– ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి టాప్‌సీడ్, బెలారస్‌కు చెందిన అర్యానా సబలెంక, అమెరికా యువ సంచలనం కోకా గాఫ్ ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మూడోరౌండ్ పోటీలో వీరు వరుససెట్లలో ప్రత్యర్థులను చిత్తుచేశారు. గాఫ్ 6-4, 6-2తో కెనడాకు చెందిన 30వ సీడ్ ఫెర్నాండెజ్‌పై సునాయాసంగా విజయం సాధించింది. ఇక సబలెంక 7-6(7-5), 6-4తో టాసన్(డెన్మార్క్)పై పోరాడి నెగ్గింది. ఇతర పోటీల్లో 7వ సీడ్ పెగూల(అమెరికా) 7-6(7-3), 6-1తో డానిలోవిక్ (క్రొయేషియా), 14వ సీడ్ రష్యాకు చెందిన ఆండ్రీవా 6-2, 1-6, 6-2తో 23వ సీడ్ ఫ్రెచ్(పోలండ్)ను చిత్తుచేసింది. ఇక మూడుసెట్ల హోరాహోరీ పోరులో 18వ సీడ్ వేకిక్(క్రొయేషియా) 7-6(7-4), 6-7(3-7), 7-5తో 12వ సీడ్ ష్నడైర్(రష్యా)ను ఓడించింది. మరో పోటీలో జపాన్ భామ నవోమీ ఒసాకా 6-7(3-7)తో బెన్సిక్(డెన్మార్క్) చేతిలో తొలిసెట్‌ను కోల్పోయిన తర్వాత మ్యాచ్ మధ్యలో అర్ధాంతంగా వైదొలిగింది.
జకో జోరు..
పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన మూడోరౌండ్ పోటీలో జకోవిచ్ 6-1, 6-4, 6-4తో 26వ సీడ్ మఛాక్(చెక్)ను చిత్తుచేశాడు. మరో పోటీలో 2వ సీడ్ జ్వెరేవ్(జర్మనీ) 6-3, 6-4, 6-4తో ఫర్నిలే(బ్రిటన్)పై, 14వ సీడ్ హాంబర్ట్(ఫ్రాన్స్) 4-6, 7-5, 6-4, 1-0తో సహచర ఆటగాడు, 20వ సీడ్ ఫెల్స్‌ను ఓడించాడు. ఇక ఐదుసెట్ల హోరాహోరీ పోరులో 15వ సీడ్ డ్రాపర్ 6-4, 2-6, 5-7, 7-6(7-5), 7-6(10-8)తో యూవిక్(ఆస్ట్రేలియా)ను ఓడించి ప్రి క్వార్టర్స్‌కు చేరాడు.
రెండోరౌండ్‌కు బొప్పన్న జోడీ..
మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బొప్పన్న-జంగ్(చైనా) జంట రెండోరౌండ్‌కు చేరింది. తొలిరౌండ్‌లో వీరు 6-4, 6-4తో క్రొయేషియా-ఫ్రాన్స్ జంటను ఓడించారు.