‘ఇసుక’ బాధ్యత మీదే

The 'sand' is your responsibility– టీడీపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో సిఎం చంద్రబాబు
– పర్యాటక రంగంపై దృష్టి సారించాలని సూచన
అమరావతి : ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సమస్యలుంటే తన దృష్టికి తేవాలని చెప్పారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. టిడిపి కూటమి శాసనసభాపక్ష సమావేశం అసెంబ్లీ సమావేశ మందిరంలో మంగళవారం జరిగింది. జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పాల్గొన్న ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి 150 రోజులైందని, ఈ కాలంలో దెబ్బతిన్న వ్యవస్థలను పునర్‌ నిర్మిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రతిఒక్కరూ పేదలతో మమేకమవ్వాలని, వారి కనీస అవసరాలు తీర్చాలని చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టిసారించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతాలను గుర్తించాలని చెప్పారు. రాబోయే ఐదేళ్లు ఈ రంగంపై శ్రద్ధ పెడితే ఉపాధి అవకాశాలు పెద్దయెత్తున పెరుగుతాయని తెలిపారు. పర్యాటక రంగానికి కావాల్సింది గదులు, ఆస్పత్రులు, ఈవెంట్స్‌, ట్రావెల్‌ సదుపాయాలని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో 20 వేల గదులు నిర్మించేలా టాటా కంపెనీతో చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ రంగంలో ప్రభుత్వం రూపాయి ఖర్చు చేస్తే రూ.6 ఆదాయం వస్తుందన్నారు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పారు. ఎంత అభివృద్ధి చేస్తే అంత ఆదాయాన్ని రాబట్టొచ్చని వెల్లడించారు. ఎమ్మెల్యే ఛైర్మన్‌గా ప్రతి నియోజకవర్గంలో ఇండిస్టియల్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. దీపం-2 పథకంలో సమస్యలొస్తే తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. ఎస్‌సి వర్గీకరణపై ఇప్పటికే ఎమ్మెల్యేలతో మాట్లాడామని, జిల్లా వారీ ఎబిసి కేటగిరీలు పెట్టి జిల్లా, జోన్‌, స్టేట్‌ వారీ కమిటీలు వేసి అమలు చేస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాల యాలను పునర్‌వ్యవస్థీకరణ చేయాల్సి ఉందని అన్నారు. అకౌంటబిలిటీ సెట్‌ చేసి అన్ని సచివాల యాలను ఇంటిగ్రేట్‌ చేసి మరింతగా సేవలందించేలా చేస్తామన్నారు. తాను, పవన్‌కల్యాణ్‌ చెప్పేది ఆచరిం చాల్సింది ఎమ్మెల్యేలే అని తెలిపారు. 2029లోనూ మీరంతా మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచి రావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సమా వేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌, బిజెపి పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.
చీరాల ఎమ్మెల్యేపై చంద్రబాబు ఆగ్రహం
ఇసుక విధానంపై మాట్లాడిన చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య యాదవ్‌పై కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇసుక పాలసీలో లోపాలు ఉన్నాయని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య యాదవ్‌ ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో అన్నట్లు తెలిసింది. పాలసీ చదవకుండా మాట్లాడొద్దని మాలకొండయ్యపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మద్యం విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లేఖలను ఎమ్మెల్యేల కోటా సిఫార్సు లేఖలను 6కు పెంచుతామని గత సమావేశంలో చెప్పారు. ఈ అంశంపై ప్రస్తావించేందుకు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ప్రయత్నించగా విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ఆపి సమాధానం చెప్పారు. ఈ నెల 18న జరిగే టిటిడి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని లోకేష్‌ అన్నారు. చంద్రబాబే మనకు మార్గదర్శి అని, ఆయన అడుగుజాడల్లో నడావాలని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Spread the love