స్కూల్ టీచ‌ర్ టు ఫారెస్ట్‌ ఆఫీసర్‌

స్కూల్ టీచ‌ర్ టూ ఫారెస్ట్‌ ఆఫీసర్‌రుచి డవే… ఒకప్పుడు సాధారణ పాఠశాల ఉపాధ్యాయురాలు. ప్రకృతి అంటే ఎంతో ప్రేమ. దాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత మనుషులదే అని బలంగా నమ్ముతారు. అంతేకాదు దాని కోసం స్వయంగా కార్యచరణ మొదలుపెట్టారు. ఓ ఉపాధ్యాయినిగా తన పాఠశాల విద్యార్థినులకు ప్రకృతిపై ప్రేమను పెంచారు. ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిని వదిలి అటవీ సంరక్షణ అధికారిగా మారి పర్యావరణం కోసం ఎంతో కృషి చేస్తున్న ఆమె పరిచయం…
పదిహేనేండ్ల కిందటి సంగతి ఇది. గుజరాత్‌లోని తలాజా పట్టణంలోని నవ్‌కర్‌ మంత్ర బాలికల ఉన్నత పాఠశాల అది. ఆ పాఠశాలకు చెందిన విద్యార్థినుల బృందం పర్యావరణ విద్యలో ఓ ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. పాఠశాలకు వెళ్లేటప్పుడు ఆ అమ్మాయిలు స్థానిక వ్యవసాయ క్షేత్రాల నుండి గొంగళి పురుగులను సేకరించి తెచ్చుకునేవారు. వాటిని పెంచడానికి, పరిశీలించడానికి ప్రత్యేక తరగతి గదిని ఏర్పాటు చేసుకున్నారు. అలా తెచ్చుకున్న గొంగళి పురుగులు సీతాకోకచిలుకలుగా మారిన తర్వాత తిరిగి వాటిని అడవిలోకి వదిలేవారు. ఇలా ఆ బాలికలు మొక్కల సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణలో విలువైన పాఠాలు నేర్చుకునేవారు. ఇది సాధారణ పాఠశాల ప్రాజెక్ట్‌ కంటే ఎక్కువగా మారిపోయింది. తమ పాఠశాల ఉపాధ్యాయురాలు రుచి డేవ్‌ ద్వారా వారు పొందిన స్ఫూర్తి. ఇది ఆమె నుండి ప్రకృతిని ప్రేమించడం, ఆరాధించడం నేర్చుకున్నారు.
సాహసోపేతమైన నిర్ణయం
నేడు రుచి పర్యావరణ పరిరక్షణకు ఒక వెలుగుగా మారారు. గుజరాత్‌ అటవీ శాఖలో అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ గా సేవలందిస్తున్నారు. ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా మారిన ఈ ఉపాధ్యాయురాలి ప్రయాణం సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. గణనీయమైన మార్పును ప్రేరేపిస్తుంది. 12 ఏండ్ల పాటు తన జీవితాన్ని బోధనకు అంకితం చేసిన రుచి 2016లో తరగతి గదిని వదిలి గుజరాత్‌ అటవీ శాఖలో చేరాలని సాహసోపేతమైన నిర్ణ యం తీసుకున్నారు. ప్రకృతి, విద్య పట్ల ఆమెకున్న ప్రేమ ఓ కొత్త ప్రయత్నంగా వ్యక్తీకరించబడింది. అంతేకాదు గుజరాతీలో సీతాకోక చిలుకల గురించిన ఒక పుస్తకాన్ని అప్నా పతంగియా (మా సీతాకోకచిలుకలు) పేరుతో ప్రచురించారు. 700కి పైగా చిత్రాలు, ఇలస్ట్రేషన్‌లతో నిండిన ఈ 424-పేజీల కళాఖండం అతి తక్కువ కాలంలోనే ఎంతో ప్రాచూర్యం పొందింది. పాఠకుల హృదయాలను దోచుకుంది. ప్రకృతి పరిరక్షణ పట్ల ఆమె దృక్పథాన్ని విస్తృతం చేసింది.
కొత్త అధ్యాయం
2016లో రుచి గుజరాత్‌ అటవీ శాఖకు మారడంతో ఆమె జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయింది. ఆమె కోయంబత్తూరులోని సెంట్రల్‌ అకాడమీ ఫర్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌లో శిక్షణ పొందారు. అక్కడ పర్యావరణ పరిరక్షణపై మరింత అవగాహన పెంచుకున్నారు. అక్కడే ఆమె ‘ఎ పిక్టోరియల్‌ ఫీల్డ్‌ గైడ్‌ టు బటర్‌ఫ్లైస్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ క్యాంపస్‌’ అని రాశారు. అప్పుడు కోయంబత్తూరు సీతాకోక చిలుకలపై ఆమె మరింత ప్రేమ పెంచుకున్నారు. ‘వాటి మనోహరమైన జీవిత చక్రం, శక్తివంతమైన రంగులతో పిల్లల నుండి పెద్దల వరకు ఎవరినైనా ఆకర్షించగలవు. అవి మనలో ఉత్సుకతో పాటు పర్యావరణానికి లోతైన సంబంధాన్ని ప్రేరేపిస్తాయి’ అని రుచి పంచుకున్నారు.
ఔషధ మొక్కల తోట
ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే సమయంలో తన కెరీర్‌ మొత్తంలో రుచి గిర్‌ వన్యప్రాణుల అభయారణ్యంతో సహా అనేక కీలకమైన పరిరక్షణ ప్రాంతాలలో పనిచేశారు. స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ వద్ద ఔషధ మొక్కల తోట అయిన ఆరోగ్య వాన్‌ను అభివృద్ధి చేయడం ఆమె అత్యంత ముఖ్యమైన పనులలో ఒకటి. ఈ ప్రాజెక్ట్‌ అప్పటి రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ దృష్టిని ఆకర్షించింది. ఆయన కూడా ఈ ఆరోగ్య వాన్‌ నుండి ప్రేరణ పొందారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఇలాంటి ఉద్యానవనాన్ని రూపొందించాలని అనుకున్నారు. ఈ ప్రయత్నంలో సహాయం చేయమని ఆయన రుచిని పిలిచారు. ఆమె నైపుణ్యంతో ఆరు ఎకరాల ఆరోగ్య వనం 2022లో ప్రాణం పోసుకుంది. యోగా భంగిమలో మానవుని ఆకారంలో ఉన్న ఈ ఉద్యానవనం మొక్కలలోని ఔషధ గుణాలను ప్రదర్శిస్తుంది. సందర్శకులకు ఆయుర్వేద ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
గ్లాస్‌ వాటర్‌ బాటిల్‌ ప్లాంట్‌
పర్యావరణ పరిరక్షణ పట్ల రుచి నిబద్ధత సైద్ధాంతిక పరిజ్ఞానానికి మించినదిగా చెప్పుకో వచ్చు. ఆమె పర్యావరణ సమస్యలను పరిష్కరిం చడానికి ఒక వినూత్నమైన, ఆచరణాత్మక విధానాన్ని తీసుకుంటారు. గుజరాత్‌లోని పదమ్‌దుంగారి ఎకో-టూరిజం సెంటర్‌లో పనిచేసిన సమయంలో గ్లాస్‌ వాటర్‌ బాటిల్‌ ప్లాంట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను తొలగించే ప్రాజెక్ట్‌కు ఆమె నాయకత్వం వహించారు. ఈ ప్రయత్నం ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా స్థానికంగా ఉపాధిని కూడా కల్పించింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎకో టూరిజం సైట్‌లకు మోడల్‌గా మారింది. గ్లాస్‌ వాటర్‌ బాటిల్‌ ప్లాంట్‌ విజయం, సమాజ సాధికారతతో పరిరక్షణను మిళితం చేయగల ఆమె సామర్థ్యానికి ఒక ఉదాహరణ మాత్రమే.
ఆచరణలో నడిపించడం ద్వారా
రుచి అభిరుచి, కృషి, నాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు అమితమైన గౌరవాన్ని సంపాదించిపెట్టాయి. అంతేకాదు ఆమె ఇటీవలే అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌గా పదోన్నతి కూడా పొందారు. ఇప్పు డు దక్షిణ గుజరాత్‌లోని ధరంపూర్‌ సబ్‌-డివిజన్‌లో సేవలందిస్తున్న రుచి హ్యాండ్‌-ఆన్‌ విధానంతో కొనసాగుతున్నారు. వన్యప్రాణుల పరిరక్షణలో ఫలితాలు ఉపన్యాసాల నుండి కాకుండా ఆచరణలో నడిపించడం ద్వారా వస్తాయని ఆమె నమ్ముతున్నారు.
అంతరించిపోతున్న జాతులపై
‘ప్రకృతి ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు, దాని సంరక్షణలో చురుగ్గా పాల్గొన్నప్పుడు మాత్రమే పరిరక్షణ సాధ్యమవుతుంది’ అని ఆమె ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. విద్య కోసం ఆమె చేసిన కృషి తన భవిష్యత్తు పరిరక్షణ ప్రయత్నాలకు పునాది వేసింది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో అంతరించిపోతున్న జిప్స్‌ రాబందు జాతులపై తన డాక్టరల్‌ పరిశోధన పూర్తి చేశారు. తర్వాత రుచి భావ్‌నగర్‌, అమ్రేలి జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో రాబందుల సంరక్షణపై పని చేయడం ప్రారంభించారు.

Spread the love