
– ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
నవతెలంగాణ-తాడ్వాయి : పస్రా నుండి లింగాల వరకు ఆర్ అండ్ బి రోడ్డు పనులు త్వరితగతిన ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడ్వాయి మండలంలోని పస్రా నుండి లింగాల వరకు ఆర్ అండ్ బి రోడ్డును, గుండ్ల వాగు బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పస్రా నుండి లింగాల వరకు 27 కిలోమటర్ల ఆర్ అండ్ బి రోడ్డు గతంలో మంజూరు అయినదని 5 కిలోమీటర్లు పూర్తి అయినదని మిగిలిఉన్న 22 కిలోమీటర్ల రోడ్డు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చినందున త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బంధాల, బొల్లెపల్లి రోడ్డు మార్గం వివరాలను కలెక్టర్ ఆర్ అండ్ బి అధికారులతో అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఓటర్ నమోదు ప్రత్యేక క్యాంపేయిన్ లో భాగంగా బిట్టుపల్లి(కొడిశల), లింగాల లోని పోలింగ్ స్టేషన్ నెం.185, 248 లను జిల్లా కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ బిఎల్ఓ లు వారి పోలింగ్ కేంద్రం పరిధిలో అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయిన వారి వద్దకే వెళ్లి ఫామ్-6 ద్వారా ఓటరుగా నమోదు చేయాలన్నారు. చనిపోయిన ఓటర్లు గాని ఉన్నట్లయితే వారి మరణ దృవీకరణ పత్రం లేదా వారు మరణించినట్లుగా ఫామ్-7 లో నమోదు చేసి దృవీకరించి పంపించాలని తెలిపారు. ఫోటో కరెక్షన్, డబల్ ఎంట్రి మరియు ఇతర పొరపాట్లు లేకుండా సరిచేయాలని తెలిపారు. జాబితాలో మార్పులు, చేర్పులకు మరో అవకాశం లేనందున ఈ క్యాంపేయిన్ ల ద్వారా పోలింగ్ బూత్ పరిధి లోని అర్హులైన ప్రతి ఓటరు వివరాలు పక్కాగా ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల విధులలో ఎవరు నిర్లక్ష్యం వహించరాదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి డిఈ రఘువీర్, స్థానిక తహసిల్దార్ తోట రవీందర్, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, ఎమ్మారైలు డేగల సాంబయ్య, సునీల్ తదితరులు ఉన్నారు.