ల డబ్బులు ఇప్పటి వరకూ ఇవ్వలేదనీ, వాటిని 8.75 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని కోరారు. ఈ ఏడాది జనవరి, జులై మాసాల్లో రావల్సిన డిఏలు, మొత్తం 9 డిఏల బకాయిల సొమ్ము చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీసీఎస్‌కు అసలు, వడ్డీ కలిసి యాజమాన్యం రూ.1,078 కోట్లు ఇవ్వాలనీ, వాటితో పాటు ఎస్‌ఆర్‌బీఎస్‌ రూ.540 కోట్లు, పీఎఫ్‌ రూ.1,270 కోట్లు, ఎస్‌బీటీ రూ. 140 కోట్లు చెల్లించాలని చెప్పారు. రిటైర్‌ అయిన కార్మికులకు చెల్లించాల్సిన టెర్మినల్‌ బెనిఫిట్స్‌ తక్షణం చెల్లించాలని కోరారు.

Spread the love