సుందరవనం అనే అడవికి పెద్దపులి రాజుగా ఉండేది. దానికి కుబుద్ధి అనే నక్క మంత్రిగా ఉండేది. ఒకసారి పెద్దపులి బిడ్డ తనకు అడవిలో ఒంటెపై తిరగాలని ఉందని చెప్పింది. వెంటనే ఆ పులిరాజు కాకితో ఒంటెను రమ్మని కబురు పంపింది.
ఆ ఒంటె వచ్చిన తర్వాత పులిరాజు తన బిడ్డను పైన ఎక్కించుకొని అడవి అంతా తిప్పమని అది ఆదేశించింది. అందుకు ఒంటె సరేనంది. దాని వెంబడి నక్కని వెళ్ళమంది. నక్క సంతోషంతో ఎలాగైనా ఈ ఒంటెను ఏదో తప్పు పెట్టి పులిరాజు చేత చంపించాలనీ, పులి తినగా దాని మాంసం తాను తినాలని ఎత్తు వేసింది. ఒంటె ఆ పులిపిల్లను తన పైన ఎక్కించుకొని నక్క వెంబడి రాగా బయలుదేరింది . కానీ దారిలో అది ఒక బండరాయి కాలికి తగిలి బొక్క బోర్లా పడింది. దాని కాలుకు గాయం అయింది. ఆ పులిపిల్లకు కూడా చిన్న పాటి గాయం అయింది. వెంటనే నక్క ఒంటెపై కోపించి కొన్ని జంతువుల సాయంతో ఆ పులిపిల్లను పెద్దపులి వద్దకు తీసుకొని వెళ్ళింది. తర్వాత ఆ ఒంటెపై చిలువలు పలువలుగా చాడీలు చెప్పింది.
ఆ చెప్పుడు మాటలు నమ్మిన పులి కోపంతో కాకిని పిలిచి ఆ ఒంటెను రమ్మని కబురు పంపింది. ఆ సమయంలో ఆ ఒంటె తన కాలుకు తగిలిన గాయాన్ని వైద్యం చేసే ఎలుగుబంటికి చూపించుకొని తన ఇంట్లో విశ్రాంతి తీసుకొంటున్నది. అక్కడ ఒక కుందేలు కూడా ఉంది. ఆ కాకి దాని వద్దకు వెళ్లి ఆ ఒంటెను పులిరాజు రమ్మంటున్నదని చెప్పింది. ఆ ఒంటె తాను రాలేననీ, గాయం మానిన తర్వాత వస్తానని వినయంగా అంది. కాకి వెళ్లిపోయింది. ఒంటె పులి రాజుకు భయపడి తన భయాన్ని అక్కడే ఉన్న కుందేలుకు చెప్పింది. కుందేలు దానికి అభయం ఇచ్చి వెంటనే అది పులి రాజు వద్దకు వెళ్లింది.
అది పులితో ”పులిరాజా! ఒంటె కాలుకు తీవ్ర గాయం అయింది. అది కదల లేని స్థితిలో ఉంది. ఒంటెను మీరు ఎందుకు రమ్మన్నారు ”అని అడిగింది. అప్పుడు పెద్దపులి ”నా బిడ్డను అది క్రింద ఎత్తివేసి గాయాల పాలు చేసింది. ఒక యువరాజును జాగ్రత్తగా తీసుకొని పోకుండా ఎవరైనా క్రింద పడవేస్తారా! నీవే చెప్పు! కావాలని అది నా బిడ్డను క్రింద పడగొట్టి గాయాల పాలు చేసింది” అని అంది.
అప్పుడు కుందేలు ”పులిరాజా! మన యువరాజును కావాలని ఆ ఒంటె క్రింద పడగొట్టితే దానికి పెద్ద గాయం ఎలా అవుతుందో మీరే సెలవెయ్యాలి. అంతేకాదు. ఈ అడవి దారి అంతా రాళ్ళమయంగా ఉంది. అది ఎవరి తప్పో మీరే చెప్పండి. జంతువులు నడవడానికి వీల్లేకుండా దారిలో రాళ్లు రప్పల తో పాటు ముండ్లకంపలు పడి ఉన్నాయి. వాటిని తొలగించాల్సిన బాధ్యత మంత్రి నక్కది కాదా! మన యువరాజు క్రిందపడిందంటే దానికి కారణం ఒంటె కానే కాదు. మీ మంత్రి నక్క కుబుద్ధియే దానికి బాధ్యత వహించవలసి ఉంటుంది . ఈ దారి చక్కగా ఉంటే ఆ ఒంటె, మన యువరాజు క్రింద పడేవి కావుగా! ఈ నక్క ఒంటెపై తప్పు పెట్టాలని ఇలాంటి పని చేసింది. మీరు ఒంటెను చంపాలనీ, తర్వాత దాని మాంసాన్ని తాను తినాలని ఆ నక్క ఎత్తు వేసి మీకు దానిపైన లేనిపోని చాడీలు చెప్పింది. ఇందులో ఒంటె తప్పులేనే లేదు ”అని అంది .
అప్పుడే అక్కడికి వచ్చి ఈ మాటలు విన్న యువరాజు పులి ”అవును పులి రాజా! అది నాతోని కూడా ఒంటె మాంసం తినాలని తనకు కోరికగా ఉన్నట్లు చెప్పింది ”అని అంది. వెంటనే కుందేలు ”చూశారా మహారాజా ! మీ బిడ్డ అబద్ధం చెప్పదుగా ! ఆ నక్క కుట్రలో భాగమే ఇది. అందువల్ల ఆ నక్క చెప్పుడు మాటలు విని మీరు మోసపోకండి” అని అంది. పులి రాజు సరేనని ఆ ఒంటె ప్రాణాలకు భయం లేదని కుందేలుకు హామీ ఇచ్చింది.
అప్పుడే అక్కడికి వచ్చిన నక్కని చూసి ఆ పులి కోపంతో ”ఓ నక్కా! ఈ అడవి దారి బాగు చేయాలని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నాకు అపకీర్తి తేవాలని నీవు దారి బాగు చేయించక ఈ ఒంటెపై లేనిపోని అభాండాలు వేస్తావా! దానిపై లేనిపోని అబద్ధాలు చెబుతావా! నీ చెప్పుడు మాటలు నమ్మడానికి నేను మూర్ఖుడను కాదు. చూడు నిన్నేం చేస్తానో!” అని అంది. పులి కోపాన్ని పసిగట్టిన నక్క వెంటనే అక్కడి నుండి మరో అడవికి పారిపోయింది . పులి వెంటనే కుందేలును తన మంత్రిగా నియమించుకొని మొదటగా అడవి దారంతా బాగు చేయించింది. కుందేలు మంత్రి కావడం చూసి ఎలుగు ఒంటెలతో పాటు జంతువులన్నీ సంతోషం వ్యక్తం చేశాయి. ఒంటె తన ప్రాణాలు కాపాడినందుకు కుందేలుకు ధన్యవాదాలు తెలిపింది.
– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య,
9908554535