– మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ వర్గీకరణ వల్ల ఏ కులానికి అన్యాయం జరగదని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వర్గీకరణ అమలు ద్వారా మాదిగ, దాని అనుబంధ కులాల్లో విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు పెరుగుతాయన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన ఎస్సీ వర్గీకరణపై మాదిగ, మాదిగ అనుబంధ కులాల శాసన సభ్యులు, సంఘాల ముఖ్యనాయకులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలుకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. మాదిగ సమాజం తరుపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. అణగారిన కులాల్లో అసమానతలు రూపుమాపటానికే ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో శాసనసభ్యులు వేముల వీరేశం, తోట లక్ష్మీ కాంతారావు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, చంద్రశేఖర్, మాజీ పార్లమెంట్ సభ్యులు పసునూరు దయాకర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, ప్రొఫెసర్ మల్లేశం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముంజగల విజరు కుమార్, మాదిగ ఉపకులాల ఐక్యవేదిక చైర్మెన్ మేడి పాపయ్య, ప్రజా సంఘాల జేఏసీ నేత గజ్జలకాంతం, ప్రజా గాయకులు ఏపూరి సోమన్న, కృపాకర్ మాదిగ, మేరీ మాదిగ, తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జేఏసీ చైర్మెన్ చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు గోపి, బుల్లెట్ రాజు తదితర ముఖ్య నాయకులతో పాటు రాష్ట్రంలోని మాదిగ, మాదిగ అనుబంధ కులాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.