16న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంగ్రామ సభ

16 on contracting and outsourcing Employees' Sangrama Sabha– వాల్‌పోస్టరావిష్కరణలో ఫెడరేషన్‌ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను పెంచడంతో పాటు పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 16న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంగ్రామ సభను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేశ్‌ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లో సంగ్రామ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జె.వెంకటేశ్‌తో పాటు ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు జె. కృష్ణారెడ్డి, జె. కుమారస్వామి, మహేందర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ..లక్షా నలభై వేల మందికిపైగా ఉన్న ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్‌, ఎన్‌ఎంఆర్‌, డైలీవేజ్‌ తదితర సిబ్బందిని దశల వారీగా పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటిలోగా సమాన పనికి – సమాన వేతనం అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానాన్ని పక్కనపెట్టి ఔట్‌సోర్సింగ్‌ వ్యవస్థను శాశ్వతం చేసే దిశగా ముందుకెళ్తున్నారని విమర్శించారు. విజ్ఞాపనలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఈ ప్రభుత్వం దిగి రాదని తేలిపోయిందన్నారు. 16న జరిగే సంగ్రామ సభలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించి 33 జిల్లాల్లో 44 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. శాఖలు, హోదాలు, ఇతర అనుబంధాలకతీతంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సంఘటితంగా ప్రభుత్వంపై పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

Spread the love