హస్తినలో ఉచితాల జోరు!

Rush of freebies in Hastina!– రూ. 21 వేల కోట్లు దాటేసిన హామీల విలువ
– బడ్జెట్‌ రూ. కేవలం 78,800 కోట్లే
– పోటీ పడి వాగ్దానాలు కుమ్మరిస్తున్న పార్టీలు
– నగదు పథకాలతో మహిళా ఓటర్లకు ఎర
న్యూఢిల్లీ: గతంలో ఎన్నికలు సిద్ధాంతాల ప్రాతిపదికన జరిగేవి. కానీ ఇప్పుడో ? ఉచితాలు, సబ్సిడీల ఆధారంగా ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే నెల ఐదవ తేదీన శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంలో తలమునకలై పోయాయి. అయితే ఈ ప్రచారమంతా ‘ఉచితాల’ చుట్టూ తిరుగుతుండడం విశేషం. ఢిల్లీ ఎన్నికల గోదాలో తలపడుతున్న ప్రధాన పార్టీలు ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్‌ ఇప్పటి వరకూ అక్షరాలా 21 వేల కోట్ల రూపాయల విలువైన హామీలను కుమ్మరించాయి. కానీ ఢిల్లీ బడ్జెట్‌ మాత్రం రూ.78,800 కోట్లు మాత్రమే. మరి ఈ హామీల అమలుకు నిధులెలా వస్తాయి ?
ఢిల్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు ఇస్తున్న హామీల అమలుకే పాతిక వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ అవసరమవుతుంది. ఎన్నికలకు బదులుగా ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వేలం పాడుతున్నాయి. గతంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో విడుదల చేసి, ఆ తర్వాత తమ అభివృద్ధి ప్రణాళికలతో ఓటర్ల ముందుకు వెళ్లిన పార్టీలు ఇప్పుడు వాటిని పూర్తిగా గాలికి వదిలేశాయి. అప్పుడు ఎన్నికల మ్యానిఫెస్టోల్లోనే హామీలు అంతర్భాగమై ఉండేవి. కానీ ఇప్పుడు ఢిల్లీలో అన్ని పార్టీలు విడతల వారీగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు హామీలు గుప్పిస్తున్నారు. అవి అమలవుతాయా లేదా అనేది మాత్రం ఎవరికీ పట్టదు.
పెరిగిపోతున్న సబ్సిడీ భారం
ఢిల్లీలో ఉచిత పథకాలు అమలు చేయడం, వాటి ద్వారా ప్రజలను ఆకర్షించడం చాలా తేలిక. అమ్‌ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలు ఢిల్లీలో అమలైనా పంజాబ్‌లో కాలేదు. ఎందుకంటే పంజాబ్‌లో జనాభా ఎక్కువ. ఖర్చూ అధికమే. అదే విధంగా ఢిల్లీలో బీజేపీ ఇచ్చిన హామీలను ఉత్తరప్రదేశ్‌లో అమలు చేయలేదు. 2014-15 వరకూ ఢిల్లీలో సబ్సిడీలపై పెట్టిన ఖర్చు కేవలం రూ.1,155 కోట్లు మాత్రమే. అమ్‌ఆద్మీ పార్టీ ఏర్పడి, ఉచిత పథకాలను అమలు చేయడంతో సబ్సిడీ వ్యయం 2015-16 నాటికి రూ.3,018 కోట్లకు పెరిగింది. 2024-25 నాటికి సబ్సిడీ బడ్జెట్‌ రూ.11,000 కోట్లకు చేరింది. అంటే పది సంవత్సరాల కాలంలో సబ్సిడీ ఏకంగా 607 శాతం పెరిగిందన్న మాట. 2014-15లో విద్యుత్‌ సబ్సిడీకి రూ.292 కోట్లు ఖర్చయితే 2024-25లో అది రూ.3,600 కోట్లకు పెరిగింది. లబ్దిదారుల సంఖ్య పెరుగుతుంటే సబ్సిడీ మొత్తం కూడా పెరుగుతోంది. 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పిస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. దానిని అమలు చేయాలంటే మరో వెయ్యి కోట్ల రూపాయలు అవసరమవుతాయి. సబ్సిడీ బడ్జెట్‌ రూ.4,600 కోట్లకు చేరుతుంది. రాష్ట్రంలో తాగునీటిపై ఇస్తున్న సబ్సిడీ కూడా భారీగా పెరిగిపోతోంది. 2015-16లో రూ.190 కోట్లుగా ఉన్న నీటి సబ్సిడీ ఇప్పుడు రూ.500 కోట్లకు చేరింది.
పోటీ పడుతూ హామీల వరద
ఆప్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని కొత్త ప్రకటనలు చేస్తుంటారు. తానేమీ తీసిపోలేదంటూ బీజేపీ రెండు భాగాలుగా సంకల్ప పత్రాలను తీసుకొచ్చింది. కేజ్రీవాల్‌ విద్యార్థులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ప్రకటిస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.8,500 చొప్పున అప్రెంటీస్‌ స్టయిఫండ్‌ ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. నేనేం తక్కువ తిన్నానా అంటూ బీజేపీ కూడా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉచిత కేజీ టూ పీజీ విద్యను అందిస్తానని అంటోంది. వివిధ పార్టీలు ప్రకటించిన ఉచితాలను పరిశీలిస్తే ఆనందంతో ఉబ్బి తబ్బిబవ్వాల్సిందే.పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రూ.15,000 ఆర్థిక సాయం, పరీక్షలకు హాజరయ్యేందుకు రెండుసార్లు ఉచిత బస్సు ప్రయాణం, రెండు పరీక్షల కోసం దరఖాస్తులు పూర్తి చేసేందుకు అవసరమైన డబ్బు…ఇవి బీజేపీ హామీలు. అమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రజకుల కోసం దోభీ సమాజ్‌ కల్యాణ్‌ బోర్డును ఏర్పాటు చేస్తామని, రజకులకు గృహ ఛార్జీలకే విద్యుత్‌, నీరు అందిస్తామని, బట్టలు ఇస్త్రీ చేసేందుకు షాపులు పెట్టుకుంటే వాటిని క్రమబద్ధీకరిస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. ఇంటి పనులకు సాయపడే వారి కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, ఆటో డ్రైవర్లకు జీవిత, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పిస్తామని, పిల్లలకు స్కాలర్‌షిప్పులు ఇస్తామని బీజేపీ చెబుతోంది. అంతేకాదు…గర్భిణులకు రూ.21 వేలు, ఆరు నెలల పాటు వేతనంతో కూడిన సెలవు కూడా ఇస్తామని అంటోంది.
నగదు పథకాల అమలే సాధికారతా?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇస్తున్న సబ్సిడీ సైతం రూ.44 కోట్ల (2019-20) నుండి ఇప్పుడు రూ.200 కోట్లకు పెరిగింది. మహిళలకు నగదు అందజేస్తామంటూ పార్టీలు హామీలు ఇస్తున్నాయి. నగరంలో నివసిస్తున్న ప్రతి మహిళకు ప్రస్తుతం అందజేస్తున్న విధంగా నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తే ఏటా రూ.4,560 కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే నెలకు రూ.2,100 ఇస్తామని కేజ్రీవాల్‌ చెబుతున్నారు. ఈ హామీని అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.9,500 కోట్ల భారం పడుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌ పోటీ పడుతూ నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తామని ప్రకటించాయి. అలా ఇవ్వాలంటే ఏటా రూ.11,400 కోట్లు అవసరమవుతాయి.
ప్రస్తుత ఢిల్లీ బడ్జెట్‌ రూ.78,800 కోట్లు. ఇప్పటి వరకూ వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన ఉచితాల హామీల అమలుకు రూ.21 వేల కోట్లు కావాల్సి ఉంటుంది. ఇవి కాకుండా జీతాలు, పెన్షన్లు, ఇతరత్రా ఖర్చుల నిమిత్తం మరో రూ.45,000 కోట్లు అవసరమవుతాయి. మరి అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం డబ్బు ఎక్కడి నుండి వస్తుందనే ప్రశ్నకు ఏ పార్టీ వద్ద సమాధానం లేదు. కేవలం ఆర్థిక సాయంతోనే మహిళల ఓట్లు పొందాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు మాత్రం అవి వెనకాడుతున్నాయి. 70 మంది సభ్యులు ఉన్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల కోసం అమ్‌ఆద్మీ పార్టీ 9 మంది మహిళల్ని పోటీకి దింపగా కాంగ్రెస్‌ ఏడుగురికే టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీ 68 స్థానాలకు పోటీ పడుతూ తొమ్మిది మంది మహిళల్ని రంగంలో దించింది. ఈ మూడు పార్టీలు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లును సమర్ధించాయి. కానీ వారికి సాధికారత కల్పించే విషయంలో మాత్రం నగదు పథకాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి.

Spread the love