– మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ప్రాజెక్ట్ కార్యాలయాలపై విజిలెన్స్ దాడులు
– ఏక కాలంలో10 బృందాల సోదాలు
– ఈఎన్‌సీ మురళీధర్ ఆఫీసులో తనిఖీలు
– విలువైన ఫైళ్లు, ఇతర పత్రాలు స్వాధీనం
– మేడిగడ్డపై విచారణకు సిట్టింగ్ జడ్డిని కేటాయించండి : సీజేకు మంత్రి ఉత్తమ్ లేఖ
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రూ. లక్ష కోట్లు వెచ్చించి లక్ష ఎకరాలకు కూడా సాగు నీరందంచలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు సైతం ఎన్నికల ముందు విమర్శలు గుప్పించిన విషయం విదితమే. తాము అధికారంలోకి వస్తే విచారణ జరిపించి అవినీతి సొమ్ము కక్కిస్తామని పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారం చేపట్టిన వెంటనే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో డిసెంబర్ 29న మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించారు. జ్యూడిషియల్ విచారణతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తామని ప్రకటించారు. ఆ క్రమంలోనే మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఏక కాలంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు జరిగాయి.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రజేసింది. మేడిగడ్డనుంచి మొదలుకుని హైదరాబాద్‌లోని ఆ ప్రాజెక్ట్ కార్యాలయాలపై మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన 10 బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ జలసౌధలోని కాళేశ్వరం కార్పొరేషన్ ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఎమ్‌డీ హరిరాం, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) మురళీధర్, రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఓఅండ్ ఈఎన్‌సీ నాగేందర్ రావు కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు దాడులు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపు హౌస్‌ల రికార్డులను వారు తీసుకెళ్లారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు, ప్రాజెక్టు కు నీట్ లభ్యతపై హైడ్రాలజీ రిపోర్టులు, వర్క్ ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపు సహా అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జలసౌధలో ఆరవ ఫ్లోర్‌లో ఉన్న సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ ఆఫీస్ నుంచి పలు ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కరీంనగర్ ఎల్‌ఎండీలోని ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి నేతృత్వంలో ఇద్దరు సీఐల బృందం తనిఖీలు నిర్వహించింది. తాళం వేసి ఉన్న కార్యాలయాన్ని తెరిపించి అందులోని రికార్డులను పరిశీలించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో అధికారుల బృందం మహదేవ్ పూర్ సాగునీటి కార్యాలయంలో సెంట్రల్ డిజైన్, ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలల్లో సైతం దాడులు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకుంది. నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం, డిజైన్‌కు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టక పోవడం, ప్రాజెక్ట్ తీసుకున్న రుణాల దుబారాపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించినట్టు సమాచారం.
సిట్టింగ్ జడ్జితో విచారణకు ఉత్తమ్ లేఖ
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంపై సిట్టింగ్ న్యాయమూర్తితో జ్యూడిషియల్ విచారణ జరుపుతామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ క్యాబినెట్ సమావేశంలో చేసిన తీర్మానం మేరకు సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామని తెలిపారు. అక్కడి నుంచి అనుమతి రాగానే విచారణ ప్రారంభమవుతుంని పేర్కొన్నారు.