4 నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయం

Sale of Electoral Bonds from 4– ఇది ‘చట్టబద్ధమైన లంచం’ : కాంగ్రెస్‌
న్యూఢిల్లీ : 28వ విడత ఎలక్టోరల్‌ బాండ్ల అమ్మకాలు ఈ నెల 4 నుంచి మొదలుకానున్నాయి. పది రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. వీటిని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ద్వారా మాత్రమే విక్రయిస్తారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం వెలువడింది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. దీనిని ”చట్టబద్ధమైన లంచం” అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి చిదంబరం శనివారం అభివర్ణించారు ఇది బిజెపికి ”బంగారు పంట” అని ఆయన ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ఢిల్లీలోని ప్రభువులకు నజరానాగా క్రోనీ క్యాపిటలిస్టులు తమ చెక్‌ బుక్‌లను తెరుస్తారు” అని ఆయన వ్యాఖ్యానించారు. .ఈ ఎలక్టొరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన కేపిటలిస్టులు తమకు నచ్చిన రాజకీయ పార్టీకి విరాళంగా ఇస్తారు. అయితే, ఈ ఎలక్టొరల్‌ బాండ్ల సిస్టమ్‌ ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 90 శాతానికిపైగా బాండ్లు బీజేపీ ఖాతాలో జమ అవుతున్నాయి. ఇది పెద్ద ఫ్రాడ్‌ అని వామపక్షాలు వీటిని ప్రవేశపెట్టినప్పుడే విమర్శించాయి. .మొదటి విడత ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయం మార్చి 2018లో జరిగింది. ఎలక్టోరల్‌ బాండ్‌లను భారతీయ పౌరులు లేదా దేశంలో విలీనం చేసిన లేదా స్థాపించబడిన సంస్థలు కొనుగోలు చేయవచ్చు.గత లోక్‌సభ లేదా శాసనసభ ఎన్నికలలో పోలైన ఓట్లలో 1శాతం కంటే తక్కువ కాకుండా ఓట్లు పొందిన రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా నిధులు పొందేందుకు అర్హులు.ఎలక్టోరల్‌ బాండ్ల పథకం దేశంలోని ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న అత్యంత ”దౌర్జన్య చర్యల”లో ఒకటి అని ప్రతిపక్ష పార్టీలే కాదు, పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.

Spread the love