నవతెలంగాణ – హైదరాబాద్ : కాటేదాన్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల బోల్తా పడింది.బస్సులో ఉన్న కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మైలార్ దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కాటేదాన్ టీఎన్‌జీవోస్ కాలనీ మణికంఠ హిల్స్‌లో పయనీర్ కాన్సెప్ట్ హై స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు సరైన రోడ్డు మార్గం లేదు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం పాఠశాల ముగిసే సమయంలో బస్సు డ్రైవర్ ఆదిల్ బస్సును పాఠశాల ఆవరణలోని ఓ ఎత్తయిన ప్రదేశంలో నిలిపాడు. అనంతరం బస్సుకు హ్యాండ్ బ్రేక్ వేసిన ఆదిల్.. బస్సు దిగి కిందకు వెళ్లాడు. కాసేపటికి విద్యార్థులు తమ ఇంటికి వెళ్లేందుకు ఆ బస్సు ఎక్కారు. అయితే, విద్యార్థులు ఆడుకుంటూ బస్సు హ్యాండ్ బ్రేక్‌ను తొలగించారు. దీంతో ఒక్కసారిగా బస్సు అతివేగంగా వెనక్కి వచ్చి, పార్కు చేసి ఉన్న ఓ ఇండికా కారును ఢీకొని బొల్తా కొట్టింది. బస్సులో ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో వెంటనే స్పందించిన స్థానికులు.. పిల్లలను బయటకు తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారని, అందులో పలువురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.