తాండూర్‌ కాంగ్రెస్‌లో సీన్‌ రివర్స్‌..

– గెలుపు కోసం కాంగ్రెస్‌ అభ్యర్థి బుయ్యని తండ్లాట
– బీఆర్‌ఎస్‌ను వీడి మరీ కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ పొందిన
– బుయ్యని మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యే బరిలో అన్నీ అడ్డంకులే…
– సీనియర్లతో కుదరని సయోధ్య
– కొత్త, పాత నేతల మధ్య విబేధాలు
– కేవలం టికెట్‌ కోసం వచ్చాడని బుయ్యనిపై ఆరోపణ
– స్థానికేతరుడన్న ముద్ర కీలక సమయంలో కలహాలు
– పాతాళానికి కాంగ్రెస్‌ గ్రాఫ్‌
‘బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి..’ అనే సమేత ఇప్పుడు తాండూర్‌ కాంగ్రెస్‌కు అచ్చంగా సరిపోతుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైలెట్‌ను ఢకొీట్టేందుకు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన డీసీసీబీ చైర్మెన్‌ మనోహర్‌రెడ్డికి కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించింది. మొదట బుయ్యనిని వ్యతిరేకించిన స్థానిక కాంగ్రెస్‌ నేతలు అధిష్టానం జోక్యంతో సైలెంట్‌ అయ్యారు. దాంతో ఇక్కడ కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని అందరూ భావించారు. కానీ కొద్ది రోజుల్లోనే అభ్యర్థి బుయ్యని మనోహన్‌రెడ్డి వ్యవహార శైలితో సీన్‌ మొత్తం రీవర్స్‌ అయింది. కొత్త, పాత నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం, సీనియర్లను పట్టించుకోకపోవడంతో బుయ్యనిపై వ్యతిరేకత మొదలైంది. కేవలం టికెట్‌ కోసమే వచ్చాడన్న వాదన ఓ వైపు ఉంటే.. స్థానికేతరుడన్న వాదన మరోవైపు వినిపిస్తోంది. బుయ్యని ఒంటెద్దు పోకడలతో పార్టీ గ్రాఫ్‌ అమాంతం పాతాళానికి పడిపోయింది.
తాండూర్‌లో ఓటమి అంచులకు నెట్టబడుతున్న కాంగ్రెస్‌ గ్రాఫ్‌పై కథనం.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ కొన్ని స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా తాండూర్‌ నియోజకవర్గం ఇందులో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ చాలా మంది టికెట్‌ ఆశిం చినప్పటికీ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి గట్టి పోటీ ఇవ్వాలని.. ఎన్నికల ముందు పార్టీ మారిన డీసీసీబీ చైర్మెన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డికి కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించింది. బీఆర్‌ఎస్‌లో డీసీసీబీ చైర్మె న్‌గా ఉన్న మనోహర్‌రెడ్డి పరిగి టికెట్‌ ఆశించా రు. టికెట్‌ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ నుంచి పరిగి టికెట్‌ అవకాశం లేకపోవడం తో ఆ పార్టీ బుయ్యనికి తాండూర్‌ టికెట్‌ కేటాయిం చింది. అయితే మొదట ఆయన సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు గట్టి పోటీ అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. పోటీ ఇవ్వగలడా అన్న సందేహం నెలకొంది. దీనికి కారణాలు లేకపోలేదు.
సొంత నేతల మధ్య కలహాలు
తాండూర్‌ స్థానిక నేతల మధ్య కలహాలు తారాస్థాయికి చేరాయి. పాత, కొత్త నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఇదిలా ఉంటే సీనియర్లు సైతం పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. అసలు బుయ్యని మనోహర్‌రెడ్డి పార్టీలోకి రావడాన్ని స్థానిక క్యాడర్‌ మొదట స్వాగతించలేదు. అధిష్టానం జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో ప్రభావితం చేయనున్న సీనియర్‌ నాయకులు రమేష్‌ మహారాజు, మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు, డాక్టర్‌ సంపత్‌ కుమారులతో మాట్లాడి సర్దిచెప్పింది. అభ్యర్థి ఎవరు అనేది కాదు కాంగ్రెస్‌ గెలుపు ముఖ్యమని క్యాడర్‌ను ఉత్సహ పరిచింది. దాంతో క్యాడర్‌ కూడా బుయ్యని కోసం పనిచేయాలని భావించింది. కానీ ఇటీవల కాంగ్రెస్‌ అభ్యర్థి మనోహర్‌రెడ్డి నడవడికలో తేడాలు గమనించిన స్థానిక సీనియర్‌ నేతలు నొచ్చుకుంటు న్నారు. తమకు ప్రాధాన్యత తక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెరమీదకు స్థానికేతరుడు అనే ఆంశం
బుయ్యని మనోహర్‌రెడ్డి పరిగికి చెందిన వ్యక్తి. దాంతో అతను స్థానికేతరుడు అనే ఆంశం తెరమీదికి వచ్చింది. ఎన్నికల ముందు వచ్చిన వ్యక్తికి ఇక్కడి పరిస్థితులు ఏం తెలుస్తాయి అనే వాదన వినిపిస్తోం ది. ఇక్కడి సమస్యలపై ఎలాంటి పట్టు ఉంటుంది. రేపు గెలిచాక వాటిని ఎలా పరిష్కరిస్తారు.. అసలు స్థానికంగా ఉంటాడో లేదో అన్న సందేహాలు ప్రజల్లో ఉత్పన్నం అవుతున్నాయి. ఇదిలా ఉంటే తాండూరు మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సునీతసంపత్‌ ప్రభావం తాండూరు టౌన్‌లో ఎక్కువగా ఉంటుంది. వీరిని ఉపయోగించుకోవడంలో మనోహర్‌రెడ్డి నిర్లక్ష్యం వహించడం కూడా పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, సీనియర్‌ నాయకులు రమేష్‌ మహారాజులు ప్రభావితం ఉన్న ప్రాంతాలైన తాండూరు, బషీరాబాద్‌ మండలాలో వారికి బాధ్యతలు అప్పగించకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. దాంతోపాటు నేతల మధ్య సయోధ్య లేకపోవడం, పాత, కొత్త నేతల మధ్య విభేధాలు, ప్రచారం కూడా తూతూమంత్రంగా సాగడం అన్ని వెరసి తాండూ ర్‌లో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పాతాళానికి పడిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీటన్నీంటికీ కారణం అభ్యర్థి మనోహర్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలే అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా తాండూ ర్‌లో కాంగ్రెస్‌ గట్టేక్కడం కష్టామే అన్న భావన ఇటు పార్టీ నాయకు ల్లోను.. అటు ప్రజల్లోనూ బలంగా వినిపిస్తోంది.

Spread the love