త్యాగాల సంద్రం

Sandra of sacrificesకామ్రేడ్‌ సర్వదేవభట్ల రామనాథం. శ్రామికజనాభ్యుదయానికి తన సర్వస్వాన్నీ ధారపోసిన త్యాగాల సంద్రం..! ఉన్నతాదర్శాలను నరనరాన జీర్ణించుకున్న ఉత్తమ కమ్యూనిస్టు..! విద్యార్థిగానే విప్లవమార్గాన్ని ఎంచుకున్నాడు. వందేమాతరంపై నిషేధాం అమలులో ఉన్న రోజుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి హాస్టల్‌లో వందమందికి పైగా విద్యార్థులు ముక్తకంఠంతో గీతాలాపన చేశారు. ఆ విద్యార్థులందరికీ నోటీసులిచ్చి బహిష్కరించారు. ఆ విద్యార్థుల్లో రామనాథం ఒకరు. తెలంగాణ నిజాం రాచరికంపై తిరగబడుతోంది. ఆంధ్ర మహాసభ వెలుగులో కమ్యూనిస్టుపార్టీ సాయుధ పోరాటం సాగిస్తోంది. ఒకవైపు నిజాం పోలీసులతో రజాకారు ముష్కరులతో మరోవైపు భూస్వాములైన దొరలు, జాగీర్దార్లతో హౌరాహౌరీగా తలపడుతోంది. జమిందారీ కుటుంబంలో జన్మించిన ఆయన.. పోరాటం తన ఇంటినుంచే ప్రారంభించాడు. తనకున్న రెండువేల ఎకరాలకు పైగా భూమిని ప్రజలకు పంచిపెట్టాకే మిగిలిన భూస్వాములపైకి దండెత్తాడు. సాయుధ రైతాంగ పోరుకు సరికొత్త నడకలు నేర్పిన అసమాన సాహసమతడు..! ఎప్పుడైతే తను చదివిన న్యాయశాస్త్రంలో లేని న్యాయమూ సత్యమూ మార్క్సిజంలో ఉన్నాయని గ్రహించాడో అప్పటి నుంచీ ఆ సత్యానికే నిత్యం నిబద్ధుడై పరితపించాడు.
ఆయన సింగరేణిలో అడుగుపెట్టే నాటికి కోల్‌బెల్టుపై అన్యాయపు చీకట్లు కమ్మున్నాయి. నిజాం ఫ్యూడల్‌ దొరలను మించి బొగ్గుబాయి దొరల ఇష్టారాజ్యం నెలకొని ఉంది. ప్రభుత్వ అండదండలతో మాఫియా రాజ్యం సాగుతోంది. ఇరుకు మురికి వాడలలో కార్మికులకు మంచినీళ్లకు కరువున్నా సారా కొట్లకు మాత్రం కరువు లేకుండేది. నిజాం ప్రభువుల ఉదాసీనత, పోలీసుల అండదండలతో గూండాయిజం పెచ్చరిల్లి కార్మికుల బతుకులు నిత్యం భయభ్రాంతుల్లోనే..! స్త్రీల మాన, ప్రాణాలకు రక్షణలేదు. గూండాల అరాచకాలు, హత్యల గురించిన వార్త వినని రోజే ఉండేది కాదు. అదిగో అటువంటి చీకటిలోకి ఓ వేకువలా ప్రవేశించాడు రామనాధం. నైజాం సర్కార్‌ యూనియన్‌ల నిర్మాణంపై తీవ్ర నిర్బంధాలు కొనసాగిస్తున్న ఆ రోజుల్లో.. కామ్రేడ్‌ శేషగిరిరావుతో కలసి అత్యంత రహస్యంగా తన పని ప్రారంభించాడు. ఓ మేడే నాడు హేమచంద్రాపురం అడవుల్లో శేషగిరిరావుతో కలిసి అతిరహస్యంగా నిర్వహించిన సమావేశానికి.. నిఘానీడలను ఛేదించుకుని.. ఒకరికి తెలియకుండా ఒకరు రెండు వందల మంది కార్మికులు హజరయ్యారు. అక్కడే తొలి ”సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌” ఆవిర్భవించింది. సర్వదేవభట్ల రామనాథం అధ్యక్షుడిగా, డి.శేషగిరిరావు కార్యదర్శిగా అరుణపతాకమై రెపరెపలాడింది. 1942 ఫిబ్రవరిలో రహస్యంగా ఏర్పడిన ఈ యూనియన్‌ మోగించిన సైరన్‌ గోదావరీ అంచుల పోడవునా.. సింగరేణి గనుల్లో పెను ప్రకంపనలు సష్టించింది.
నగరాల్లో కార్మికోద్యమాన్ని నిర్మించాలన్న పార్టీ ఆదేశాల మేరకు చిర్రావూరితో కలిసి వరంగల్‌లో కార్మిక సంఘం నిర్మాణానికి పూనుకున్నారు. నిర్బంధం అంతకంతకూ తీవ్రరూపం దాల్చిన ఆ కాలంలో చిర్రావూరిని కలుసుకునేందుకు వెళ్తున్న రామనాథాన్ని ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టి, కాళ్లకు చేతులకు బేడీలు వేసి అరెస్ట్‌ చేసారు. ఆ తరువాత చిర్రావూరినీ అరెస్టు చేసి అదే జైలులో నిర్బంధించారు. అది వరంగల్‌ సెంట్రల్‌ జైలు.. మే ఒకటి.. తూరుపు తెలతెలవారుతుండగా ఓ బ్యారక్‌ తెరచుకుంది… ఎంత వేగంగా తెరుచుకుందో అంతే వేగంగా మూసుకుంది. ఆ రెప్పపాటు వ్యవధిలోనే జైలు నడిబొడ్డునుండి ఆకాశానికెగసిన అరుణపతాకం వరంగల్‌ నగర నలుదిక్కులనూ వెలిగించింది. నిమిషాల్లో పోలీస్‌ పటాలామంతా కదిలింది.. వారికితోడు అదనపు రిజర్వ్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగింది. స్టేట్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ దగ్గరకు అనుమానం ఉన్న ముగ్గురు ఖైదీలతో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా అన్ని బ్యారక్‌లపై ఎర్రజెండాలు ఎగిరాయి… మేడే వర్ధిల్లాలన్న నినాదాలతో జైలు దద్దరిల్లింది! ఆ పతాకావిష్కరణల సూత్రధారి సర్వదేవభట్ల రామనాథం.
పాలేరు పరిధిలోని చెన్నారం గ్రామంలో ఆంధ్రమహాసభ జరిగే సమయంలో ఆ ప్రాంతానికి తీవ్ర కరువొచ్చింది. జిల్లా కలెక్టర్‌కు శిస్తు మాఫీ చేయమని నాయకులు వినతిపత్రం అందించారు. రైతులెవరూ ఆంధ్రమహాసభకు వెళ్లకపోతే మాఫీ చేస్తామని, వెళితే కేసులు కూడా పెడతామని బెదిరించింది. అయినా రైతులు ఆగలేదు… ఎడ్లబండ్లకు ప్రభలు కట్టుకుని మరీ ఊరువాడా ఏకమై కదిలారు. ఆంధ్రమహాసభ విజయం అందించిన స్ఫూర్తితో శిస్తుల మాఫీకై రైతులు పెద్దయెత్తున రామనాథం నాయకత్వంలో పోరాటానికి దిగడంతో చివరికి ప్రభుత్వమే దిగివచ్చి శిస్తు మాఫీ చేయక తప్పలేదు.
అలా ఆయన జీవితమంతా ప్రజల కోసమే..! వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి శాసనసభ్యునిగా గెలుపొందినా, హన్మకొండ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి ఓడిపోయినా ప్రజలతో ఆయనది జయాపజయాలకు అతీతమైన బంధం. బతికినంత కాలం ప్రజలతో మమేకమైన బడుగు జన బాంధవుడాయన. తనకంటూ ఏమీ మిగుల్చుకో కుండా ఉన్నదంతా ప్రజలకే అర్పించి… ఎర్రెర్రని కీర్తి.
– అనంతోజు మోహన్‌ కృష్ణ, 9490099132

Spread the love