– అధికారులు, వేగాన్ని నియంత్రించి ప్రమాదాలను విచారించేందుకు చర్యలు చేపట్టాలి.
– సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్.
నవతెలంగాణ – సిరిసిల్ల
ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న, ఇసుక ట్రాక్టర్ల వేగాన్ని నియంత్రించి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అధికారుల ను డిమాండ్ చేశారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రం బి వై నగర్ లో గల సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల మానేరు నది నుండి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను డ్రైవర్లు అతివేగంగా నడిపించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, పట్టణంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. గురువారం ఉదయం సిరిసిల్ల పట్టణంలోని కోర్టు ఎదురుగా రెండు ఇసుక ట్రాక్టర్లు కారును ఢీకొట్టడం జరిగిందని, గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం కూడా వాటిలిందన్నారు. ఇసుక ట్రాక్టర్లు నడిచే రోజు ప్రజలు రోడ్డుపై ప్రయాణించాలంటే తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని పట్టణంలోని మెయిన్ రోడ్ లోనే కాకుండా వీధి రోడ్డులో కూడా ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు అతివేగంగా నడుపుతూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. ఇసుక ట్రాక్టర్ నడిపే వారిలో చాలామంది మైనర్ యువకులు ఉన్నారని వారికి లైసెన్స్ కూడా లేని పరిస్థితిని కొంతమంది డాక్టర్ యజమానులు కాలం చెల్లిన ట్రాక్టర్లను ఇసుక రవాణాకు వినియోగిస్తూ మైనర్ యువకుల చేత ట్రాక్టర్లను నడిపించడం జరుగుతుందని ఆరోపించారు. ఎక్కువ ట్రిప్పులు కొట్టాలనే ఉద్దేశంతో డ్రైవర్లు అతివేగంగా ట్రాక్టర్ల ను నడుపుతూ పట్టణంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పర్యవేక్షించి, ప్రమాదాలు జరగకుండా ఇసుక ట్రాక్టర్ల వేగాన్ని నియంత్రించి,ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, నిబంధనలు పాటించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కోడం రమణ,ఎగుమంటి ఎల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.