కారణాలేవైనా ఇటీవల తెలుగు నేలపై బాల సాహిత్య సృజన బాగా జరుగుతోంది. చేయి తిరిగిన సాహితీవేత్తలతో పాటు లేతలేత చేతుల బాలలూ సాహిత్య సృజన చేస్తున్నారు. మనం ఇదే వేదికపైన గతంలో అనేకమంది బాలలను రచయితలుగా చదివాం కదా! 2010లో సాహిత్య అకాడమి బాల సాహిత్యం లో పురస్కారం ప్రారంభించడం దానికి మరింత ఊతమిచ్చింది. అనేక మంది బాల సాహిత్యం రాయడం మొదలుపెట్టారు. అయితే 9వ దశకంలో రాసిన అనేకమంది అటు తర్వాత ఎందుకో ఆగి పోయారు. మరికొందరు అడపాదడపా రాస్తున్నారు. ఇంకొందరు నిరంతరం రాస్తూనే ఉన్నారు. మరికొందరు ‘గంగి గోవుపాలు’ అన్న చందం గా నిలిచిపోయే మేలిమి రచనలు చేసి ఇప్పటికీ వెలుగుతున్నారు. అలా వెలుగుతున్న వారిలో ఒకరు కొండ్ల రామచంద్రం.
ఇటీవల బాల సాహిత్య సృజన చేస్తున్న వారికి ఈ పేరు కొత్తగా అనిపించవచ్చు. కానీ రెండు దశాబ్దాల క్రితమే బాల సాహిత్య రచన, ప్రచురణ చేయడమే కాకుండా దేశ విదేశాల్లో తన గేయ ‘చంద్రిక’లతో వెలిగిన బాల చంద్రిక ఈయన. కవి, రచయిత, ‘మెరుపులు’ లఘు ఛందస్సు రూపకర్త కూడా. నిన్నటి కరీంనగర్ (నేటి సిద్ధిపేట) జిల్లా బెజ్జంకి రామాలయం తెలంగాణలో ప్రసిద్ధి. మే 1, 1965న బెజ్జంకిలో పుట్టారు రామచంద్రం, కొండ్ల నర్సమ్మ, నారాయణ వీరి అమ్మానాన్నలు.
తెలుగు ఉపాధ్యాయునిగా చేరి ప్రస్తుతం పెద్దపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్రధానో పాధ్యాయునిగా ఉన్నారు. ప్రవృత్తిరీత్యా విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తితో తాను పనిచేసిన ప్రతి చోట కృషి చేశాడు. సైన్స్ అవగాహనతో పాటు, ఓజోన్ పరిరక్షణ వంటి వాటిపై అనేక ప్రసంగాలు చేసి సైన్స్ సెంటర్ నుండి ప్రశంసలు అందుకున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ‘సైన్స్ డే’ సందర్భంగా పురస్కారాలు పొందారు. ఉపాధ్యాయునిగా సత్కారాలు అందుకున్న రామచంద్రం బాల సాహితీవేత్తగా సిరిసిల్ల రంగినేని చారిటబుల్ ట్రస్ట్ రేగులపాటి లక్ష్మి పిల్లల పండుగ ‘విశిష్ట బాల సాహిత్య పురస్కారం’, కరీంనగర్ శరత్ సాహితీ స్రవంతి ‘బాల నేస్తం’ పురస్కారం, కవిత్వంలో విశ్వ సాహితీ పురస్కారం, జైశెట్టి రమణయ్య ఉపాధ్యాయ పురస్కారం, కరీంనగర్ జిల్లా ఉపాధ్యాయ పురస్కారంతో పాటు మరో ముప్ఫైపైగా సత్కారాలు అందుకున్నారు. కవిగా తాను ఏర్పరచుకున్న గేయ ఛందస్సులో ‘మెఱుపులు’ లఘు కవితా సంపుటి తెచ్చారు. ఇది హందీలోకి అనువాదమయ్యింది. ‘ధర్మపీఠం’ ఆధ్యా త్మిక వ్యాస సంకలనం అచ్చులోకి రావాల్సి వుంది.
బాలల కోసం 2012లో ప్రారంభించిన ‘బాలల నేస్తం’ పత్రికకు సంపాదక బాధ్యతలతో అన్నీ తానై నిర్వహించాడు. తన ఇంటినే విజ్ఞానశాస్త్ర మ్యూజియం గా మలచిన ఈయన తన వందలాది సైన్స్ ప్రయోగాలకు వ్యర్థాలను, వ్యర్థపదార్థాలను ఉపయోగించాడు. బాల సాహితీవేత్తగా కొండ్ల రామచంద్రం తొలి రచన ‘బాల చంద్రిక’ బాలగేయ సంపుటి. ఇది 2005లో వచ్చింది. తర్వాత రాసిన రచన ‘కుట్టిగాడు-కుక్కపిల్ల’ బాలల నవల. బాల చంద్రిక విషయానికి వస్తే అచ్చయిన కొద్ది కాలంలోనే ఖ్యాతిచెందడమే కాదు విదేశాల్లో ప్రశంసలందు కుంది. అజో-విబో కందాళై బుక్ లింక్‌లో చేరడంతో మరింతగా పేరు తెచ్చుకుని వందలాది ప్రతులు అమ్ముడైంది. ముప్ఫై ఆరు పాటల ఈ బాలచంద్రిక పిల్లల స్థాయిలో, వారికి నచ్చే విధంగా, వాళ్ళు మెచ్చే విధంగా ఉంటాయి. ఇందులోని ‘కొమ్మమీద కోయిలమ్మ కుహూ అన్నది/గోడమీద పెద్దబల్లి కిటకిటన్నది/ బండకింద కప్పలేమో బెకబెకన్నవి/గట్టుమీద లేగ దూడ అంబా అన్నది/గేటు వద్ద కుక్కపిల్ల భౌవ్వుమన్నది’ అన్నపాట ‘బుర్రుపిట్ట బుర్రుపిట్ట’ పాటను గుర్తుకు తెస్తుంది. గేయాన్ని అందంగా నడిపించడమేగాక చివరగా చక్కని కొస మెరుపును చూపడం ఈయనకు బాగా తెలుసు… అటువంటిదే ‘అమ్మ మనసు’ పాట. ‘చింతకాయ పుల్లన/పాలు పెరుగు కమ్మన/ చాకిలేటు తియ్యన/ …అమ్మమాట కమ్మన/ అమ్మమనసు చల్లన’ అంటాడు ఇందులో. పిల్లల చేష్టలను, బాలల మనసును బాగా ఎరిగిన రామచంద్రం ‘చిట్టిపొట్టి కుట్టిగాదు చిన్నవాడు/ అక్క పుస్తకాలు అన్ని చింపినాడు/తాత చేతికర్ర దాచిపెట్టినాడు/.. పారిపోయి అమ్మ చాటు దాగినాడు’ అంటాడు. పిల్లలకు బుద్ధులు చెప్పడానికి ఆరోగ్య సూత్రాలు నేర్పడానికి కూడా అ బాల సాహితీవేత్త గేయాలను తన ‘ఉపకరనం’ చేసుకున్నడు.
అటువంటిదే ‘అరెరే! అరెరే! బుచ్చోడు/పెద్దగ గోళ్లను పెంచాడు/ మట్టిలో ఆటలు ఆడాడు/… గబగబ అన్నం తిన్నాడు/ గిలగిలలాడుతు ఉన్నాడు/ హాస్పిటలుకు తెచ్చారు’ అంటూ తర్వాత జరిగిన తతంగాన్ని పిల్లలకు తెలిసేలా రాస్తాడు. ‘తాతగారి తలపైనా పిలక ఉన్నది/పిలకలోన ఎన్నెన్నో మెలికలున్నవి’, ‘ఊడల మఱ్ఱికి ఊయల కట్టీ /ఊగూ ఊగూ ఉయ్యాల’, ‘కొమ్మమీద కోతి ఒకటి గెంతుతున్నది/కొట్టబోతె మీదిమీది కొచ్చుచున్నది / పలకరిస్తె పళ్లు బయట పెట్టుతున్నది’ అంటూ రాసాడు. పిల్లల్లో బేధభావాలు ఉండొద్దని, అందుకు బాల్యం నుండే వారికి నేర్పాలని భావించిన కవి కొండ్ల ‘కాకి ఒకటి కోకిలతో/ కావుకావు మన్నది/ కోకిలమ్మతోని కాకి/ కుహూ కుహూ అన్నది’ అంటూ ముగింపులో ఆయా పక్షుల లక్షణా లను లక్షణంగా వివరిస్తాడు. ఇంకా ఊరు గురించి, లీడర్ గురించి, చదువు గురించి, పిల్లలు, మామిడి చెట్ట, బడిసంచి, గండుపిల్లి, సున్నాలు, సత్తిపండు గోల వంటి ఎన్నెన్నో చక్నని లయాత్మకగేయాలను అందించాడీ గేయవిద్య తెలిసిన కవి రామచంద్రం. త్వరలో పిలలకు తాయిలంగా వీరి మరో రెండు పుస్తకాలు రానున్నయని తెలిపారు. అభినందనలు. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఈ పెద్దబడి పెద్దసారు పిల్లల కోసం తాను, తన టీం రూపొందించిన అనేక వర్కింగ్ మాడల్స్‌తో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈయన ఆలోచనలో మనం భాగం పంచుకుందాం మరి!
డా|| పత్తిపాక మోహన్
9966229548