సంక్రాంతి స్పెష‌ల్ గా..

Sankranti special..ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగంటే అందరికీ ఇష్టమే. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో ఇళ్లన్నీ సందడిగా ఉంటాయి. ఇక గ్రామాల్లో అయితే వారం రోజుల ముందు నుంచే పిండి వంటలతో పండుగ మొదలవుతుంది. ఒకప్పుడు పది రకాల వంటలు చేసుకుంటే… ఇప్పుడు మూడు, నాలుగు వంటలతో సరిపెట్టుకుంటున్నారు. ఎందుకంటే గంటలు, రోజుల తరబడి పొయ్యి ముందు కూర్చునే తీరిక, ఓపిక ఎవ్వరికీ ఉండట్లేదు. అందుకే పిండి వంటల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. కానీ ప్రతి ఇంట్లో సంక్రాంతికి కచ్చితంగా చేసుకునే కొన్ని వంటలు ఉన్నాయి. అవేంటో చూద్దాం…
అరిసెలు
కావలసిన పదార్థాలు: బియ్యం – కిలో, బెల్లం తరుము – అరకిలో, నువ్వులు – వంద గ్రాములు, నీరు – తగినంత, యాలకులు: రెండు నుండి నాలుగు(మెత్తగా పొడిచేసుకోవాలి), నెయ్యి – అర కేజీ, నూనె – వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 24 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం చిల్లులగిన్నెలో వడవేసి పిండి పట్టించుకోవాలి. పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెద్దది పెట్టుకుని అందులో చిదిమిన బెల్లాన్ని వేసి కొద్దిగా నీరు పోసి పాకం పట్టుకోవాలి. (అరిసెలు గట్టిగా కావాలంటే ముదురుపాకం, మెత్తగా కావాలంటే లేతపాకం) పాకం రాగానే నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత బియ్యం పిండి ఒకరు వేస్తుంటే మరొకరు ఉండ చుట్టకుండా కలపాలి. ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉండేంతవరకూ పిండి పోసి కలపాలి. ఇలా పిండి పాకంతో తయారు చేసుకొన్న తర్వాత స్టౌపై ఫ్రైయింగ్‌ పాన్‌ పెట్టుకోవాలి. అందులో నూనె వేసి కాగనివ్వాలి. ఈలోపు పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లాస్టిక్‌ కవర్‌ మీద అరిసెలు వత్తుకొని కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. బంగారు వన్నె రాగానే వాటిని తీసి అరిసెల పీటపై (గరిటెలు కూడా ఉంటాయి) ఉంచి వత్తుకోవాలి. దీనివల్ల అరిసెల్లో అదనంగా ఉన్న నూనె పోతుంది. వీటిని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత భద్రపచుకోచ్చు. ఇవి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. అంతే నోరూరించే అరిసెలు రెడీ..!
కొబ్బరి బూరెలు
కావాల్సిన పదార్థాలు: బియ్యం – 1 కేజీ, పచ్చి కొబ్బరి ముక్కలు – ఒకటిన్నర నుంచి రెండు కప్పులు, బెల్లం – 600 గ్రాములు, యాలకుల పొడి – టీస్పూను, నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు, నూనె – డీప్‌ ఫ్రైకి తగినంత.
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి కనీసం 20 గంటలపాటు నానబెట్టుకోవాలి. అయితే, ఇలా బియ్యాన్ని నానబెట్టుకున్నప్పుడు మధ్యమధ్యలో నీరు మారుస్తుండాలి. లేదంటే బియ్యం వాసన వచ్చే అవకాశం ఉంటుంది.(రేషన్‌ బియ్యం అయితే బూరెలు మరింత రుచికరంగా, సాఫ్ట్‌గా వస్తాయి) ఆవిధంగా బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత నీళ్లు లేకుండా వడకట్టి ఫ్యాన్‌ కింద ఒక పొడి గుడ్డపై పలుచగా పరచి ఆరబెట్టుకోవాలి. మరీ, డ్రైగా ఆరబెట్టుకోకుండా చేతితో పట్టుకుంటే కాస్త తడి తగిలేవిధంగా ఉండాలి. తర్వాత మిక్సీ జార్‌లో ఆరబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మెత్తని పిండిలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఒక వెడల్పాటి ప్లేట్‌ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న పిండిని జల్లించుకొని చేతితో చక్కగా అదిమి పక్కనుంచాలి. ఇప్పుడు మరో మిక్సీ జార్‌ తీసుకొని అందులో సన్నగా కట్‌ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని తురుములా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకం కోసం స్టౌపై గిన్నె పెట్టుకొని బెల్లం, పావు లీటర్‌ నీరుపోసి మరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక మరో బౌల్‌లోకి దాన్ని వడకట్టుకోవాలి. అనంతరం వడకట్టుకున్న బెల్లం నీళ్ల గిన్నెను మళ్లీ స్టౌపై ఉంచి మీడియం ఫ్లేమ్‌ మీద పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. పాకం ఎలా రావాలంటే ఉండకట్టకూడదు, అలాగని లేతపాకం కాకుండా కాస్త ఉండకడుతున్నట్లు ఉండాలి. అయితే పాకం సరిగ్గా వచ్చిందని ఎలా తెలుసుకోవాలంటే ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా నీరు తీసుకొని అందులో గరిటెతో కొద్దిగా పాకాన్ని వేసుకుంటే అది మరీ ఉండకట్టకుండా చేతితో తీసుకుంటే కాస్త జారుడుగా ఉండాలి. ఆవిధంగా పాకం వచ్చాక మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌ మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలిపి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. అనంతరం అందులో నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. పాకంలో వేసిన కొబ్బరి ఉడికి, కాస్త చిక్కగా మారాక స్టౌ ఆఫ్‌ చేసుకొని దింపుకోవాలి. ఇప్పుడు ఆ పాకంలో ముందుగా మిక్సీ పట్టుకున్న తడి బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అయితే పిండి సాఫ్ట్‌గా, జారుతూ ఉండాలని గుర్తుంచుకోవాలి. ఆ విధంగా పిండిని సిద్ధం చేసుకున్నాక దానిపై కొద్దిగా నెయ్యి చల్లుకొని మూతపెట్టి 10 నిమిషాల పాటు చల్లార్చుకోండి. అంటే పిండి చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్‌ వేసి వేడి చేసుకోవాలి. అనంతరం చల్లారిన పిండిని కొద్దిగా తీసుకొని పాలిథిన్‌ కవర్‌ లేదా బటర్‌ పేపర్‌ మీద కాస్త నెయ్యిని అప్లై చేసి అరిసెల మాదిరిగా వత్తుకోవాలి. ఆపై నెమ్మదిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి. తర్వాత గరిటెతో బూరె మీదికి కొద్దిగా ఆయిల్‌ తోస్తుండాలి. అప్పుడు అది చక్కగా పొంగుతుంది. అలా పొంగిన తర్వాత మరో సైడ్‌కి తిప్పుకోవాలి. రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్‌ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి బూరెలు రెడీ!
అయితే ఆయిల్‌లో వేసుకునేటప్పుడు కొబ్బరి బూరెలు విరిగిపోతున్నాయి, పాకం సరిగ్గా రాలేదనుకుంటే ఈ టిప్‌ ఫాలో అవ్వండి. అదేంటంటే మీరు పిండి మిక్స్‌ చేసుకున్న గిన్నెను మళ్లీ స్టౌపై పెట్టి సన్నని సెగ మీద గరిటెతో కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడికించండి. అలా చేయడం వల్ల అందులో ఉండే తేమ అంతా పోయి పాకం కాస్త గట్టిపడుతుంది. ఆ తర్వాత పైన చెప్పిన విధంగా బూరెలు చేసుకుంటే సరిపోతుంది.
నువ్వుల లడ్డు
కావల్సిన పదార్థాలు: బెల్లం తురుము – ఒక కప్పు, నువ్వులు – ఒక కప్పు.
తయారు చేసే విధానం: నువ్వులను ఇసుక లేకుండా శుభ్రంగా జల్లెడ పట్టి, స్టవ్‌పై దోరగా వేగించాలి. ఒక పెద్ద గిన్నెలో బెల్లం తురుము, సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. తీగ పాకం వచ్చాక నువ్వులను అందులో వేసి కలపాలి. తర్వాత చేతులను తడుపుకుంటూ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని ఉండలు కట్టాలి. ఈ నువ్వుల లడ్డూలను రెండు గంటల పాటు ఆరబెట్టాలి. ఆపైన గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలా రోజులు తాజాగా ఉంటాయి.
సకినాలు
కావల్సిన పదార్థాలు: బియ్యం – రెండు కప్పులు, నువ్వులు – పావు కప్పు, వాము – రెండు టీ స్పూన్లు, నూనె – సరిపడా, ఉప్పు – తగినంత.
తయారు చేసే విధానం: బియ్యాని బాగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత ఆ బియ్యాన్ని మిక్సీ లేదా గ్రైండర్‌లో రుబ్బాలి. ఆ టైమ్‌లో కొన్ని నీళ్లు చిలకరించాలి. అయితే పిండి మరీ గట్టిగా, మరీ పలుచగా లేకుండా చూడాలి. తర్వాత ఒక మెత్తటి గుడ్డను పరిచి, పిండితో గుండ్రంగా మెలితిప్పుతూ మూడు, నాలుగు చుట్లు చుట్టాలి. వాటి తడి పూర్తిగా ఆరాక నూనెలో వేగించాలి.
ముగ్గులు మరింత అందంగా….
పండగ వేళ ముగ్గులతో అందరూ ఇంటి ముందు అలకరిస్తుంటారు. సులభంగా ముగ్గులు వేసి కూడా వాటిని ఎంతో అందంగా చేయొచ్చు… అవేంటో ఓసారి చూద్దాం…
– ముందుగా ముగ్గులు వేసాక..ఆకర్షణీయమైన రంగులను ఉపయోగిం చండి. నీలం, పసుపు, ఎరుపు రంగులు ముగ్గుల్ని మరింత అందంగా చేస్తాయి.
– ముగ్గుల్లో చిన్న దీపాలు, పువ్వులు, కుంకుమ లాంటివి పెట్టడం వల్ల వాటి అందం పెరుగుతుంది.
– పువ్వుల రెక్కలతో ముగ్గుని డెకరేట్‌ చేస్తే అవి ఎంతో అందంగా ఉంటాయి.
– లేదంటే పెద్ద పెద్ద బంతి పువ్వులు, చామంతి పువ్వులు పెట్టినా అందంగా కనిపిస్తాయి.
– ముఖ్యంగా పసుపు లేదా ఆరంజ్‌ బంతి పువ్వు లు ఉపయో గించి.. అంద మైన ముగ్గుగా తయారు చేసుకోవచ్చు. లేదంటే ఏదై నా చాలా సులభంగా ఉండే ముగ్గు వేసి.. దాని చుట్టూ దీపాలు, రోజా పువ్వులు పెట్టినా ఎంతో అందంగా ఉంటాయి.

Spread the love