తెలంగాణలో పిల్లలకు అనుకూలంగా మారనున్న స్కూల్ టైమింగ్స్..!

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో పాఠశాలల టైమింగ్స్‌లో కొన్ని మార్పులు చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. ఉన్నత పాఠశాలలు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో కొంత ముందుగా మొదలవుతాయి. అయితే.. ప్రాథమిక పాఠశాలల్లో చదివేది చిన్నారులైనందున వారు ఉదయం త్వరగా నిద్ర లేవరు. అందువల్ల వారికి ఉదయం 9.30 గంటలకు తరగతులకు మొదలు కావాలి. ఉన్నత పాఠశాలల్లో ఉండేది పెద్ద పిల్లలైనందున ఉదయం 9 గంటలకు మొదలుకావాలి. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా స్కూల్‌ టైమింగ్స్‌ ఉన్నాయని కొందరు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తెచ్చారు. దీంతో.. అన్ని పాఠశాలలను ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో టైమింగ్స్‌ మార్పుపై ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Spread the love