– వాటి నాణ్యతపై తనిఖీ చేయాలి : తెలంగాణ ఫార్మా సొసైటీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చైన్ ఫార్మసీల ద్వారా 50 నుంచి 80 శాతం భారీ డిస్కౌంట్‌తో ప్రజలకు విక్రయిస్తున్న నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలని తెలంగాణ ఫార్మా సొసైటీ కోరింది. ఈ మేరకు తెలంగాణ ఫార్మా సొసైటీ అధ్యక్షులు, ఫార్మకాలజిస్ట్ ఎ.సంజరు రెడ్డి డ్రగ్ కంట్రోల్ అథారిటీ డీజీ వీ.బీ.కమలాసన్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా వినతిపత్రాన్ని సమర్పించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940లోని రూల్స్ 1945 సెక్షన్ 65(2), (4), (9) అమలు చేసి ప్రాణాలను కాపాడాలని కోరారు. ఉత్తరాఖండ్ నుంచి రాష్ట్రానికి వస్తున్న నకిలీ మందులను డీసీఏ అధికారులు దాడుల్లో సీజ్ చేయడంతో ఆ రాష్ట్ర మందుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. చైన్ ఫార్మసీలు ఒక వైపు ఔషధాలను తగ్గింపు ధరలకు విక్రయిస్తూ, మరో వైపు కొన్ని మందులకు ఎన్ పీపీఏ నిబంధనలను దాటవేసి అధిక ధరలకు అమ్ముతున్నాయని ఆరోపించారు. ఔషధాలకు సంబంధించి చట్టవిరుద్ధంగా చేస్తున్న మార్కెటింగ్ వ్యూహాన్ని ఆపేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.