సారొస్తారొస్తారూ..!

సారొస్తారొస్తారూ..!– కేసీఆర్‌ రాకకు డిసెంబర్‌లో ముహూర్తం
– రేవంత్‌ దూకుడుకు హైడ్రా బ్రేక్‌?
– ధృతరాష్ట్ర కౌగిలిలో కమలనాధులు
– తరుముకొస్తున్న స్థానిక ఎన్నికలు
– సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్న క్షేత్రస్థాయి నేతలు
ఎవరు అవునన్నా…కాదన్నా…రాష్ట్ర రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌)లేని లోటు స్పష్టంగానే కనిపిస్తున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక బొక్కబోర్లాపడిన బీఆర్‌ఎస్‌ పార్టీని పునరుత్తేజం చేయాల్సిన ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం రకరకాల రాజకీయ ఊహాగానాలకు తావిస్తుంది.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేసీఆర్‌ స్థానాన్ని భర్తీ చేయాలని ఆయన కుమారుడు, మాజీ మంత్రికే తారకరామారావు (కేటీఆర్‌) తాపత్రయపడుతున్నారనేది జగద్విదితమే! దానికోసం ఆయన నానా అవస్థలు పడుతున్నారు. ఆయనకు తోడు మరో మాజీ మంత్రి టీ హరీశ్‌రావు కూడా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బీఆర్‌ఎస్‌ పక్షాన వీరిద్దరే ప్రస్తుత రాజకీయ యవనికపైన నిత్యం కనిపిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత రాజకీయాల్లో కేసీఆర్‌ సమకాలీకులు ఎవరూ ప్రధానపార్టీల్లో లేరు. దీనితో ఆయన తనకన్నా వయసులో, అనుభవంలో చిన్నవాళ్లయిన ఇతరపార్టీల నేతలతో విమర్శలు, నిందలు పడాల్సి వస్తున్నది. దీన్ని భరించలేకే కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు ముఖం చాటేస్తున్నారని చెప్తున్నారు. కానీ బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం అధికార కాంగ్రెస్‌పార్టీకి ఓ ఏడాది గడువు ఇచ్చాక, పరిపాలన చూసి, అప్పుడు తమ అగ్రనేత జనంలోకి వస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 7వ తేదీతో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఏ రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాదికాలంలో ప్రభుత్వ వైఫల్యాలను జనంలో ఎండగట్టేందుకు డిసెంబర్‌ 8 నుంచి 15వ తేదీ లోపు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం నాలుగు అతిపెద్ద బహిరంగసభల్ని ఏర్పాటు చేసి, కేసీఆర్‌ ‘గర్జన’ను వినిపించాలని బీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. ఫాంహౌస్‌లో తనను కలిసిన నేతలతో కేసీఆర్‌ కూడా ఇదే తరహా సిగల్స్‌ ఇస్తున్నట్టు సమాచారం.
అయితే కాంగ్రెస్‌ శ్రేణులు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. కేసీఆర్‌ శకం ముగిసినట్టే అని ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌పై మరింత పట్టు సాధించేందుకు మాజీ మంత్రి కేటీఆర్‌ అష్టకష్టాలు పడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఆపార్టీకి పెద్ద దిక్కులుగా కేటీఆర్‌, హరీశ్‌రావు మాత్రమే మిగిలి ఉన్నారనీ, కేసీఆర్‌ కేవలం ఉత్సవ విగ్రహమేనని విమర్శలు చేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు, మంత్రులైతే అసలు కేసీఆర్‌ బతికే ఉన్నారా…అని లేని సందేహాలను ప్రజలకు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం చేపట్టిన పనులకు సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. తమ లక్ష్యాన్ని సమర్ధించుకొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఈ విషయంలో మాత్రం ప్రజలు ఆయన్ని విశ్వసించే పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు. రైతు రుణమాఫీలోనూ కాంగ్రెస్‌ సర్కారుకు అనేక చిక్కుముడులు పడుతూనే ఉన్నాయి. క్రమంగా ఆపార్టీపై, రేవంత్‌రెడ్డి నాయకత్వంపై ప్రతిపక్షాలు దాడిని పెంచాయి. రైతు రుణమాఫీ కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం ఇప్పుడు కొద్దిగా వెనుకంజ వేస్తున్నట్టు కనిపిస్తున్నది.
అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం కచ్చితంగా అక్టోబర్‌ చివరి వారం లేదా నవంబర్‌ రెండో వారంలోపు స్థానిక ఎన్నికల్ని నిర్వహించకతప్పదని తేల్చిచెప్తున్నది. ఆ మేరకు ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రాజకీయపార్టీల నేతలతోనూ సమావేశాలు నిర్వహించింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కూడా ఎన్నికల సంఘం స్పష్టమైన వైఖరినే ప్రకటించింది. రిజర్వేషన్ల ఖరారు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదనీ, ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేలోపు ఆ జాబితా ఇస్తే, అమలు చేస్తామనీ, లేకుంటే పాతపద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించేస్తామని తేల్చిచెప్పింది. దీనితో స్థానిక సమరం దాదాపు ఖాయంగానే కనిపిస్తున్నది.
ఈ దశలో బీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసుకోవడంపై దృష్టిసారించింది. ఆపార్టీ ప్రజాందోళనల్ని తాజాగా జిల్లాలకు విస్తరింపచేసింది. ఈ రేస్‌లో తామెక్కడ వెనుకబడి పోతామో అని భావిస్తున్న బీజేపీలో నేతల మధ్య అనైక్యత, ఆధిపత్యధోరణి పార్టీ శ్రేణులకు తలనొప్పిగా మారింది. చివరకు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి ‘పార్టీలో నా మాటే ఫైనల్‌’ అని పత్రికాముఖంగా చెప్పుకొనే స్థితికి దిగజారింది. పార్టీలో పెద్ద తలలుగా ఉన్న డాక్టర్‌ కే లక్ష్మణ్‌ ప్రస్తుతం ‘టచ్‌ మీ నాట్‌’ అనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వట్లేదనీ, పార్టీ ఆఫీసులో మాట్లాడాలంటే, అనుమతి తీసుకోవాలని చెప్తున్నారని వాపోతున్నారు. దీనితో ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోని బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. మరో కేంద్రమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజరు తన దూకుడు మాత్రం తగ్గించట్లేదు. జనంలోకి హిందుత్వ అజెండాను చొప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంత దూకుడు వద్దని పార్టీ అధినేత జీ కిషన్‌రెడ్డి చెప్తున్నా…’డోంట్‌ కేర్‌’ అంటూ నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక మరో ఎమ్మెల్యే రాజాసింగ్‌…తాను పార్టీలో సీనియర్‌ అయినా పట్టించుకోవట్లేదని వేరు కుంపటి పెట్టుకొని, తనగోల తాను పడుతున్నాడు. దీంతో పార్టీని ఏకతాటిపైకి తేవడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి తలనొప్పిగా మారింది.
ఇక వామపక్షాలు మాత్రం ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా ప్రజాసమస్యలపై కలిసొచ్చే అంశాల్లో ఐక్య ఉద్యమాలు చేపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సీపీఐ(ఎం) భూపోరాటాలను ఉధృతం చేసింది. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపిస్తున్నది. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న బీఆర్‌ఎస్‌, ఊహించని విధంగా 8 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ రాష్ట్రంలో రెండోస్థానంలో నిలవడం కోసం అష్టకష్టాలు పడుతున్నాయి. దీనికి స్థానిక ఎన్నికలు కొలమానంగా నిలిచి, ప్రజాభిప్రాయాన్ని వెల్లడించనున్నాయి.

Spread the love