హైదరాబాద్ లో చిన్నారులను వేధిస్తున్న స్కార్లెట్‌ జ్వరం

నవతెలంగాణ హైదరాబాద్‌: నగరంలోని చిన్న పిల్లల ఆసుపత్రులకు స్కార్లెట్‌ జ్వర బాధితుల తాకిడి పెరుగుతోంది. ఒక వైపు పిల్లలకు పరీక్షలు ప్రారంభమైన సమయంలో ఈ వ్యాధి ఇబ్బంది పెడుతోంది. ఆస్పుత్రులకు వస్తోన్న 20 మంది జ్వర బాధితుల్లో 10-12 మందిలో ఈ స్కార్లెట్‌ లక్షణాలు కన్పిస్తున్నాయి. కొందరిలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఈ వ్యాధి ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో మళ్లీ పెరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న చిన్నారుల్లో ఈ జ్వర లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. కొన్నిసార్లు వైరల్‌ లక్షణాలుగా భావించినా చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే…ఆసుపత్రిలో చేరేవరకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 5-15 ఏండ్లలోపు పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కన్పిస్తే…ముందే వైద్యులను సంప్రదించాలి.


లక్షణాలు కన్పించిన వెంటనే చికిత్స అందించాలని వైద్యులు సూచిస్తున్నారు. స్కార్లెట్‌ జ్వరమనేది స్ట్రెప్టోకోకల్‌ ఫారింగైటిస్‌ బ్యాక్టీరియా కారణంగా సోకుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపర్లు ద్వారా పక్కనున్న పిల్లలకు ఇది వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ తుంపర్లు పడిన చోట చేతులు పెట్టి వాటిని గొంతు, ముక్కు వద్ద తాకించినా ఇతరులకు సోవే అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలో కొన్ని ప్రయివేటు పాఠశాలలు ఈ స్కార్లెట్‌ జ్వరంపై తల్లిదండ్రులకు జాగ్రత్తలు సూచిస్తూ వాట్సాప్‌ సమాచారం పంపాయి. లక్షణాలు కన్పిస్తే…వెంటనే చికిత్స అందించాలని…వ్యాధి తగ్గే వరకు పిల్లలను పాఠశాలలకు పంపొద్దని అందులో సూచించాయి.
స్కార్లెట్‌ లక్షణాలు…
102 డిగ్రీలతో కూడిన జ్వరం
ఆకస్మాత్తుగా గొంతు నొప్పి
తలనొప్పి, వికారం, వాంతులు కడుపునొప్పి,
శరీరంపై దద్దుర్లు
నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారడం
గొంతు, నాలుకపై తెల్లని పూత
ట్రాన్సిల్స్‌ ఎరుపు రంగులో పెద్దవిగా కన్పిస్తాయి.

Spread the love