సీన్‌ రిపీట్‌!

Scene repeat!– ఇప్పుడు కూడా అందరికన్నా ముందే..
– ఈ సారైనా వ్యూహం ఫలించేనా..?
– నేడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫాంల అందజేత
– ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చెక్కును ఇవ్వనున్న కేసీఆర్‌
– బస్సు యాత్రకు ప్రణాళిక
– ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్న గులాబీ బాస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు మూణ్నెల్ల ముందే అభ్యర్థులను ప్రకటించి, అన్ని పార్టీల కంటే ముందే బీఫాంలను అందజేసిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌… ఈసారి కూడా అదే వ్యూహాన్ని అనుసరించబోతున్నారు. తద్వారా పార్టీ తరపున పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల్లో ఆయన జోష్‌ను నింపనున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకంటే ఒకడుగు ముందుకేసి అందరికంటే ముందుగానే బీఫాంలను అందజేయనుండటం గమనార్హం. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్న తరుణంలో సైతం అధికార కాంగ్రెస్‌ అభ్యర్థుల విషయంలో డైలమాలో ఉంది. ఇంకా మూడు స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలోని 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ… ఒకట్రెండు స్థానాల్లో వారిని మార్చేందుకు నానా తంటాలూ పడుతోంది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఈ విధంగా ఉంటే… కేసీఆర్‌ మాత్రం గురువారం తన పార్టీ అభ్యర్థులకు ఏకంగా బీఫాంలనే అందజేయనుండటం గమనార్హం. వాటితోపాటు ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.95 లక్షల చెక్కును పార్టీ తరపున ఆయన ఇవ్వనున్నారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు వీలుగా తన రాష్ట్రవ్యాప్త పర్యటనల నిమిత్తం బస్సు యాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను, సంబంధిత ప్రణాళికను ఆయన విడుదల చేయనున్నారు.
గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, లోక్‌సభ అభ్యర్థులతో భేటీ కానున్న ఆయన… ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను, ప్రచారం చేయాల్సి తీరును వివరించనున్నారు. అధికార కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజలకు ఎలా విడమరిచి చెప్పాలనే విషయమై ఆయన వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల టిక్కెట్లు ఇచ్చిన తర్వాత కూడా పలువురు నేతలు బీఆర్‌ఎస్‌కు హ్యాండిచ్చిన సంగతి విదితమే. వీరిలో కడియం శ్రీహరి, గడ్డం రంజిత్‌ రెడ్డి, కే.కేశవరావు తదితర సీనియర్లు కూడా ఉన్నారు. వీరితోపాటు ఖైరతాబాద్‌, భద్రాచలం ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తెల్లం వెంకటరావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు కూడా పార్టీని వీడారు. హైదరాబాద్‌ నగరంలో కీలక నాయకుడైన మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వారు సైతం సైలెంటయిపోయారు. ఈ నేపథ్యంలో కారు పార్టీలో నైరాశ్యం నెలకొంది. దీన్ని పోగొట్టి, క్యాడర్‌లో నూతనోత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్‌ పలు వ్యూహాలు రచించారు. అందులో భాగంగానే నిన్నటి వరకూ ఎండిన పంట పొలాల పరిశీలన పేరుతో జిల్లాల్లో పర్యటించిన ఆయన… ఇప్పుడు అన్ని పార్టీల కొంటే ముందుగా బీఫాంలను అందజేయటం ద్వారా నాయకులు, కార్యకర్తల్లో జోష్‌ను నింపేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వని ఆయన వ్యూహం… మరి లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్‌ను ఇవ్వబోతుందో చూడాలి.

Spread the love