డిమాండ్‌ బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఆర్టీసీ కార్మికులు

RTC workers protested with demand badgesనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పులు చేసి నిధులు, సబ్సిడీలను ఆర్టీసీలకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ డిమాండ్‌ బ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరయ్యారు. టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌), స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎస్‌టీయూ) సంఘాల సంయుక్త పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు మొదటి షిఫ్ట్‌ నుంచి డిమాండ్‌ బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. బస్‌భవన్‌ దగ్గర ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావుతో పాటు పలువురు ఉద్యోగులు డిమాండ్‌ బ్యాడ్జీలు ధరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు గ్యారెంటీ చేసేందుకు ఆర్టీసీల్లో విద్యుత్‌ బస్సులను ప్రవేశ పెట్టిందనీ, ఆర్టీసీలు స్వయంగా వాటిని సమకూర్చుకునే వెసులుబాటును మాత్రం కల్పించలేదని తెలిపారు.
దీనికి తోడు ఆర్టీసీలోని డీజిల్‌ బస్సుల్ని ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్పు చేసేందుకు ప్రయివేటు కంపెనీలకు అప్పగించే దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారని యూనియన్‌ నేతలు విమర్శించారు. శనివారం కూడా కార్మికులు ఇదే తరహాలో డిమాండ్‌ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై, తమ నిరసన వ్యక్తంచేస్తారని తెలిపారు.
సంఘాలకు అతీతంగా కార్మికులు పెద్దఎత్తున ఈ నిరసనల్లో పాల్గొన్నందుకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌రావు, ఎస్‌డబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి కార్మికులకు అభినందనలు తెలిపారు. శనివారం కూడా ఇదే చైతన్యాన్ని ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love