ఆర్టీసీ సిబ్బందిపై దాడులు సహించం: సజ్జనార్

నవతెలంగాణ హైదరాబాద్ : తమ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. నిందితులపై పోలీస్ శాఖ సహకారంతో రౌడీ షీట్స్ తెరుస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుషాయిగూడ డిపోకు చెందిన డ్రైవర్ దారావత్ గణేశ్ ను ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితోపాటు దాడి జరిగిన తీరుపై గణేశ్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గణేశ్ కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ నెల 20న ఉస్మానియా యూనివర్శిటీ వైజంక్షన్ వద్ద జరిగిన ఘటనలో అఫ్జల్ గంజ్  నుంచి ఘాట్ కేసర్ వైపునకు వెళ్తున్న రూట్ నంబర్ 231/1 మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్ గణేశ్ పై  కొంతమంది వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.  ఎలాంటి తప్పు లేకున్నా బస్సును రోడ్డుపై ఆపి సీటులో ఉన్న డ్రైవర్ ను అసభ్యపదజాలంతో దూషిస్తూ ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. గణేశ్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆయనను తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు. దుండగులపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో పలు‌ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయని సజ్జనార్ తెలిపారు.‌

Spread the love