ఆహార ధాన్యాల ఒప్పందాన్ని పొడిగించిన రష్యా

– స్వాగతించిన యూఎన్‌ చీఫ్‌
న్యూయార్క్‌ : నల్ల సముద్రం ఓడరేవుల నుంచి ఉక్రెయిన్‌ గోధుమలను, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అనుమతించే బ్లాక్‌ సీ గ్రెయిన్‌ ఒప్పందాన్ని పొడిగించాలని రష్యా నిర్ణయించింది. కాగా ఈ నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ గురువారం స్వాగతించారు. మరో 60రోజుల పాటు ఈ ఒప్పందాన్ని పొడిగించాలని రష్యా సమాఖ్య తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొన్ని సానుకూలమైన, కీలకమైన పరిణామాలు సంభవించాయని అన్నారు. ఈ ఒప్పందం కొనసాగడం ప్రపంచదేశాలకు శుభవార్త అని అన్నారు. పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా చాలా వున్నాయి. అయితే, రష్యా, ఉక్రెయిన్‌, టర్కీ, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు వాటిని చర్చిస్తునే వుండాలని న్యూయార్క్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఆహార ధాన్యాల ఎగుమతికి ఉద్దేశించిన ఈ చొరవ మరింత మెరుగవాలని, పొడిగించబడాలని, విస్తృతమవాలని ఆ దిశగా సమగ్ర ఒప్పందం కుదరాలని గుటెరస్‌ ఆశించారు. ఆ మూడు దేశాల ప్రతినిధులకు కూడాతాను ఇదే విషయాన్ని లేఖ రాశానన్నారు. ఇప్పటివరకు ఈ ఒప్పందం కింద 3కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఎగుమతిచేశారు. సూడాన్‌లో ఆకలితో అలమటిస్తున్న వారితోసహా పలు పేద దేశాలకు కీలకమైన ఈ ఆహార సరఫరాలు చేరుతున్నాయి.

Spread the love