మాస్కో : చమురు ఉత్పత్తిలోను, ఎగుమతుల్లోను ఈ సంవత్సరం చివరిదాకా స్వచ్ఛందంగా విధించుకున్న కోతలను కొనసాగిస్తామని సౌదీ అరేబియా, రష్యా ప్రకటించాయి. చమురు ఉత్పత్తిదారుల ఒపెక్ ప్లస్ గ్రూపులో ప్రధాన చమురు ఉత్పత్తిదారులైన ఈ దేశాలు వేరువేరు ప్రకటనలు చేశాయి. ఒపెక్ ప్లస్ గ్రూపుకు చెందిన మినిస్టీరియల్ మానిటరింగ్ ప్యానల్ ఆన్‌లైన్‌లో సమావేశమవటానికి ముందు ఈ ప్రకటనలు వెలువడ్డాయి.
సౌదీ అరేబియా తాను చేస్తున్న ఉత్పత్తిలో రోజుకు 10లక్షల బారెల్స్ ముడి చమురును తగ్గించుకుంటుందని ప్రకటించింది. నవంబర్, డిసెంబర్‌లో రోజుకు దాదాపు 90లక్షల బ్యారెల్స్ ముడిచమురును ఉత్పత్తి చేసినట్టు సౌదీ అరేబియా ఎనర్జీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉత్పత్తి చేసే క్రమంలో రోజుకు 10లక్షల బ్యారెల్స్ ముడిచమురు కోత అమలయ్యేలా చేస్తామని సదరు సౌదీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే సంవత్సరం చివరిదాకా రోజుకు 3లక్షల బ్యారెల్స్ ముడి చమురును తన ఎగుమతుల్లో కోతను విధిస్తామని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ ప్రకటించాడు. మార్కెట్ ను విశ్లేషిస్తూ పైన వివరించినట్టు ముడి చమురు ఎగుమతులలో కోతను అమలు చేస్తామని ఆయన చెప్పాడు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రకటించినట్లు రష్యా తన చమురు ఎగుమతిలో 5శాతం అంటే రోజుకు 5లక్షల బ్యారెల్స్ ముడిచమురును తగ్గించుకుంటుంది. ఈ తగ్గింపు మార్చి నుంచి సంవత్సరాంతంవరకూ కొనసాగుతుందని నొవాక్ వివరించాడు.
పెట్రోలియం ఎగుమతి చేస్తున్న దేశాల సంస్థ(ఒపెక్), రష్యాతోసహా దాని మిత్రదేశాలు తమ చమురు ఉత్పత్తిని ప్రపంచ డిమాండ్‌లో 2శాతాన్ని గత నవంబర్ నుంచి 2023వ సంవత్సరాంతం దాకా తగ్గించుకోవటానికి అంగీకరించాయి. ఆ తరువాత ఈ గ్రూపు తన కోతలను 2024దాకా కొనసాగించటానికి అంగీకరించింది. జులై నెలలో సౌదీ అరేబియా, రష్యా తమ చమురు సరఫరాలో కోతలను విధిస్తున్నట్టు ప్రకటించిన తరువాత ప్రపంచ మార్కెట్ లో చమురు ధర బ్యారెల్ కు 76డాలర్ల నుంచి వర్తమానంలో 89డాలర్లకు పెరిగింది.