‘బడులు’ శిథిలం.. సౌకర్యాలు అధమం..!

'Schools' are dilapidated.. the facilities are bad..!– ఎన్నో ఏండ్లుగా మరమ్మతులు బంద్‌
– అధ్వానంగా గిరిజన ప్రాథమిక పాఠశాలలు
– అవస్థల మధ్యే గిరి విద్యార్థుల చదువు
– ఆలస్యంగా ‘అమ్మ ఆదర్శం’ నిధుల విడుదల
ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలు అధ్వాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. గోడలు పగుళ్లు తేలి.. స్లాబ్‌లు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. కిటికీలు విరిగిపోయి.. తలుపులు పగిలిపోయి దుర్భరంగా ఉన్నాయి. ఏండ్ల కిందట నిర్మించిన భవనాలు కావడంతో శిథిలమవుతున్నాయి. మధ్యలో కనీసం మరమ్మతులు కూడా చేయించలేదు. ప్రభుత్వం ఈ బడులను కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల తరహాలోనే మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయాలని సంకల్పించినా.. నిధుల విడుదలలో ఆలస్యం వల్ల గిరిజన ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో ఇంకా ప్రారంభించలేదు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ‘నవతెలంగాణ’ పరిశీలించగా.. అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
8గాదిగూడ మండలం పర్శవాడ(కే) పంచాయతీ పరిధిలోని ధర్ముగూడ గిరిజన ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. దీంతో విద్యార్థులకు చెట్ల కింద చదువులు చెబుతున్నారు.
8ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం అంకోలి పంచాయతీ పరిధిలోని చింతగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పరిస్థితి ఇది. ఇక్కడి పాఠశాల భవనం పగుళ్లు తేలడంతో పాటు కింద ఫ్లోరింగ్‌ గుంతలు పడింది. కిటికీలు కూడా లేకపోవడంతో విష పురుగులు లోనికి వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన ప్రాథమిక పాఠశాలలు 900 ఉన్నాయి. ఒకటి, రెండు తరగతులుంటాయి. ఆ పాఠశాలల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాఠశాలల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘అమ్మ ఆదర్శం’ కింద నిధులు కేటాయించారు. ఆయా గ్రామాల్లో ఏండ్ల కిందట నిర్మించిన ఈ పాఠశాలల భవనాలు చాలా చోట్ల శిథిలావస్థకు చేరుకున్నాయి. స్లాబ్‌ పెచ్చులూడిపోయి ఉండటంతో వర్షం వచ్చినప్పుడు తరగతి గదుల్లోకి నీరు చేరుతోంది. మరోపక్క కింద ఫ్లోరింగ్‌కు గుంతలు పడి కూర్చునేందుకు వీల్లేకుండా మారాయి. కిటికీలకు తలుపులు ఊడిపోవడంతో వర్షం జల్లు నేరుగా తరగతి గదిలోకి వస్తోందని పిల్లలు చెబుతున్నారు. వంట గదులు ప్రత్యేకంగా లేకపోవడం కూడా సమస్యగా మారుతోంది. కొన్ని చోట్ల తరగతి గదుల్లో కూర్చునేందుకు వీల్లేకుండా ఉండటంతో చెట్ల కిందనే చదువులు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోపక్క అనేక చోట్ల ఇప్పటికే ఉన్న విద్యుత్‌ సరఫరాను కూడా తొలగించడంతో విద్యార్థులు ఉక్క పోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని ఓ పాఠశాలలో కనెక్షన్‌ లేని విద్యుత్‌ మీటరుకు పిట్టగూడు పెట్టడం గమనార్హం. మరో పాఠశాలలో ఫ్యాన్లు ఉన్నా కరెంటు సరఫరా లేకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది.
ప్రారంభంకాని పనులు..!
ఇప్పటికే జిల్లా పరిషత్‌, ప్రభుత్వరంగ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద మౌలిక వసతులు కల్పిస్తున్నారు. మేజర్‌, మైనర్‌ రిపేర్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పి స్తున్నారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా చేపడుతున్న ఈ పనులు దాదాపు 80శాతం పాఠశాలల్లో పూర్తి కావచ్చాయని విద్యాశాఖ అధికారులు చెబుతు న్నారు. వీటి మాదిరిగానే ఐటీడీఏ పరిధిలోని సుమారు 900 గిరిజన ప్రాథమిక బడులను సైతం తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా ఇటీవల ఈ బడుల్లో మౌలిక సదుపాయాల కోసం ఒక్కో పాఠశాలకు రూ.25వేల చొప్పున నిధులు విడుదల చేసినట్టు అధికారవర్గాలు చెబుతు న్నాయి. కానీ ఒకటి, రెండు చోట్ల తప్పితే ఎక్కడా ఈ పనులు ప్రారంభం కాలేదు. కొన్ని గ్రామాల్లో ఈ పథకం కింద చేపడుతున్న పనులపై అవగాహన కూడా లేకపోవడం గమనార్హం. క్షేత్రస్థాయి వరకు ఈ పథకంపై ఆయా గ్రామాల్లో అవగాహన కల్పించడం లేదని తెలుస్తోంది.
నిధులు ఆలస్యంగా మంజూరయ్యాయి –దిలీప్‌, ఐటీడీఏ డీడీ
ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమ్మ ఆదర్శ పాఠశాలల మాదిరిగా సౌకర్యాలు కల్పిస్తాం. నిధులు ఆలస్యంగా మంజూరు కావడంతో పనులు ప్రారంభం కాలేదు. త్వరలోనే ఆయా బడుల్లో పనులు మొదలుపెట్టి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం.

Spread the love