సాహిత్య శిరోమ‌ణి నీహారిణి

సాహిత్య శిరోమ‌ణి నీహారిణిడా.కొండపల్లి నీహారిణి… నిరంతర సాహితీ పిపాసి. నిత్య చైతన్యశీలి. ఒక సామాన్య గృహిణిగా సంసార బాధ్యతలు మోస్తూ కూడా తెలుగు భాషాభిమానంతో, సాహిత్యాభినివేశంతో రచనలు చేయడం ప్రారంభించి తన జీవితానికి ఒక సార్థకతను ఏర్పరచుకున్నారు. అంతేనా తనలాంటి మరికొంత మంది మహిళల రచనలను ప్రపంచానికి పరిచయం చేయాలనే తపనతో మయూఖ పేరుతో ఓ అంతర్జాల పత్రికను విజయవంతంగా నడిపిస్తున్నారు. అందుకుగాను ఇటీవల అమృతలత అపూర్వ అవార్డును సైతం అందుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
నీహారణి 1963, డిసెంబర్‌ 8న పుట్టారు. సొంతూరు చిన్న పెండ్యాల, జనగాం జిల్లా. తల్లి పెండ్యాల కౌసల్యాదేవి, స్త్రీల సాధికారత కోసం ఆనాడే మహిళా మండలిని నడిపి ఆదర్శ మహిళగా నిలిచారు. తండ్రి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, వరంగల్‌ జిల్లా మొట్టమొదటి లోక్‌సభ సభ్యులు, కమ్యూనిస్టు నాయకులైన పెండ్యాల రాఘవరావు. ఇలాంటి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన ఆమెకు ఎలాంటి బేధ భావం లేకుండా అందరినీ సమానంగా ఆదరించడం, ప్రేమించడం, ప్రోత్సహించడం వంటివి పుట్టుకతో వచ్చిన సద్గుణాలు. చిన్నతనం నుండి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్లాసు పుస్తకాలతో పాటు సాహిత్యాన్ని కూడా విరివిగా చదివేవారు. ఇంటర్‌ తర్వాత తెలుగుపై ఉన్న ఆసక్తితో కాకతీయ యూనివర్సిటీలో బీఏ తెలుగు కోసం చేరారు.
మామయ్య ప్రోత్సాహంతో
డిగ్రీ రెండో ఏడాదిలో ఉండగా తండ్రి ప్రాణ స్నేహితుడైన కొండపల్లి శేషగిరిరావు కొడుకు వేణుగోపాలరావుతో నీహారిణి వివాహం జరిగింది. గొప్ప కుటుంబంలో పుట్టిన ఆమె, పెండ్లి తర్వాత కూడా అలాంటి మరో కుటుంబంలోకి అడుగుపెట్టారు. వీరికి కూతురు దీప్తి, కొడుకు భార్గవ్‌ ఉన్నారు. ప్రముఖ జాతీయ చిత్రకారులు, హంస అవార్డు గ్రహీత కొండపల్లి శేషగిరిరావు వీరి మామయ్య. పెండ్లి తర్వాత ఆయన ప్రోత్సాహంతో తన చదువును కొనసాగించారు. ఆయనే కోడలిని స్వయంగా హైదరాబాద్‌లోని రెడ్డి ఉమెన్స్‌ కాలేజీలో డిగ్రీ మూడో ఏడాదిలో చేర్పించారు. అయితే పరీక్షల సమయంలో గర్భవతిగా ఉన్న నీహారిణి ఫెయిల్‌ అయ్యారు. కానీ శేషగిరిరావు ఆమెకు ధైర్యం చెప్పి మళ్ళీ పరీక్షలు రాయించారు. 1991లో తెలుగు పండిత శిక్షణ చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు ఎమ్మె కూడా పూర్తి చేశారు.
ఒద్దిరాజు సోదరుల జీవితం
కడవరకు చిత్రకళే తన జీవితంగా బతికిన తన మామయ్య జీవిత చరిత్రను 2009లో ‘చిత్రకళా తపస్వి డాక్టర్‌ కొండపల్లి శేషగిరిరావు’ పేరుతో రాశారు. ఆనాటి చరిత్ర, సాంఘిక సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ, ఆసాంతం చదివించే శైలిలో మనసుకు హత్తుకునేలా రచించిన ఈ పుస్తకాన్ని తెలుగు అకాడమీ వారు ప్రచురించారు. అలాగే మరింగంటి లక్ష్మణాచార్య ఈ పుస్తకాన్ని హిందీలోకి అను వదించారు. తర్వాత కాలంలో ఎలాగైనా పీహెచ్‌డీ చేయాలనే బలమైన కోరికతో 2016లో వివిధ రంగాల్లో నిష్ణాతులై, తమ ప్రతిభను లోకానికి చాటిన ఒద్దిరాజు సోదరుల సమగ్ర జీవితాన్ని ఏడు వందల పేజీల ఉద్గ్రంథంగా ‘తెలంగాణ వేగు చుక్కలు – ఒద్దిరాజు సోదరులు’ అనే పరిశోధనా గ్రంథాన్ని వెలువరించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు.
సమాజ హితవును కోరుతూ
ఇరవై ఏండ్లు అనేక ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయవృత్తిలో కొనసాగిన ఆమె తర్వాత తన పూర్తి కాలాన్ని సాహిత్య సేవకు అంకితం చేశారు. స్త్రీవాద దృక్పథంతో, సామాజిక నేపథ్యంతో, మానవీయకోణంలో, ప్రకృతి విధ్వంసాలకు పాల్పడవద్దనే ఉద్దేశంతో రాసిన తన కవితలన్నింటినీ అర్ర తలుపులు, నిర్నిద్ర గానం, ఎనిమిదో అడుగు, కాల ప్రభంజనం అనే నాలుగు కవితా సంపుటాలుగా వెలువరించారు. మానవ సంబంధాలు మెరుగుపడాలన్న ఆకాంక్ష, మంచితనం, మానవత్వం మరుగునపడిపోయే ప్రమాదాన్ని పసిగట్టాలనే ఆరాటం, స్త్రీల జీవితాలను ఉన్నతంగా చూడాలనే కోరికతో, సమాజాన్ని దగ్గరగా చూస్తూ అనేక సమస్యలపట్ల అవగాహనతో సమాజ హితవును కోరుతూ రాసిన కథలతో రాచిప్ప, ఘర్షణ అనే రెండు సంపుటాలు వెలువరించారు.
అమెరికాలో ఉంటూనే…
లోతైన విశ్లేషణ, విలువైన విషయాలను క్రోడీకరిస్తూ వీరు రచించిన వ్యాసాలు సృజన రంజని, వ్యాహారిక, అనివార్యం అనే మూడు విమర్శ వ్యాస సంపుటాలుగా వెలువడ్డాయి. ఇరవై ఏండ్ల ఆమె సాహితీ ప్రస్తానంలో చీఫ్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన భర్త వేణుగోపాలరావు ప్రోత్సాహం ఎంతో ఉంది. తన పిల్లలు విదేశాల్లో స్థిరపడిన తర్వాత కుటుంబ అవసరాల రీత్యా నీహారిణి నిత్యం విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం అనివార్యమయింది. అమెరికాలో ఉంటూనే ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొని తెలుగు తేజాన్ని చాటుతున్నారు. అమెరికా – ఇండియా దేశాల జీవన విధానాన్ని సమవీక్షణ చేస్తూ బంధాలు, బాధ్యతల మధ్య వ్యత్యాసాలు, అవసరాల గురించి చెబుతూ ‘అమెరికాలో ఆరు నెలలు’ అనే ఓ యాత్రా చరిత్రను వెలువరించారు. ఆమె రచించిన కాల ప్రభంజనం కవితా సంపుటిని ప్రముఖ కవి ఎలనాగ ‘టెంపెస్ట్‌ ఆఫ్‌ టైమ్‌’ పేరుతో ఇంగ్లీష్‌లోకి అనువదించారు. రచనలతో పాటు ఆమె ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం కూడా వహించారు. ముఖ్యంగా కరోనా సమయంలో ముంచుకొచ్చిన అంతర్జాల అవసరాలను గుర్తించి మయూఖ పేరుతో ద్వైమాసిక అంతర్జాల పత్రికను 2021లో ప్రారంభించారు. తర్వాత కాలంలో తరుణి యూట్యూబ్‌ ఛానల్‌ని కూడా ప్రారంభించారు.
కృషికి దక్కిన గౌరవం
సాహిత్యానికి చేస్తున్న కృషికిగాను ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2012లో షీ ఫౌండేషన్‌ వారి షీ అవార్డు అందుకున్నారు. 2014లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి ‘కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్రకు కీర్తి పురస్కారం, 2021లో ఉత్తమ రచయిత్రిగా ప్రతిభా పురస్కారం అందుకున్నారు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ అంతర్జాతీయ సాహితీ సదస్సు వారి ఆత్మీయ పురస్కారం, వాషింగ్టన్‌ అమెరికా తెలుగు సంఘం వారి ఉత్తమ మహిళా అవార్డు, శ్రీమతి తిరుమల రాజ్యలక్ష్మీ స్మారక సాహితీ పురస్కారం, అమెరికా అకెల్లా ఫౌండేషన్‌ వారి ఉమెన్‌ ఐకాన్‌ అవార్డు, శ్రీ విజయ సారధి ధర్మనిధి పురస్కారం, ప్రమీలా శక్తిపీఠం వారి విశిష్ట సాహితీ పురస్కారం, సోమ సీతారాములు రాష్ట్ర స్థాయి పురస్కారం, ఎం.వి.నరసింహారెడ్డిచే కళాశ్రీ బిరుదు, లయన్స్‌ క్లబ్‌ వారిచే ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు, లక్కరాజు కమలమ్మ స్మారక పురస్కారం లాంటి ఎన్నో అవార్డులు అమెను వరించాయి. ఇంతటి ప్రతిభ ఉన్నా, ఎన్ని అవార్డులు వరించినా నిరాడంబరంత, నిష్కల్మషత, పెదవులపై సదా చెరగని చిరునవ్వు ఆమెకు పెట్టని ఆభరణలు.
– సలీమ 

Spread the love