– ఈసీ ముసాయిదాపై నిరసన
– 300 మంది అరెస్ట్
గువహతి : అస్సాంలో నియోజకవర్గాల పునర్విభజన పేరిట ముస్లిం జనాభా అధికంగా ఉండే అసెంబ్లీ స్థానాలను కుదిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిపాదించిన ముసాయిదాను బారక్ లోయ ప్రజలు తీవ్రంగా నిరసించారు. ఈసీ నిర్ణయాన్ని తప్పుపడుతూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు 300 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాలతో పాటు స్థానిక సంస్థలలో వార్డులను కూడా పునర్విభజించేందుకు ఎన్నికల కమిషన్ ముసాయిదాను ప్రకటించింది. దీనిని వ్యతిరేకిస్తూ బారక్ ప్రజాస్వామ్య కూటమి బంద్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ మద్దతు తెలిపాయి. లోయలో దుకాణాలు, వ్యాపార సముదాయాలను మూసివేశారు. అధికార బీజేపీ అజెండాకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ ముసాయిదాను ప్రతిపాదించిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న పలు అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలని, వాటిని హిందువులు అధికంగా నివసిస్తున్న వేర్వేరు కొత్త నియోజకవర్గాలలో కలపాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది. బారక్ లోయలో 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిని 13కు తగ్గించాలని ముసాయిదాలో ప్రతిపాదిం చారు. అలాగే బార్పేటలో స్థానాలను ఎనిమిది నుండి ఆరుకు తగ్గిస్తారు. ఇవన్నీ ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న స్థానాలే. అయితే ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాల సంఖ్యను పెంచుతారు. ముసాయిదా ప్రతిపాదన బారక్ లోయ ప్రజలకు, ముస్లింలకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కమలాక్ష్య డీ పురుకాయస్థ విమర్శించారు. పునర్విభజన ప్రక్రియలో ఎలాంటి మార్గదర్శకాలు పాటించలేదని ఆయన చెప్పారు. గతంలో పునర్విభజన చేపట్టినప్పుడు బారక్ లోయ జనాభా 20 లక్షలు ఉండేదని, ఇప్పుడది 45 లక్షలకు పెరిగిందని అంటూ అలాంటప్పుడు సీట్లు తగ్గించడ మేమిటని ప్రశ్నించారు.