– బ్లూమ్ బర్గ్
మాస్కో : రష్యా క్రూడ్ ఎగుమతులు సగటున రోజుకు 8,80,000 బ్యారెల్స్(బీపీడీ)కు పెరిగాయి. ఆగస్టు 27కల్లా ఇది 3.4మిలియన్ బ్యారెల్స్ కు పెరిగిందని బ్లూమ్ బర్గ్ సేకరించిన ట్యాంకర్ ట్రాకింగ్ డేటాను బట్టి తెలుస్తోంది. గత ఎనిమిది వారాల్లో ఇది అత్యధికం. నాలుగు వారాల సగటు రోజుకు 40,000 బ్యారెల్స్‌కు పెరిగింది. రష్యాకున్న ఆసియా వినియోగదారులకు ఆగస్టు20కల్లా రోజుకు 2.53మిలియన్ బ్యారెల్స్ ఎగుమతి అవగా, రిపోర్టింగ్ కాలంలో ఇది 2.57మిలియన్ బ్యారెల్స్ కు పెరిగింది. చేరవలసిన ప్రదేశం చూపని ఓడలు అంతిమంగా భారతదేశానికి చేరుతున్నాయని ఈ నివేదిక సూచించింది.
యూరోపియన్ యూనియన్ దేశాలకు సముద్ర మార్గంలో ఎగుమతి అవుతున్న క్రూడ్ ఆయిల్ ఆగస్టు27కు ముందటి 28రోజుల్లో 125000 బిపిడీగా ఉంది. ఈ చమురు బల్గేరియా చేరుకుంది. ఆగస్టు27కు ముందటి నాలుగు వారాల్లో ఉత్తర ఐరోపా దేశాలకు క్రూడ్ ఆయిల్ ఏమాత్రం ఎగుమతి కాలేదని బ్లూమ్ బర్గ్ పేర్కొంది. అయితే అదే కాలంలో మధ్య ప్రాచ్యంలోని రష్యా ఏకైక వినియోగదారైన తుర్కీయే కి 156000బీపీడీ క్రూడ్ ఆయిల్ ఎగుమతి అయింది.
గతవారంలో రష్యా క్రూడ్ ఎగుమతులు పెరిగినప్పటికీ గ్లోబల్ మార్కెట్ లో ఒపెక్ ప్లస్ కూటమి తమలోతాము చేసుకున్న ఒప్పందం ప్రకారం రష్యా తన ఎగుమతులను సెప్టెంబర్ నుంచి తగ్గించుకుంటుంది. రష్యాకు ముందే సౌదీ అరేబియా ఇందుకు సంబంధించిన ప్రకటన చేసింది. రష్యా తన క్రూడ్ ఆయిల్ ఎగుమతులను 500000 బీపీడీ నుంచి 300000 బీపీడీకి తగ్గించుకుంటుందని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ ప్రకటించాడు.
రష్యా చమురు ఎగుమతులపైన ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించటంవల్ల రష్యా తన చమురు ఎగుమతులను గతానికి భిన్నంగా వేరే దేశాలకు ఎగుమతి చేస్తోంది. అంతేకాకుండా పశ్చిమ దేశాలు రష్యా చమురు ధరపైన విధించిన 60డాలర్ల(ఒక్కో బ్యారెల్ కు) సీలింగ్ ను అనుసరించే దేశాలకు రష్యా తన చమురును ఎగుమతి చేయటం లేదు.