ఎస్‌బిఐ లైఫ్‌ చేతికి సహారా బీమా పాలసీలు

న్యూఢిల్లీ : సహారా ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఎస్‌ఐఎల్‌ఐసి)కి చెందిన 2,00,000 పాలసీలను ఎస్‌బిఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్వాధీనం చేసుకుంది. సహారా లైఫ్‌ రెగ్యూలేటరీ నిబంధనలు పాటించని నేపథ్యంలో ఇన్సూరెన్స్‌ రెగ్యూలేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డిఎఐ) ఈ చర్య తీసుకుంది. పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో సహార లైఫ్‌ విఫలమయ్యింది. ఆర్థిక నష్టాలు పెరిగి సంక్షోభంలో చిక్కుకుంది. సహారా లైఫ్‌ పాలసీదారులకు సజావుగా సేవలందించడానికి గాను ఐఆర్‌డిఎఐ 2017లో ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. పాలసీదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇన్సూరెన్స్‌ చట్టం, 1938లోని సెక్షన్‌ 52బి సబ్‌ సెక్షన్‌ (2) కింద అధికారాలను ఉపయోగించి సహారా లైఫ్‌ జీవిత బీమా వ్యాపారాన్ని మరొక జీవిత బీమా సంస్థకు బదిలీ చేయాలని అథారిటీ నిర్ణయించింది. ఎస్‌ఐఎల్‌ఐసి పాలసీదారుల ప్రయోజనాల దృష్ట్యా పరిస్థితిని పర్యవేక్షిస్తు అవసరమైన ఆదేశాలను కూడా జారీ చేస్తామని ఐఆర్‌డిఎ తెలిపింది. పాలసీదారుల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని ఎస్‌బిఐ లైఫ్‌ను ఐఆర్‌డిఎఐ ఆదేశించింది. గడిచిన ఏప్రిల్‌లో ఎస్‌బిఐ లైఫ్‌ నూతన వ్యాపార ప్రీమియం 8 శాతం పెరిగి రూ.1,336.87 కోట్లకు చేరింది. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 990 శాఖలతో 4,90,36,079 పాలసీదారులకు సేవలు అందిస్తుంది.

Spread the love