నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మీడియా ముందుకొచ్చిన ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య మరోసారి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. సదరు వేధింపులకు సంబంధించి ఆడియో రికార్డులు ఇవ్వాలంటూ అనుచరులతో ఎమ్మెల్యే తనపై తీవ్ర ఒత్తిడి చేయిస్తున్నారని నవ్య తాజాగా ఆరోపించారు. ఫోన్‌లో రికార్డు చేసిన వేధింపుల తాలూకు సంభాషణలు తాను బయటపెడతానేమోననే భయంతోనే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చిలో ఇద్దరి మధ్య రాజీ కుదిరిన సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం ఇస్తానన్న రూ.25 లక్షలు కూడా ఇవ్వలేదన్నారు. పైగా ఆ మొత్తాన్ని తాను అప్పుగా తీసుకున్నట్లుగా, రాజకీయ లబ్దికే రాజయ్యపై ఆరోపణలు చేశానంటూ పత్రంపై సంతకం పెట్టాలని తనపై తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గం ఒత్తిడికి తన భర్త తలొగ్గారని, సంతకం పెట్టాలంటూ తనపై ఆయనా ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ప్రవీణ్‌ను డబ్బులతో మాయ చేశారని, అప్పట్లో తనను ట్రాప్ చేయాలని చూసిన ఓ మహిళ తన భర్తను వలలో వేసుకొని ఒత్తిడి తీసుకొస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్యకు సంబందించిన ఆడియో రికార్డులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని, డబ్బు అప్పుగా తీసుకున్నట్లుగా పత్రంపై సంతకం చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే ఆడియో రికార్డులను మీడియాకు విడుదల చేస్తానని చెప్పారు. దీనిపై ఇప్పటికే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయితే వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.