విరాట్‌ ‘వంద’నం

– ఛేదనలో శతకబాదిన విరాట్‌ కోహ్లి
– హైదరాబాద్‌పై బెంగళూర్‌ గెలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌

విరాట్‌ కోహ్లి (100, 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఉప్పల్‌లో వీర విహారం చేశాడు. 12 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగిన కోహ్లి.. ఐపీఎల్‌లో ఆరో శతకం నమోదు చేశాడు. 187 పరుగుల ఛేదనలో కోహ్లి శతకానికి తోడు కెప్టెన్‌ డుప్లెసిస్‌ (71, 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో 19.2 ఓవర్లలోనే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ లాంఛనం ముగించింది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (5 నాటౌట్‌), బ్రాస్‌వెల్‌ (4 నాటౌట్‌) చివర్లో ఆకట్టుకున్నారు. కోహ్లి, డుప్లెసిస్‌ తొలి వికెట్‌కు 172 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేయగా.. కోహ్లి 62 బంతుల్లో శతకం సాధించగా, డుప్లెసిస్‌ 24 బంతుల్లోనే అర్థ సెంచరీ కొట్టాడు. ఆఖర్లో ఓపెనర్లు నిష్క్రమించినా.. బెంగళూర్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూర్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. చివరి మ్యాచ్‌లో టైటాన్స్‌పై నెగ్గితే కోహ్లి గ్యాంగ్‌ నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (104, 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకంతో 186 పరుగులు చేసింది. ఓ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు సెంచరీలు చేయటం ఐపీఎల్‌ చరిత్రలో ఇదే ప్రథమం.
ఖతర్నాక్‌ క్లాసెన్‌ : టాస్‌ నెగ్గిన బెంగళూర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (11), రాహుల్‌ త్రిపాఠి (15) హైదరాబాద్‌కు మంచి ఆరంభం ఇవ్వలేదు. కెప్టెన్‌ మార్క్‌రామ్‌ (18, 20 బంతుల్లో) ఓ ఎండ్‌లో యాంకర్‌ పాత్ర పోషించాడు. నం.4 బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ వన్‌ మ్యాన్‌ షోతో చెలరేగాడు. మార్క్‌రామ్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేయగా.. క్లాసెన్‌ బౌండరీల మీద దండెత్తాడు. 24 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన క్లాసెన్‌.. హర్షల్‌ పటేల్‌ ఓవర్లో స్ట్రయిట్‌ సిక్సర్‌తో ఐపీఎల్‌లో తొలి శతకం సాధించాడు. 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 49 బంతుల్లోనే క్లాసెన్‌ సెంచరీ కొట్టాడు. మార్క్‌రామ్‌తో కలిసి మూడో వికెట్‌కు 76 పరుగులు జోడించిన క్లాసెన్‌.. హ్యారీ బ్రూక్‌ (27 నాటౌట్‌)తో కలిసి నాల్గో వికెట్‌కు 74 పరుగులు పిండుకున్నాడు. హెన్రిచ్‌ నిష్క్రమణతో చివరి రెండు ఓవర్లలో బెంగళూర్‌ పరుగుల పొదుపు పాటించింది. లేదంటే, సన్‌రైజర్స్‌ 200కి పైగా పరుగులు సాధించేదే!. సన్‌రైజర్స్‌ తరఫున క్లాసెన్‌ మినహా మరో బ్యాటర్‌ రాణించలేదు. ఓ ఎండ్‌లో క్లాసెన్‌ బాదగా.. మరో ఎండ్‌ నుంచి మార్క్‌రామ్‌, హ్యారీ బ్రూక్‌ సహకారం అందించారు. అతడి నిష్క్రమణతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌కు మంచి ముగింపు దక్కలేదు.

Spread the love