కేసీఆర్‌పై పోటీకి సై

Sai to compete against KCR– పార్టీ ఆదేశిస్తే కామారెడ్డిలో రంగంలోకి…
– బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలది ఒకటే చెడ్డీ గ్యాంగ్‌
– ఆపేయమని కాదు..నోటిఫికేషన్‌కు ముందే పథకాలకు నిధులు విడుదల చేయాలని చెప్పాం
– బీఆర్‌ఎస్‌ది తప్పుడు ప్రచారం
– కాంగ్రెస్‌ను బూచిగా చూపి చెల్లింపులు నిలిపే కుట్ర : రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్టీ ఆదేశిస్తే… కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ చెబుతున్నట్లు పాలమూరును సస్యశ్యామలం చేయడం నిజమైతే కొడంగల్‌లో తనపై పోటీకి రావాలని సవాల్‌ విసిరారు. కామారెడ్డిలో నేను, సిరిసిల్లలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోటీ చేసి, కేసీఆర్‌, కేటీఆర్‌లను చిత్తుగా ఓడిస్తామన్నారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎప్పుడూ హంగ్‌కు అవకాశం ఇవ్వలేదని, తెలంగాణలోనూ హంగ్‌ ఎప్పుడూ రాలేదని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 2/3 మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం నాడిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిలతో కలిసి రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం… ఈ మూడు పార్టీలు చెడ్డీ గ్యాంగ్‌ లాంటివని ఆయన ఆరోపించారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి పోటీ చేయనున్నాయని, ఈ దిశలో సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయని చెప్పారు. కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌లు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. ‘తెలంగాణలో బీజేపీ అనుకూల ప్రభుత్వమే ఉంది. అందుకే అక్కడ ఎటువంటి దాడులు ఉండవు. లేదంటే ఎన్నికలు ఉండే రాష్ట్రాలకు ఈడీ, సీబీఐలు ముందు వెళ్తాయి. కాంగ్రెస్‌ను వీడిన నాయకులు బీజేపీ సిద్దాంతాలు నమ్మి పోలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. కేసీఆర్‌ పై చర్యలు తీసుకుంటుందని నమ్మి బీజేపీలోకి వెళ్లారు. అది అక్కడ సాధ్యం కాదని నమ్మి వెనక్కి వస్తున్నారు.’ అని వ్యాఖ్యానించారు. రాజ్‌ గోపాల్‌ రెడ్డి, డి.కె అరుణ, విజయశాంతి, విశ్వేశ్వర్‌ రెడ్డిలు సిద్దాంతాలు నమ్మి బీజేపీలో చేరలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరే వారికి పార్టీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. బీజేపీ, జనసేనతో పాటు కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీని కూడా చేర్చుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఎంఐఎంతో కలిసి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
కేసీఆర్‌ నిధులు ఆపాలని చూస్తుండ్రు
బీసీ బంధు, గృహలక్ష్మి, రైతు బంధు వంటి పథకాల చెల్లింపులు నవంబర్‌ 2లోగా విడుదల చేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నగదు బదిలీని పూర్తి చేయాలని ఈసీకి చెప్పామని, కానీ, సంక్షేమ పథకాలు ఆపేయాలని ఫిర్యాదు చేసినట్లు బీఆర్‌ఎస్‌ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీని బూచిగా చూపి కేసీఆర్‌ చెల్లింపులు ఆపాలని చూస్తున్నారన్నారు. తమపై తప్పుడు ప్రచారం చేసినా బీఆర్‌ఎస్‌ను ఎవరూ ఓటమి నుంచి కాపాడలేరన్నారు. మళ్లీ కేసీఆర్‌ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఒకవేళ కేసీఆర్‌ చెల్లింపులు వాయిదా వేస్తే.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే చెల్లిస్తుందన్నారు. ఇప్పుడు తీసుకుంటే రూ.10 వేల రైతు బంధు, రూ. 2 వేల పెన్షన్‌ మాత్రమే వస్తుందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తీసుకుంటే రూ.15 వేల రైతు బంధు, రూ.4 వేల పెన్షన్‌ చెల్లిస్తుందని తెలిపారు. రిటైర్డ్‌ అధికారులకు పదవులిచ్చి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు కేసీఆర్‌ ప్రైవేటు ఆర్మీలా వాడుకుంటు న్నారని విమర్శించారు. నిజాం దగ్గర రజాకార్ల లాగా.. కేసీఆర్‌ వద్ద ఈ అధికారులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాల్లో మేడలా మేడిగడ్డ నిర్మాణం
సాయిల్‌ టెస్ట్‌ వంటి జాగ్రత్తలు పాటించకుండా… గాల్లో మేడలా మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను నిర్మించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈఎన్సీ మురళీధర్‌ రావు 12 ఏండ్ల క్రితం రిటైర్‌ అయ్యారని, కేసీఆర్‌కి, మురళీధర్‌ రావుకి ఉన్న సంబంధమేంటని నిలదీశారు. దోచుకునేందుకే ఇలాంటి అధికారులను పెట్టుకున్నారని ఆరోపించారు. ఇసుక కొట్టుకు పోతే డ్యాం కుంగిందంటే, ఎంత నాణ్యత లోపం ఉందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. కేంద్రం నుంచి వచ్చిన డ్యామ్‌ సేఫ్టీ అధికారులు మేడిగడ్డను పరిశీలించిన అనంతరం ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఇంత ప్రమాదం జరిగితే ఎల్‌అండ్‌ టీ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, వారిని ఎందుకు బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టడం లేదని అన్నారు. కేంద్రానికి, బీఆర్‌ఎస్‌కు ఉన్న లాలూచీ ఏంటి..? అని ప్రశ్నించారు. మేడిగడ్డ కాదు.. కేసీఆర్‌ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. కేంద్రానికి కేసీఆర్‌ ప్రొటెక్షన్‌ మనీ చెల్లించినందునే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. హరీశ్‌రావు, కేటీఆర్‌ బిల్లా రంగా లాంటివారని.. కేసీఆర్‌ చార్లెస్‌ శోభారాజ్‌ లాంటి వారని విమర్శించారు. వాళ్లేం చేశారో చెప్పకుండా కాంగ్రెస్‌పై ఎదురు దాడికి దిగుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఈడీ, ఐటీ, సీబీఐ బీజేపీకి ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్లని ఆరోపించారు.
త్వరలో రెండో జాబితా : భట్టి విక్రమార్క
అభ్యర్థుల స్క్రీనింగ్‌ ముగిసిందని, కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిటీ (సీఈసీ) భేటీలో ఆమోదం తర్వాత త్వరలో రెండో జాబితా విడుదల ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. వామపక్షాలతో చర్చలు కొనసాగతున్నాయన్నారు. ప్రగతి భవన్‌, ఎమ్మెల్యేల క్యాంప్‌ కార్యాలయాలను బీఆర్‌ఎస్‌ రాజకీయ కార్యక్రమాలకు వినియోగించకుండా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. చాలా మంది అధికారులు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారి పేర్లను ఈసీఐకి ఇచ్చామని అన్నారు.

Spread the love