– మిషన్ భగీరథ పథకంతో తాగునీటి లక్ష్యం పూర్తి
– ప్రతి పల్లెలో ఇంటింటికి జల సిరి…
– హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
సమైక్య పాలనలో ఎండాకాలం వచ్చిందంటే ‘పానీ’పాట్లతో అల్లాడి పోయిన ప్రజలు తాగునీటి కోసం సతమతమైన పరిస్థితి ఉండేదని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీటిని అందించి తాగు నీటి కష్టాలు లేకుండా చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్ ఎల్ఎండి కాలనీ తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ మంచి నీళ్ల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి నల్లాల ద్వారా పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. ప్రతి పల్లె, తండా, గ్రామం, పట్టణం, మారుమూలన ఉన్న ప్రాంతాలకు కూడా పైపులైన్లు వేసి తాగునీరు అందించే లక్ష్యన్ని మిషన్ భగీరథ పథకం నూటికి నూరుశాతం లక్ష్యాన్ని సాధించిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 304 గ్రామాలలోని 456 ట్యాంకులకు 321.64 కీ. మీ అంతర్గత పైపులైన్ల ద్వారా 22,492 నల్లా కనెక్షన్ ల ద్వారా మిషన్ భగీరథ నీళ్లలను అందించడం జరుగుతుందని తెలిపారు. తెలగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “మిషన్ భగీరథ” పథకాన్ని కేంద్ర ప్రభుత్వం “హర్ ఘర్ జల్” పథకం పేరుతో అమలు చేస్తుండటం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఎల్ఎండి కాలనీలో ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం 1800 కోట్లతో నిర్మాణం అయి 125 MLD నీటి శుద్ధి కేంద్రంలో శుద్ధి చేసి 1610.95 కి. మీ పైపుల ద్వారా మంచి నీరు అందించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణ రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ప్రజాప్రతినిధులు, నాయకులు, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.