ఆర్బీఐ నూతన గవర్నర్‌గా సంజరు మల్హోత్రా

Sanjaru Malhotra is the new Governor of RBI– నేడు శక్తికాంత దాస్‌ పదవీ విరమణ
న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా సంజరు మల్హోత్రా నియమితులయారు. ప్రస్తుతం ఆయన కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ప్రస్తుత గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పదవీ కాలం డిసెంబర్‌ 10తో ముగియనుంది. శక్తికాంత 2018లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2021లోనే ముగియగా మోడీ సర్కార్‌ మరో మూడేండ్లు పొడిగించింది. ప్రధాని మోడీకి అప్తమిత్రుడిగా గుర్తింపు పొందిన దాస్‌ పదవీకాలం నేటితో ముగియడంతో క్యాబినెట్‌ నియామకాల కమిటీ నూతన గవర్నర్‌గా మల్హోత్రాను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 1990 బ్యాచ్‌ రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన మల్హోత్రా ఆర్బీఐకి 26వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. డిసెంబర్‌ 11 నుంచి మూడేండ్ల పాటు ఆయన ఈ పదవీలో కొనసాగుతారు. ఐఐటీ కాన్పూర్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అమెరికా ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ పాలసీలో మాస్టర్స్‌ చేశారు. మైన్స్‌, పన్నులు, ఆర్థిక, విద్యుత్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా సర్వీసు అనుభవం కలిగి ఉన్నారు.

Spread the love