– ఐదేండ్లుగా ఏం చేశారు?
– ఈడీ, సీబీఐ చర్యలపై నితీశ్ కుమార్
న్యూఢిల్లీ : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేయడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. దీనిని రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆయన అభివర్ణించారు. ఐదేండ్లుగా వారు (కేంద్ర దర్యాప్తు సంస్థలు) ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఉద్యోగాలకు భూమి (ల్యాండ్ ఫర్ జాబ్) కుంభకోణం కేసులో తేజస్వీకి సీబీఐ సమన్లు అందజేసిన విషయం విదితమే. ఈ కేసులో దర్యాప్తు సంస్థ చివరగా 2017లో దర్యాప్తు జరిపింది. ఆర్జేడీ నాయకులు, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబీకులతో సంబంధం ఉన్నవారిని సంస్థ ప్రశ్నించింది. ఆ సమయంలో నితీశ్ కుమార్ జేడీయూ, ఆర్జేడీ లు మిత్రపక్షాలుగా ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత రెండు పార్టీలు వేరు పడి మళ్లీ ఇటీవలే కలిసి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ”ఇది(కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు) 2017లో కూడా జరిగింది. ఐదేండ్ల తర్వాత మేము (జేడీయూ-ఆర్జేడీ) మళ్లీ కలిసిన తర్వాత సోదాలు తిరిగి జరుగుతున్నాయి.ఇంతకన్నా ఏం చెప్పాలి? విచారణను ఎదుర్కొంటున్నవారు (ఆర్జేడీ నాయకులు) స్పందిస్తున్నారు. అలాంటి విషయాలపై నేను ఎప్పుడూ స్పందించలేదని మీకు (మీడియా వ్యక్తులు) తెలుసు” అని పాట్నలో జర్నలిస్టులతో నితీశ్ కుమార్ అన్నారు.