గమ్యం లేని సడక్‌ పీఎంజీఎస్‌వై పురోగతి పేలవం

– 6 రాష్ట్రాలు, యూటీలలో పనితీరు దారుణం
– గ్రామీణ రహదారి లక్ష్యాలలో 20 శాతం కూడా చేరుకోని వైనం
– కేంద్రం నివేదిక
న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) ఆశించిన ఫలితాలను సాధించటం లేదు. ఈ పథకం కింద దేశంలోని అనేక రాష్ట్రాల్లో రోడ్ల నిర్మాణాలు నిర్దేశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. పురోగతి అంతంత మాత్రంగానే ఉన్నది. నిర్దేశిత లక్ష్యాలను సాధించటంలో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీలు) పనితీరు దారుణంగా ఉన్నది. ఇవి తమ లక్ష్యాలలో 20 శాతం కూడా చేరుకోలేకపోయాయి. కేంద్రం ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
గత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో పీఎంజీఎస్‌వై కింద తమ లక్ష్యాలలో 20 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేక ఈ రాష్ట్రాలు చేతులెత్తేశాయి. పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రతో సహా ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీలు) ఈ జాబితాలో ఉన్నాయి. స్టాటిస్టిక్స్‌, ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్‌పీఐ) పురోగతి నివేదికలో ఈ విషయం వెల్లడైంది. జార్ఖండ్‌, నాగాలాండ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు 20 శాతం లక్ష్యాన్ని చేరుకోని రాష్ట్రాలు, యూటీల జాబితాలో ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలానికి సంబంధించి ఛత్తీస్‌గఢ్‌ తన లక్ష్యంలో సరిగ్గా 20 శాతానికి చేరుకున్నది. ఈ రాష్ట్రాల పని తీరును చూస్తే.. నాగాలాండ్‌(19శాతం), జార్ఖండ్‌(18 శాతం), మహారాష్ట్ర (15 శాతం), పశ్చిమ బెంగాల్‌ (12 శాతం), అండమాన్‌ నికోబార్‌ దీవులు (8శాతం) ఉన్నాయి.
ఇక 80 శాతం కంటే తక్కువ లక్ష్యాలను చేరుకున్న రాష్ట్రాలు, యూటీల పురోగతిని ”పేలవం(పూర్‌)”గా నివేదికలో వర్గీకరించారు. ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌, అసోం, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాలు సహా మొత్తంగా 24 రాష్ట్రాలు, యూటీలు ఉన్నాయి.
పీఎంజీఎస్‌వై పురోగతి పేలవం
పీఎంజీఎస్‌వై మొత్తం పురోగతి.. నివేదికలో ”పేలవమైనది” అని పేర్కొనబడటం గమనార్హం. గతేడాది ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య సంచిత లక్ష్యంలో కేవలం 53 శాతం మాత్రమే సాధించబడింది. మొత్తం 18,808 కిలోమీటర్ల రహదారిని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించారు. ఈ కాలానికి లక్ష్యాన్ని 35,385 కిలోమీటర్లుగా నిర్దేశించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ వార్షిక లక్ష్యం 47,171 కిలోమీటర్లుగా ఉండటం గమనార్హం.
గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. ఈ పథకం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 29,753 కిలోమీటర్ల రహదారి నిర్మితమైంది. ఇది లక్ష్యంలో 63 శాతంగా ఉన్నది. 2014 నుంచి ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 3.53 లక్షల కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించామని ప్రతినిధి తెలిపారు. అయితే, లక్ష్యాలను చేరుకోకపోవటం, ఆలస్యానికి గల కారణాల గురించి మాత్రం సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి ప్రస్తుతానికి స్పందన లేదు.

Spread the love