వంశధార కాలువలో రైతు గల్లంతు

వంశధార కాలువలో గుర్రపుడెక్కను తొలగిస్తున్న రైతులు
వంశధార కాలువలో గుర్రపుడెక్కను తొలగిస్తున్న రైతులు

నవతెలంగాణ- శ్రీకాకుళం ప్రతినిధి : వంశధార కాలువలో ఓ రైతు శనివారం గల్లంతు అయ్యాడు. రెండు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అతని ఆచూకీ లభ్యం కాలేదు. కాలువల నిర్వహణలో ప్రభుత్వ ఉదాసీనతే ఈ పరిస్థితికి  దారితీసింది. వివరాల్లోకి వెళ్లితే… కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, పూడిక తొలగించేందుకు నిధులు విడుదల చేయాలన్న అధికారులు మొరను ప్రభుత్వం పట్టించుకోలేదు. శనివారం ఒక పోలాకికి చెందిన పదిమంది రైతులు స్వయంగా కాలువల్లోకి దిగి గుర్రపుడెక్క తొలగించుకునే పని మొదలుపెట్టారు. కాలువల్లో నీటి ఉధృతికి ముప్పిడి శాంతారావు (62) అనే రైతు గల్లంతయ్యాడు. రెండురోజులుగా ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు, రెవెన్యూ శాఖ గాలింపు చర్యలు చేపడుతున్నాయి. గుర్రపుడెక్క కోసం దిగి గల్లంతయ్యారంటే ప్రభుత్వానికి అప్రతిష్ట అని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రమాదవశాత్తు కాలు జారి గల్లంతైనట్టుగా ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు వంశధార కాలువల్లోని నీరు కాలువను ఆనుకుని ఉన్న పొలాలను ముంచెత్తింది. గుర్రపుడెక్క తొలగిస్తే నీరు కిందికి పోయి తమ పంటను కాపాడుకోవచ్చని భావించిన రైతులు కాలువలోకి దిగారు. ఈ క్రమంలోనే నీటి ఉధృతికి రైతు కొట్టుకుపోయాడు.

Spread the love