– చిప్కో తరహాలో ఉద్యమం
– రాడార్ కేంద్రంతో మూసీ నది మనుగడకు ప్రమాదం
– అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని ఒప్పుకోం
– సహజసిద్ధ అడవులను నరకడం వల్లనే ప్రకృతి విలయాలు : నిరసన కార్యక్రమంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గతంలో కేవలం 300 చెట్ల నరికివేతకు నిరసనగా సుందర్‌లాల్ బహుగుణ చిప్కో ఉద్యమాన్ని నిర్వహించి విజయం సాధించారనీ, దాని తరహాలో ‘సేవ్ దామగుండం’ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సహజసిద్ధంగా ఏర్పడిన అడవిలో 12 లక్షల చెట్లను నరికివేస్తే అక్కడ నేలలు పటుత్వం కోల్పోయి ప్రకృతి విపత్తులు తలెత్తి హైదరాబాద్ మహానగరానికి అపార నష్టం కలిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద సేవ్ దామగుండం పేరుతో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ… దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నిస్తే రాజద్రోహులు, దైవ ద్రోహులు, అర్బన్ నక్సలైట్లు అనే ముద్ర వేయడం పరిపాటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఇద్దరు స్వామీజీలు పాలుపంచుకుంటుండటం వల్ల తనను నిందించే వారికి అవకాశం లేకుండా పోయిందన్నారు. పశ్చిమ కనుమల్లో అభివృద్ధి పేరిట జరిగిన ప్రకృతి విధ్వంసం వల్లనే వాయనాడ్ విపత్తు ముంచుకొచ్చిందని చెప్పారు. నావీ వాళ్లు 12 లక్షల మొక్కలను నాటుతామని చెప్పడం కాదు.. ఇప్పుడున్న అడవిలా మరో అడవిని సృష్టించిన తర్వాత రాడార్ కేంద్రం పెట్టుకుంటే అభ్యంతరం లేదన్నారు. పాలకులు చెబుతున్నట్టు రాడార్ కేంద్రంతో ఎలాంటి నష్టం లేకపోతే ప్రజలకున్న అనుమానాలను ఎందుకు నివృత్తి చేయడం లేదు? పర్యావరణ నష్ట రిపోర్టును ఎందుకు బహిరంగపర్చట్లేదు? గండిపేట చెరువులోకి నీళ్లు ఎలా వస్తాయి? అంత పెద్ద స్థాయిలో కృత్రిమ అడవిని నిర్మించడం ఎలా సాధ్యం? అని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. మూసీ నదికి మూలమైన ఈసీ, కాగ్నా నదుల పుట్టుకకు కారణమైన వికారాబాద్ అడవులనే నరికివేస్తే మూసీ నది పరివాహక అభివృద్ధి ఎలా సాధ్యమని నిలదీశారు. జర్నలిస్టు తులసీ చంద్ మాట్లాడుతూ.. చిప్కో తరహాలో పర్యావరణ ప్రేమికులంతా దామగుండం తరలి చెట్ల నరికివేతను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అడవి చుట్టూ మానవహారం నిర్వహిస్తామన్నారు. 2900 ఎకరాలను రాడార్ కేంద్రం కోసం కేటాయించారనీ, అందులో 1400 ఎకరాల్లో టవర్ పార్కును నిర్వహించబోతున్నారని తెలిపారు. దీని వల్ల 60 వేల మంది జీవనోపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పశువుల కాపరులు అడవిలో మేపడం వల్లనే అడవులు ధ్వంసం అవుతున్నాయనీ, టవర్లు వేస్తే వచ్చే నష్టం ఏంటని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అనటాన్ని తప్పుబట్టారు. సత్యానందస్వామిజీ మాట్లాడుతూ.. 2,713 ఎకరాల రామలింగేశ్వర స్వామి దేవాలయ భూమిని నిబంధనలకు విరుద్ధంగా అటవీశాఖకు ఎలా బదిలీ చేశారు? దేవాలయాల భూములను ఇతర అవసరాల కోసం వాడొద్దన్న సుప్రీం కోర్టు తీర్పును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దామగుండం అడవిని రక్షించాలని కిషన్‌రెడ్డినీ, బీజేపీ ఎంపీలను కలిసినా, ప్రధానికి లేఖలు రాసినా పట్టించుకున్న పాపాన పోలేదనీ, హిందూత్వ పేరుతో ఓట్లు అడగడం తప్ప వారికి ప్రజల బాధలు పట్టవని విమర్శించారు. ఒక నెమలికి గింజలు వేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చే ప్రధాని మోడీకి ఇక్కడ అడవి నరికివేతతో వేలాది నెమళ్లు చనిపోతాయనే సోయి లేదా? అని ప్రశ్నించారు. జలసాధన సమితి పౌండర్ దుశ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. మేకలు, బర్రెలు, గొర్రెలు అడవుల్లో మేయకుంటే కార్పొరేట్ ఆఫీసులకెళ్లి మేస్తాయా? అని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఏమి చేసినా చెల్లుతుందనేది పాలకుల అవివేకమనీ, గొప్పోళ్లయిన ప్రజలు వారికి తప్పకుండా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జేఏసీ నాయకులు గీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు వి.సంధ్య, అరుణోదయ నాయకులు విమలక్క, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, పూడూరు మాజీ సర్పంచి లక్ష్మయ్య తదితరులు సేవ్ దామగుండం పోరాటానికి మద్దతు తెలిపి మాట్లాడారు.