వీణవంక పోలీసుల నుండి ఇసుక పైసల్ వాపస్..

– ట్రాక్టర్ యజమానుల్లో పెల్లుబీకిన సంతోషం
– విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్న మండల ప్రజలు
నవతెలంగాణ-వీణవంక
మండలంలోని మానేరు తీర గ్రామాలైన మల్లారెడ్డిపల్లి, కోర్కల్, కొండపాక, పోతిరెడ్డిపల్లి, చల్లూరు, ఇప్పలపల్లి గ్రామాల్లో సుమారు 150కిపైగానే ఇసుక ట్రాక్టర్ల ద్వారా ఇసుకను జోరుగా అక్రమంగా రవాణా చేసేవారు. అయితే ప్రభుత్వం మండలంలో ఏడు చోట్ల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా నిలిచిపోయింది. హరితట్రిబునల్, సుప్రీం కోర్టు తీర్పుతో ఇసుక క్వారీలు నిలిచిపోయాయి. దీంతో మళ్లీ ఇసుక అక్రమ రవాణా దారులను ప్రోత్సహించి అధికారులు కోర్టు తీర్పులను పక్కకు పెట్టి మళ్లీ వారిని ప్రోత్సహించారు. దీంతో మండలంలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ తెరలేపినట్లైంది. అయితే ఒక్కో ట్రాక్టర్ నెలకు రూ.10 వేల చొప్పున పోలీసులకు ఇవ్వాలని లేకుంటే ఇసుక ట్రాక్టర్లు నడువవనే ఆడియోలు సైతం గతంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినట్లు ప్రజలు చర్చించుకునేవారు. అయితే మళ్లీ డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో పోలీసులు ఒక్కో ట్రాక్టర్కు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీంతో మళ్లీ వారు ఏం చేయాలో దిక్కు తోచక సుమారు 130 ట్రాక్టర్లకు పైగా మండలంలోని ఇసుక నడిచే అన్ని గ్రామాల ట్రాక్టర్ల యజమానులు పోలీసులకు ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొంత మంది ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో వారు సీరియస్ గా బదిలీపై వెళ్తున్న అధికారులను డబ్బులపై ఆరా తీయగా వాటిని వాపస్ చేసినట్లు మండలంలో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో ట్రాక్టర్ యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అధికారులకు ఇచ్చే డబ్బులు తగ్గడంతో ఎలాగైనా మండలంలో గృహావసరాలకు ఇసుక ధరలు తగ్గుతాయనే గంపెడాషతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఇసుక ధరలు తగ్గించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక అవినీతికి పాల్పడిన అధికారులపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Spread the love