నవతెలంగాణ – న్యూయార్క్: డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడేందుకు సిద్ధమవుతున్న కమలా హారిస్‌కు ప్రవాస భారతీయ రచయిత సల్మాన్ రష్దీ మద్దతు పలికారు. దేశాన్ని నిరంకుశంవైపు తీసుకెళ్లే ట్రంప్‌ను అడ్డుకోగలిగే సమర్థ నేత ఆమేనని స్పష్టం చేశారు. ఆదివారం న్యూయార్క్‌లో జరిగిన ‘సౌత్ ఏషియన్ మెన్ ఫర్ అమెరికా’ కార్యక్రమంలో రష్దీ మాట్లాడారు. ఇందులో భారతీయ అమెరికన్ ప్రముఖులైన చట్టసభ సభ్యులు, రచయితలు, పాలసీ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, భారతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ‘ఇది క్లిష్ట సమయం. నేను ముంబయి నుంచి వచ్చినవాడిని. ఒక భారతీయ అమెరికన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకురావడం పట్ల గర్విస్తున్నా. నా భార్య కూడా ఆఫ్రో అమెరికనే. హారిస్ ఆఫ్రో ఇండియన్ అమెరికన్‌గా బరిలోకి దిగాలనుకోవడాన్ని సహజంగానే ఇష్టపడతాం’ అని రష్దీ తెలిపారు. అలా అని జాతుల ఆధారంగా మద్దతు ఇవ్వడం లేదని, దానికి ఉదాహరణ రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ సతీమణి ఉష భారతీయ అమెరికన్ అయినా ఆమెకు అండగా లేమని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. హారిస్ ఓడిపోతారనడానికి కారణాలేవీ లేవని, ఆమె విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.